- 135 ఏండ్ల సింగరేణి చరిత్రలో మొట్టమొదటి కేంద్రం..
- డ్రోన్, సోలార్ టెక్నీషియన్ కోర్సులు ప్రారంభం
- త్వరలో మరిన్ని కోర్సులు
- సింగరేణి యూత్, నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని వివేక్ సూచన
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. సింటార్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌తో కలిసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌తో ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 135 ఏండ్ల సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారిగా మందమర్రిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. సంస్థ సీఎండీ బలరాం నాయక్, మందమర్రి జీఎం మనోహర్ కృషి వల్లే ఇది సాధ్యమైందని, ఈ సందర్భంగా వారికి, వారి టీంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
సెంటర్ ఏర్పాటుపై మొదట తనకు అపోహ ఉండేదని, అయితే, ఏకంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. సింగరేణి చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్టూడెంట్లు, నిరుద్యోగులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలని సూచించారు. ప్రస్తుతం డ్రోన్, సోలార్ టెక్నీషియన్ కోర్సులను ప్రారంభించామని, త్వరలో కాస్మోటాలజీ, సెల్ టెక్నిషీయన్, టూ వీలర్ మెకానిక్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్, కంప్యూటర్, డీటీపీ, ఇంటర్నేట్ ఆఫ్ థింగ్స్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని కోర్సులు తీసుకొచ్చి, శిక్షణ ఇస్తామని వెల్లడించారు. మందమర్రి, చెన్నూరులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం.. సింగరేణి ద్వారా మొదటి సెంటర్‌ను మందమర్రిలో ప్రారంభించుకోవడం గొప్ప విజయమన్నారు. తాను అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలను సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో స్థానికులకు ఇచ్చేలా కృషి చేశానని వివేక్ చెప్పారు.
పరిశ్రమలు పెట్టాలని అడుగుతున్నరు..
సింగరేణిలో పరిశ్రమలు పెట్టాలని ప్రజలు అడుగుతున్నారని, అయితే, ఇక్కడ కేవలం బొగ్గు ఆధారిత ఇండస్ట్రీస్‌కు మాత్రమే చాన్స్ ఉందని వివేక్ అన్నారు. సింగరేణి సంస్థ రూ.30 వేల కోట్ల టర్నోవర్‌తో ఏటా 68 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ 40 వేల మంది కార్మికులకు ఉద్యోగాలను కల్పిస్తోందని చెప్పారు. కార్మికులకు 32 శాతం లాభాలు పంచిన ఏకైక సంస్థ సింగరేణి అని పేర్కొన్నారు.
సింగరేణి యాజమాన్యం టెండర్లలో పాల్గొని కేకే-6, శ్రావణపల్లితో ఇతర బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) ఎన్‌వీకే శ్రీనివాస్, మందమర్రి ఏరియా జీఎం మనోహర్, సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు, సీఎంవోఐ జనరల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ ఆర్డీఎస్డీఈ జాయింట్ డైరెక్టర్ విద్యానంద్ తదిరులు పాల్గొన్నారు.
సీఎం, ఎమ్మెల్యే వివేక్ వల్లే సెంటర్ ఏర్పాటు: సింగరేణి సీఎండీ
సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించారని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. వారి సూచన మేరకే మొదటి సెంటర్‌ను మందమర్రిలో ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్కిల్ డెవల ప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
వంశీకృష్ణ ఆలోచనతోనే స్టేట్ లెవల్ క్రికెట్ పోటీలు
వచ్చే ఏడాది నుంచి కాకా వెంకటస్వామి స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని వివేక్ వెంకటస్వామి చెప్పారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ప్రస్తుతం పార్లమెంట్ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామని, యువనేత గడ్డం వంశీకృష్ణ ఆలోచనతోనే వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
తాను, తన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్లుగా పనిచేసిన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేసి, క్రీడాకారులను ప్రోత్సాహించామని గుర్తుచేశారు. తమ తండ్రి కాకా వెంకటస్వామికి పేదల కష్టాలు తెలిసినందునే 70 వేల మందికి ఇంటి స్థలాలు ఇప్పించారన్నారు. సింగరేణి సంస్థ నష్టాల బారినపడిన టైమ్‌లో రూ.400 కోట్లు ఇప్పించి సంస్థను కాపాడి, లక్ష మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించారన్నారు.
1998లో కేంద్ర జౌళీ శాఖ మంత్రిగా కాకా పనిచేసిన కాలంలో రూరల్ డెవలప్‌మెంట్ కోసం రూ.5 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల బడ్జెట్‌కు కృషి చేశారన్నారు. ఈ రోజు అది లక్ష కోట్లకు చేరుకుందని, దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో పనిచేసే కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత కాకాకు దక్కుతుందని చెప్పారు.