రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి 88 కోట్ల డివిడెండ్..సీఎంకు చెక్కు అందజేసిన బలరాం

హైదరాబాద్‌, వెలుగు: 2023–-24  సంవ‌త్సరానికిగాను రాష్ట్ర సర్కారుకు సింగ‌రేణి కాల‌రీస్ రూ.88.55 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ మేర‌కు చెక్కును సింగ‌రేణి సీఎండీ బ‌ల‌రామ్, సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్కకు శనివారం రాత్రి అందజేశారు. సింగ‌రేణి కాల‌రీస్ చెల్లింపు మూలధ‌నంలో 10 శాతాన్ని డివిడెంట్‌గా చెల్లించాల‌ని నిర్ణయించారు.

ఈ మొత్తం దాదాపు రూ.173 కోట్లు కాగా, సింగ‌రేణిలో 51 శాతం వాటా క‌లిగిన రాష్ట్ర సర్కారుకు ఇందులోంచి రూ.88.55 కోట్లు డివిడెండ్‌గా చెల్లించారు. సింగ‌రేణి సంస్థ కార్మికుల‌కు లాభాల వాటా చెల్లించ‌డ‌మే కాకుండా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి డివిడెండ్‌లు చెల్లించ‌డంపై రేవంత్ రెడ్డి, భట్టి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, బోధ‌న్ ఎమ్మెల్యే సుద‌ర్శన్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.