- కొత్తగా భూ సేకరణకు ఇబ్బందులు
- యార్డ్‌ల ఎత్తును 150 మీటర్లకు పెంచేందుకు కసరత్తు
- పర్యావరణ, భూభౌగోళిక పరిస్థితులపై అధ్యయనం
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల నుంచి వెలికి తీస్తున్న మట్టి నిల్వ చేసే యార్డుల ఎత్తు పెంపుపై సింగరేణి ఫోకస్ చేసింది. వందల మీటర్ల లోతులో ఉన్న బొగ్గును వెలికితీసే క్రమంలో మొదటగా తీస్తున్న మట్టిని ఓసీపీ సర్ఫేస్‌లోని ప్రత్యేక ప్రాంతాల్లో కుప్పలుగా పోస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 ఓపెన్ కాస్ట్ మైన్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి రోజు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీసి డంప్ యార్డుల్లో పోస్తున్నారు. ఇప్పుడు కొత్తగా భూ సేకరణ చేసేందుకు సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇప్పటికే ఉన్న యార్డుల్లో ఎత్తును పెంచి మట్టిని నిల్వ చేయాలని భావిస్తున్నారు.
గతంలో మూడు సార్లు పెంపు
సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓపెన్ కాస్ట్ డంప్ యార్డుల ఎత్తు సాధారణంగా 90 మీటర్లు ఉంటుంది. పదేళ్ల క్రితం వరకు మట్టి కుప్పలు 60 మీటర్ల ఎత్తు వరకే ఉండేవి. ఆ తర్వాత 90 మీటర్లకు పెంచారు. మూడేండ్ల కిందట ఈ ఎత్తును కాస్త 120కి పెంచారు. ప్రస్తుతం 150 మీటర్ల వరకు పెంచితే ఎలా ఉంటుంది ? పర్యావరణ సమస్యలు ఏమైనా ఉత్పన్నం అవుతాయా ? అనే అంశాలపై నిపుణులతో చర్చిస్తున్నారు. పర్యావరణ, భూభౌగోళిక ఎక్స్‌పర్ట్స్‌తో రామగుండం- 2 ఏరియాలోని ఓసీపీ 3 మట్టికుప్పలపై ఇప్పటికే సింగరేణి యాజమాన్యం అధ్యయనం చేయించింది. ఎక్స్‌పర్ట్స్ రిపోర్ట్ ఆధారంగా యాజమాన్యం మరోమారు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరం డంప్ యార్డుల ఎత్తును పెంచే అవకాశం ఉంది.
భూసేకరణకు కష్టాలు
సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ల కోసం వేలాది ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న ఓపెన్ కాస్ట్ గనులను విస్తరించడంలో భాగంగా వెలికితీసిన మట్టిని కుప్పలుగా పోసేందుకు భూసేకరణ చేయడానికి వీలు కావడం లేదు. ఓసీపీ ప్రారంభంలో భూసేకరణ సందర్భంగా స్థానికులకు సింగరేణి ఇచ్చిన హామీల్లో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విస్తరణకు అవసరమైన భూములు మరోసారి ఇచ్చేందుకు సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, భూయాజమానులు విముఖత చూపుతున్నారు. దీంతో సింగరేణికి భూసేకరణ సవాల్‌గా మారింది. కొత్తగా భూములను సేకరించే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న డంప్‌యార్డుల ఎత్తునే పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచన చేస్తోంది.