- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్
- బెల్లంపల్లి టౌన్‌కు ఎలాంటి ఇబ్బందులుండవ్
- టార్గెట్ కు ముందుగానే 100శాతం దాటిన ఉత్పత్తి
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ఓపెన్ కాస్ట్ మైన్ ఏర్పాటుకు యాజమాన్యం ప్రతిపాదనలు చేస్తోందని మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్ తెలిపారు. మంగళవారం ఆఫీస్‌లో మీడియా సమావేశంలో డిసెంబర్లో ఏరియాలోని బొగ్గు గనుల్లో జరిగిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. బెల్లంపల్లి -– అకినపల్లి మధ్యలోని అటవీ ఏరియాలో మూసివేసిన శాంతి ఖని యంక్లైన్ –-2 గనిలో మిగిలిన బొగ్గును వెలికితీసేందుకు ఫేజ్–1లో ఓపెన్‌కాస్ట్ మైన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇక్కడ 1ఇన్13 స్ర్టిప్పింగ్ రేషియాలో భారీగా బొగ్గు నిక్షేపాలున్నాయన్నారు. బెల్లంపల్లి టౌన్ కు సుమారు ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో టౌన్‌కు ఎలాంటి ఇబ్బందులుండని తెలిపారు.మైన్బౌండరీ, ఎంత స్థలం అవసరం వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నామని, మరో నెల రోజుల్లో క్లారిటీ వస్తుందని, తర్వాత మైనింగ్ప్లాన్తయారు చేస్తామని తెలిపారు. రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్‌లో వచ్చే ఫిబ్రవరి 15 వరకు బొగ్గు వెలికితీత పనులు కొనసాగుతాయని చెప్పారు.
రెండో ఫేజ్ ఫారెస్ట్పర్మిషన్లకు మినిస్ర్టీ ఆఫ్ ఫారెస్ట్ వెబ్ పోర్టల్‌లో ఆప్‌లోడ్ చేశామని, ఏడాదిన్నరలోపు పర్మిషన్లు వచ్చే చాన్స్ఉందని వివరించారు. రాబోయే కాలంలో కేకే –-5 ఓసీపీ ఏర్పాటు, శాంతి ఖని గనిలో 6 నుంచి 700 మీటర్ల లోతులో బొగ్గును వెలికితీసేందుకు లాంగ్వాల్ మైన్‌గా మార్చుతామన్నారు. ఇందుకు మైనింగ్‌ప్లాన్ అప్రూవల్వస్తే ఈసీ కోసం పబ్లిక్ హియరింగ్నిర్వహిస్తామన్నారు. శ్రావణపల్లి ఓసీపీ వస్తే 20 – 25 ఏండ్ల వరకు మందమర్రి ఏరియాకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.
ముందుగానే టార్గెట్ సాధించాం
రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్, కేకే- –5 గనుల్లో 2024 –-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందే వందశాతం టార్గెట్ సాధించామని తెలిపారు. ఆర్కేపీలో 7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి డిసెంబర్31 నాటికి 115 శాతం, కేకే –-5 గనిలో 1,50,000 టన్నులకు 1,50,602 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. కాసీపేట–2, కాసీపేట–1ఏ గనుల ఏరియాల్లో కొత్తగా శాండ్ స్ర్టవింగ్ ప్లాంట్లను నిర్మిస్తామన్నారు. కేకే ఓసీపీ ఏరియాలో మట్టి నుంచి ఇసుకను తయారు చేసే ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
ఇప్పటికే 43 మెగావాట్ల సోలార్‌పవర్ ప్లాంట్లు నడుస్తున్నాయన్నారు. మందమర్రి, బెల్లంపల్లిలోని నాలుగు ప్రాంతాల్లో మరో 67.5 మెగావాట్ల ప్లాంట్లను మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఏఎస్ వో టు జీఎం విజయప్రసాద్, ఏజీఎం ప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.