బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు

  • 70.02 మిలియన్ ​టన్నుల ప్రొడక్షన్​తో చరిత్ర  
  • గత మూడు నెలల్లోనే 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి 
  • రూ. 37వేల కోట్ల టర్నోవర్​సాధించిన సంస్థ
  • 2015–16, 2016–17లో టార్గెట్​రీచ్​ అయిన సింగరేణి 
  • ఇప్పుడు ఆల్​టైం రికార్డులు బ్రేక్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్​కంపెనీ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో చరిత్రను తిరగరాసింది. 135 ఏండ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా దాదాపు 70.02 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి గత రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో పాటు దాదాపు 69.80 మిలియన్​ టన్నుల బొగ్గు రవాణా చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 37వేల కోట్ల టర్నోవర్​ సాధించింది. దీంతో ఈసారి దాదాపు రూ. 2,500 నుంచి రూ. 3వేల కోట్ల మేర లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. 

 ఏడాదికేడాదికి పెరిగిన ఉత్పత్తి 

గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో నిర్ధేశించుకున్న బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం 100 శాతానికి పైగా ఉత్పత్తి సాధించి సత్తా చాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా 70.02 మిలియన్​టన్నుల బొగ్గును తవ్వి తీయగలిగింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 74 మిలియన్​టన్నులు టార్గెట్​పెట్టుకోగా 67.14 మిలియన్​ టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలైన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే దాదాపు 20 మిలియన్​ టన్నులను ఉత్పత్తి చేసింది. కాగా, 2015-–16లో 60.03 మిలియన్​టన్నుల లక్ష్యాన్ని పెట్టుకున్న సింగరేణి  60.38 మిలియన్​టన్నుల ఉత్పత్తి సాధించింది. అంతకుముందు సంవత్సరం 2016–- 17లో    61 మిలియన్​టన్నుల టార్గెట్​పెట్టుకుని 61.34 మిలియన్​టన్నుల ప్రొడక్షన్​తో వంద శాతానికి పైగా లక్ష్యాన్ని చేరుకోగలిగింది. అయితే ఈసారి మాత్రం  70.02 మిలియన్​టన్నులతో అందనంత ఎత్తులో నిలిచింది. 

ఈ ఏరియాలు సింగరేణికి మణిహారాలు 

ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్​జిల్లాల్లోని12 ఏరియాల్లో సింగరేణి విస్తరించింది. ఇందులో ఇల్లెందుతో పాటు, కొత్తగూడెం, మణుగూరు, బెల్లంపల్లి, ఆర్జీ–1, ఆర్జీ–2, ఆర్జీ–3 ఏరియాలు మాత్రమే నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలిగాయి. అత్యధికంగా కొత్తగూడెం ఏరియా 138 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి రికార్డు సృష్టించింది. భూపాలపల్లి ఏరియా అన్ని ప్రాంతల కంటే వెనుకబడి ఉంది. బొగ్గు ప్రొడక్షన్​లో ఓసీపీలు కీలక భూమిక పోషించాయి. 

బొగ్గు రవాణాలోనూ రికార్డే  

2019-–20లో 62.45 మిలియన్​ టన్నులు, 2020-–21లో 48.51, 2021-–22లో 65.53 , 2022-–23లో 66.69 మిలియన్​టన్నులు రవాణా చేసిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం 69.80 మిలియన్​ టన్నులను రవాణా చేసి రికార్డులు సృష్టించింది.  గత శనివారం ఒక్కరోజే 69,719 టన్నుల బొగ్గును రవాణా చేసి సింగరేణి చరిత్రలోనే కొత్తగూడెం ఏరియా రికార్డు సృష్టించింది.

సింగరేణి సీఎండీ చొరవతో..

సింగరేణి సీఎండీగా ఎన్.బలరాం నాయక్​బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపైనే దృష్టి సారించారు. ఫైనాన్స్​డైరెక్టర్​గా, ప్రాజెక్ట్, ప్లానింగ్​డైరెక్టర్​గా, పర్సనల్ అండ్​వెల్ఫేర్​డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని రీచ్​కావడానికి పట్టుదలతో పని చేశారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు తరచూ డైరెక్టర్లు, ఏరియా జీఎంలు, ఏజెంట్లు, ప్రాజెక్ట్​ ఆఫీసర్లతో సమావేశాలు నిర్వహించారు. సీఎండీగా జనవరిలో బాధ్యతలు చేపట్టిన ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం మూడు నెలల్లోనే 20 మిలియన్​టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయించగలిగారు.

సమిష్టి కృషి ఫలితమే ఇది

డైరెక్టర్లు, అధికారులు, కార్మికుల సమష్టి కృషితోనే 70.02 మిలియన్​టన్నుల రికార్డు బొగ్గు ఉత్పత్తి సాధించగలిగాం. లక్ష్య సాధనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం అండదండలు మరువలేనివి.  
- ఎన్​బలరాం నాయక్​, సింగరేణి సీఎండీ