వేతన పెంపులేదు .. బకాయిలు ఇవ్వట్లేదు .. సింగరేణి రిటైర్డు కార్మికుల ఆందోళన

వేతన పెంపులేదు .. బకాయిలు ఇవ్వట్లేదు .. సింగరేణి రిటైర్డు కార్మికుల ఆందోళన
  • తప్పుల తడకగా పింఛన్ ఆర్డర్లు 
  • అడిగితే పట్టించుకోని ఆఫీసర్లు

కోల్​బెల్ట్​,వెలుగు:  సింగరేణి రిటైర్డు ఉద్యోగుల వేతన బకాయిలు,పెన్షన్​ప్రయోజనాల కోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు.11వ వేతన సవరణతో కార్మికులకు జీతభత్యాలతో పాటు పెన్షన్​పెరిగింది. దాని ప్రకారం రిటైర్డు ఉద్యోగులకు  చెల్లించాల్సి ఉంది.  వేతన సవరణ జరిగి రెండేండ్లు కావస్తున్నా.. ఇప్పటికి పదో వేతన సవరణ ప్రకారమే పెన్షన్ చెల్లిస్తుండగా  రిటైర్డు ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారు. సవరించిన పింఛన్​తో పాటు ఏరియర్స్ వివరాలను మైన్స్​,డిపార్ట్​మెంట్లపైకి వెళ్లి అడిగితే కనీసం సమచారం ఇచ్చే వారు లేరని రిటైర్డు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఆఫీసర్లను అడిగితే తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తూ, సీఎంపీఎఫ్​ఆఫీస్​కు పంపించామని, ఎప్పుడొస్తే అప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని సమాధానం చెబుతున్నారని రిటైర్డ్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

సగానికి పైగా మందికి రాలె..

2021 జులై 1 నుంచి 2023 ఆగస్టు 31 కాలంలో నాలుగు వేలకు పైగా మంది కార్మికులు రిటైర్డ్​అయ్యారు. పెరిగిన వేతనాలతో పాటు బకాయిల పింఛన్ చెల్లించాలని కోలిండియా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు తేదీ ప్రకటించలేదు.  బొగ్గు గని కార్మికులకు11వేతన సవరణ 2023 మేలో అగ్రిమెంట్ అయ్యింది. రెండేండ్లు కావస్తున్నా  బకాయిలు, పింఛన్​ సవరించి అందించలేదు. బేసిక్​ఆధారంగా రూ.20వేల నుంచి రూ.2 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది. అయినా.. పదో వేతన సవరణ ప్రయోజనాలనే కల్పిస్తున్నారు. ఇందులో కొందరి ఫించన్లు సవరించినా..  మెజార్టీ రిటైర్డు ఉద్యోగులవి పెండింగ్​లోనే 
పెట్టారు. 

తప్పుల తడకగా ఆర్డర్లు

రిటైర్డు ఉద్యోగుల పింఛను ఆర్డర్లలో చాలా తప్పులు దొర్లాయని పుట్టిన తేదీ, పింఛను ఆర్డర్​లో తేడాలున్నాయి. దీంతో వచ్చే నవంబర్​లో దాఖలు చేయాల్సిన జీవన్ ప్రమాణ్​లైఫ్​సర్టిఫికెట్​పై ఏ తేదీ వేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. విడతాలవారీగా అందజేయడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. సర్వీసులో ఉన్నవారికి  లాభాల వాటా, ఏరియర్స్, బోనస్, జీతా​లు ఒకేసారి అందరికీ వర్తింపజేసే సింగరేణి తమకు సవరణ చేయించడంపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. పింఛను సవరించినట్లు మైన్లు, డిపార్ట్​మెంట్లకు లెటర్లు పంపినా, బకాయిల సొమ్ము బ్యాంకుల్లో ఖాతాల్లో జమ కావడంలేదని ఆరోపిస్తున్నారు.  మరోవైపు సింగరేణి,గోదావరిఖని సీఎంపీఎఫ్​  ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు.

ఆఫీసర్ల మధ్య కో – ఆర్డినేషన్​ లేదు

సింగరేణి, సీఎంపీఎఫ్​ఆఫీస్ల సమన్వయం లోపంతో రిటైర్డు ఉద్యోగులకు 11వేతన సవరణ బకాయిలు, పింఛను పెంపుదల లేట్ అవుతోంది. ఏండ్లుగా నిరీక్షిస్తుండగా.. ఒకేసారి లెక్కలు కట్టాల్సిన ఆఫీసర్లు విడతల వారీగా జాబితాలు ప్రకటించడం నిర్లక్ష్యానికి నిదర్శనం. తప్పులతడకలా మారిన పింఛన్ల ఆర్డర్లను సవరించాల్సిన బాధ్యత ఆఫీసర్లపై ఉంది. 


 ఆళవందార్ వేణు మాధవ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్