
హైదరాబాద్, వెలుగు: సింగరేణి చరిత్రలో శుక్రవారం బొగ్గు రవాణాలో ఆల్ టైం రికార్డు నమోదయింది. మూడు షిఫ్టులలో కలిపి సింగరేణి మొత్తం మీద 3,25,243 టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేసింది. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ ఎన్.బలరాం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం అత్యధికంగా బొగ్గు రవాణా జరగడంలో సంస్థ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, అధికారులు, కార్మికులు సమష్టిగా కృషి చేసి మంచి ఫలితాలు సాధించారని ఆయన అభినందించారు.
కొత్తగూడెం నుంచి ఎక్కువ పరిమాణంలో బొగ్గు సరఫరా చేయడంపై ఆ ఏరియా ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడితో వర్షాకాలం వరకు అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలని, విద్యుత్ డిమాండ్ కు తగిన బొగ్గును విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేయాలని సూచించారు. వచ్చే మూడు నెలల పాటు ఇలాగే పనిచేస్తూ నిర్దేశించిన 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు పునాది వేయాలన్నారు. దేశంలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరినా కరెంట్ సరఫరాకు వీలుగా మన రాష్ట్రంతో పాటు ఒప్పందం ఉన్న అన్ని థర్మల్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు సరఫరా చేయగలిగామన్నారు.
వీకే ఓపెన్ కాస్ట్ కు పర్యావరణ అనుమతులు
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్తగూడెం వెంకటేశ్ ఖని ( వీకే) ఓపెన్ కాస్ట్ కు పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులు లభించాయని సీఎండీ బలరాం తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్విరాన్ మెంట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో అనుమతులు లభించాయని ఆయన వెల్లడించారు. వీకే ఓపెన్ కాస్ట్ ను అతి త్వరలో ప్రారంభించుకోబోతున్నామని, అనతి కాలంలోనే రొంపేడు ఓపెన్ కాస్టు (ఇల్లందు) గనికి కూడా అనుమతులు వస్తాయని తెలిపారు.