చెన్నూరులో సింగరేణి సోలార్​ వెలుగులు

చెన్నూరులో సింగరేణి సోలార్​ వెలుగులు
  • శివలింగాపూర్‌‌లో 11 మెగావాట్ల సోలార్‌‌ ప్లాంట్‌‌ ఏర్పాటు
  • వచ్చే నెల 10లోపు పూర్తయ్యేలా చర్యలు

కోల్‌‌బెల్ట్‌‌, వెలుగు : మార్కెట్‌‌లో పోటీని తట్టుకునేందుకు తక్కువ ధరకే విద్యుత్‌‌ ఉత్పత్తి చేయాలని సింగరేణి భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చోట్ల థర్మల్‌‌, సోలార్‌‌ పవర్‌‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి 1,492 మెగావాట్ల విద్యుత్‌‌ను ఉత్పత్తి చేస్తున్న సింగరేణి త్వరలో జైపూర్‌‌ ఎన్టీపీసీలో మరో 800 మెగావాట్ల సూపర్‌‌ క్రిటికల్‌‌ థర్మల్‌‌ పవర్‌‌ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయనుంది. ఈ పనులు ప్రస్తుతం టెండర్‌‌ దశలో ఉన్నాయి. మరోవైపు చెన్నూరులో ఏర్పాటు చేస్తున్న సోలార్‌‌ ప్లాంట్‌‌ను ప్రారంభించేందుకు సింగరేణి సన్నాహాలు చేస్తోంది. 

76 ఎకరాల్లో 11 మెగావాట్ల సోలార్‌‌ ప్లాంట్‌‌

చెన్నూరు సమీపంలోని శివలింగాపూర్‌‌లో మూసివేసిన చెన్నూరు 2 బొగ్గు గని ఆవరణలోని ఖాళీ స్థలంలో సింగరేణి సోలార్‌‌ ప్లాంట్‌‌ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ 76 ఎకరాల స్థలం ఉండగా 55 ఎకరాల్లో 11 మెగావాట్ల ప్లాంట్‌‌ నిర్మాణ పనులను పూణేకు చెందిన ఎన్‌‌రిచ్‌‌ ఎనర్జీ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ అనే కంపెనీ చేస్తోంది. రూ.66 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను గతేడాది ప్రారంభించారు.

ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్‌‌ను సింగరేణి విద్యుత్‌‌ కేంద్రం 132 కేవీ కి అనుసంధానం చేయనున్నారు. ఈ ప్లాంట్‌‌ ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు సైతం ఏర్పడనున్నాయి. ఈ ప్లాంట్‌‌ పనులను జులై 10లోపు పూర్తి చేయాలని ఈ నెల 5న సింగరేణి సీఎండీ ఎన్. బలరాంనాయక్‌‌ కాంట్రాక్ట్‌‌ సంస్థను ఆదేశించారు. దీంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.