
కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి(ఎస్టీపీసీ) నేషనల్ అవార్డు దక్కింది. అత్యల్ప నీటి వినియోగంలో బెస్ట్ నేషనల్ వాటర్ ఎఫీషియంట్ యూనిట్‌గా ఎంపికైంది. కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తరఫున ఆఫీసర్లు కె.చంద్రలింగం, ఎల్‌జేవీ. సుబ్బారావు అవార్డును అందుకున్నారు. సుమారు 150 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ కేంద్రాలు పోటీ పడ్డాయి. ఎస్టీపీపీకి జాతీయ స్థాయిలో బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ ప్లాంట్ అవార్డు రావడం పట్ల ఉద్యోగులు, అధికారులకు సింగరేణి సీఎండీ బలరానాయక్, డైరెక్టర్ సత్యనారాయణ అభినందనలు తెలిపారు.
మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 2.8 ఘనపు మీటర్ల నీరు
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒక గంటలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి గరిష్టంగా మూడు ఘనపు మీటర్ల నీటిని వినియోగించడాన్ని సెంట్రల్ ఎలక్ర్టిసిటీ అథారిటీ ప్రామాణికంగా సూచిస్తుంది. సాధారణంగా అన్ని థర్మల్ కేంద్రాల్లో దీనికి మించే నీటి వినియోగం జరుగుతుంది. కానీ సింగరేణి ఎస్టీపీపీలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, హైడ్రోబిన్ సిస్టం వల్ల ఒక గంటలో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 2.8 ఘనపు మీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తోంది. అలాగే జీరో లిక్విడ్ డిశ్చార్జి వ్యవస్థలను నిర్వహించడం వల్ల ప్లాంట్‌లో వివిధ విభాగాల నుంచి బయటకు వస్తున్న నీటిని సైతం పూర్తి స్థాయిలో శుద్ధి చేసి తిరిగి వాడుతున్నారు. ఈ చర్యల వల్లే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి నేషనల్ అవార్డు దక్కిందని ఆఫీసర్లు చెప్పారు.