స్ట్రక్చర్డ్​ మీటింగ్​లో కార్మిక సమస్యలపై చర్చిస్తాం

  • ఏఐటీయూసీ ముఖ్య నేతలు సీతారామయ్య, రాజ్​కుమార్​
  • గుర్తింపు సంఘాన్ని బలహీన పరిస్తే కార్మికులకే నష్టం

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో నెలకొన్న కార్మిక సమస్యలపై ఈ నెల 28న కొత్తగూడెంలో జరగనున్న స్ట్రక్చర్డ్​ మీటింగ్​లో మేనేజ్​మెంట్​తో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వి.సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్​కుమార్​ తెలిపారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్​క్లబ్​లో జరిగిన  మీటింగ్​లో వారు మాట్లాడారు. ఐదేండ్లుగా స్ట్రక్చర్డ్​, చైర్మన్, డైరెక్టర్  లెవెల్  మీటింగ్  జరగకపోవడంతో కార్మికుల సమస్యలు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు.

వచ్చే స్ట్రక్చర్డ్​ మీటింగ్​లో వివిధ కారణాలతో డిస్మిస్  అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని, మారుపేర్లు ఉన్న కార్మికుల డిపెండెంట్ లకు ఉద్యోగాలు ఇవ్వాలని, మైనింగ్, ట్రేడ్స్ మెన్, ఈపీ ఆపరేటర్లు మెడికల్  అన్ ఫిట్  అయితే వారికి తగిన జాబ్స్​ ఇవ్వాలని, అలవెన్సులు పెంచాలని, ఇన్సెంటివ్  ఇవ్వాలనే విషయంపై చర్చిస్తామని చెప్పారు. కార్మికుల అంగీకారంతో ఏఐటీయూసీకి మెంబర్ షిప్  చేసి యాజమాన్యంతో రికవరీ చేయిస్తే కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.

గుర్తింపు సంఘాన్ని బలహీన పరిస్తే కార్మికులకే నష్టం జరుగుతుందని తెలిపారు. లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, బాజీసైదా, ఎంఏ గౌస్, మద్దెల దినేశ్, చిప్ప నర్సయ్య పాల్గొన్నారు.