నాలుగేండ్లుగా ఎదురుచూపులు.. ఈ సారైనా కార్మికుల సమస్యలు సాల్వ్ అయ్యేనా..?

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న స్ర్టక్చర్డ్ మీటింగ్ గురువారం కొత్తగూడెం కార్పొరేట్​ఆఫీస్లో జరగనుంది.  డైరెక్టర్ల స్థాయిలో జరిగే మీటింగ్ నాలుగేండ్లుగా నిలిచిపోయింది. దీంతో ప్రస్తుత మీటింగ్‎పై కార్మికులు, ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. సింగరేణి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు చొరవ చూపాలని కోరుతున్నారు.  వివిధ కేటగిరిల కార్మికులు గెలిచిన సంఘాలకు వేర్వేరుగా ఇప్పటికే వినతిపత్రాలు ఇచ్చారు. కాగా.. కార్మికుల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే స్ర్టక్చర్డ్​, జేసీసీ మీటింగ్ లు ఐదేండ్లుగా నిర్వహించడంలేదు. ఇటీవల ఎన్నికల్లో సింగరేణి కాలరీస్​వర్కర్స్​యూనియన్​(ఏఐటీయూసీ) గుర్తింపు సంఘంగా, సింగరేణి కోల్​మైన్స్​లేబర్​యూనియన్​(ఐఎన్టీయూసీ) ప్రాతినిధ్య సంఘంగా గెలిచాయి. 

దీంతో  స్ర్టక్చర్డ్​, జేసీసీ సమావేశాలను నిర్వహించాలని కార్మికులు డిమాండ్  చేయడంతో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అండర్​గ్రౌండ్​గనుల్లో వెంటిలేషన్, పెండింగ్‎లోని కేడర్​ స్కీమ్, ప్రమోషన్ల సమస్య,  -సొంతింటికి 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.30లక్షల వడ్డీలేని రుణం, -అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు మెడికల్​ఇన్వాలిడేషన్​, -వివిధ కారణాలతో జాబ్ నుంచి తొలగించిన కార్మికులు, -మారు పేర్లతో పనిచేసే ఉద్యోగుల వారసులకు జాబ్‎లు, సవరించని అలవెన్సుల పరిష్కారం, కొత్త ఇన్సెంటివ్​పాలసీ,  -ఉద్యోగుల పిల్లల మెరిట్​స్కాలర్​ షిప్ రూ.50వేలు పెంపు, సింగరేణి మెడికల్​ కాలేజ్​లో 25శాతం సీట్ల కేటాయింపు, -అండర్ గ్రౌండ్​ మైన్లలో మెడికల్​ అన్​ఫిట్​అయిన మైనింగ్​ స్టాఫ్​, ట్రేడ్స్​మెన్లు, ఈపీ ఆపరేటర్ల అర్హతకు తగిన జాబ్, -కోలిండియా మాదిరి పెర్క్స్​పై ఇన్​కమ్​టాక్స్​ సింగరేణి యాజమాన్యమే చెల్లింపు, ఎక్కడి ఏరియా వారికి అక్కడే వన్ టైం సెటిల్​మెంట్​ కింద ట్రాన్స్​ఫర్​ తదితర పలు  డిమాండ్లు స్ర్టక్చర్డ్​ మీటింగ్‎లో  పరిష్కారమవుతాయని సింగరేణి కార్మికులు ఆశతో ఎదురుచూస్తున్నారు.