- వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించాలె
- ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణిలో కొత్త బొగ్గు గనుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్అన్నారు. మందమర్రిలోని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను కోల్‌బెల్ట్ ప్రాంతంలోని సింగరేణి కార్మిక కుటుంబాలు భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదన్నారు. దేశవ్యాప్తంగా 72 సెక్టార్లలో పనిచేసే అసంఘటిత కార్మికుల వేతనాలు 11 ఏండ్లుగా పెరగలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా హైపవర్కమిటీ సూచించిన వేతనాలు సింగరేణి కాంట్రాక్ట్కార్మికులకు అందడంలేదన్నారు. కార్మిక రంగానికి జనక్‌ప్రసాద్ అందిస్తున్న సేవలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్టేట్ మినిమం వేజెస్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగించారని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు.
కార్మిక రంగం అభ్యున్నతికి మరింత సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి, నల్లాల ఓదెలు ఆధ్వర్యంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాలు, ఇతర సంఘాల బాధ్యులు జనక్ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో కాంగ్రెస్ నేత దుర్గం నరేశ్, ఐఎన్టీయూసీ లీడర్లు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్, మిట్ట సూర్యనారాయణ, పూల్లూరి లక్ష్మణ్, మేడ సమ్మయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.