
- సీఎండీ బలరాం నాయక్
కోల్ బెల్ట్/నస్పూర్, వెలుగు: సింగరేణి సంస్థ మనుగడ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిపైనే ఆధారపడిందని, టార్గెట్‌ను చేరుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు, ఆఫీసర్లు సమష్టిగా కృషి చేయాలని సీఎండీ ఎన్.బలరాంనాయక్పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్పెరుగుతుందని, తెలంగాణ, ఎపీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు ఎన్టీపీసీలకు టార్గెట్ బొగ్గును సప్లై చేయాల్సిన బాధ్యత సింగరేణిపై ఉందన్నారు.
బుధవారం ఆయన సింగరేణి కొత్త డైరెక్టర్లు ఎల్ వీ సూర్యానారాయణ(ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు(ప్రాజెక్టు, ప్లానింగ్), ఏరియాల జీఎంలు జి.దేవేందర్, శ్రీనివాస్‌తో కలిసి మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గు గనులను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమకు కేటాయించిన టైమ్ లో విధులను మస్ట్ గా నిర్వర్తించాలని, భారీ మెషీన్ల వినియోగం పెంచాలని సూచించారు. టార్గెట్‌ను చేరుకోవాలంటే రోజుకు 2.40లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని తెలిపారు.
పెద్ద సంఖ్యలో కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారని, వారంతా సక్రమంగా డ్యూటీలు చేయాలని సూచించారు. మహిళ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, కావాల్సిన అన్ని ఏర్పాట్లను సంస్థ చేస్తుందన్నారు. ఉత్పత్తి, రక్షణ సంస్థకు రెండు కండ్లని పేర్కొన్నారు. రామగుండంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, సెంటినరీ కాలనీలో సీబీఎస్ఈ సిలబస్, శ్రీరాంపూర్‌లో మరో విద్య సంస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కొత్తగా 1000 క్వార్టర్లను నిర్మిస్తామని, త్వరలో స్ర్టక్చర్, జేసీసీ మీటింగ్‌లు నిర్వహించి చర్చిస్తామన్నారు. ప్రీమస్టర్లను ఎట్టిపరిస్థితిలో ఉపేక్షించబోమని, యువ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సంస్థ సుస్థి రతకు కృషి చేయాలని అన్నారు. రెండు నెలల్లో ఒడిశాలోని నైనీబ్లాక్తో పాటు ఇతర కొత్త ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అండర్ గ్రౌండ్ మైన్లలోకి వెళ్లి కార్మికులతో మాట్లాడి సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆఫీసర్ల సంఘం, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీతో పాటు ఇతర సంఘాల నుంచి పలు వినతులు స్వీకరించారు.