బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై సింగరేణి ఫోకస్..రెండు నెలలు ఇన్సెంటివ్ స్కీమ్ అమలు

బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై సింగరేణి ఫోకస్..రెండు నెలలు ఇన్సెంటివ్ స్కీమ్ అమలు
  • గత 10 నెలల్లో 53.73 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి
  • ఇంకా18.27 మిలియన్ టన్నుల ఉత్పత్తిపై దృష్టి
  • వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధనకు   స్కీమ్ అమలు 
  • లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్మికులకు నగదు ప్రోత్సాహం 

కోల్​బెల్ట్, వెలుగు: బొగ్గు ఉత్పత్తిలో వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు సింగరేణి దృష్టి పెట్టింది. 2024 – -25 సంవత్సరానికి గడిచిన10 నెలల్లో 53.73 మిలియన్​టన్నులు మాత్రమే వెలికితీసింది.  ఏడాది ఉత్పత్తి లక్ష్యం నిర్దేశిత 72 మిలియన్​టన్నులు. కాగా.. ఇంకా18.27 మిలియన్​టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉంది. దీంతో మరో రెండు నెలలే మిగిలి ఉండగా టార్గెట్ రీచ్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

నెలకు 9.13 మిలియన్​టన్నులు చొప్పున ఉత్పత్తి సాధించాల్సి ఉంది. దీంతో ఉద్యోగులకు నగదు ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని అండర్​గ్రౌండ్, ఓపెన్​ కాస్ట్​ మైన్లతో పాటు బొగ్గు రవాణా చేసే సీహెచ్​పీ/సీఎస్​పీల్లోని కార్మికులకు వర్తింపజేయనుంది. తద్వారా టార్గెట్​చేరుకుంటామని సింగరేణి ఆశలు పెట్టుకుంది. 

కార్మికుల హాజరు.. పని విధానంపై అమలు  

 ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలలు మస్టర్​ఆధారిత ఇన్సెంటివ్ స్కీమ్ ను సింగరేణి అమలు చేస్తోంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కార్మికుల హాజరుతో పాటు ఉత్పత్తి ఆధారంగా నగదు ప్రోత్సాహాకాన్ని చెల్లిస్తుంది. ఇందుకు బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ఎలాంటి గైర్హాజరు లేకుండా కార్మికులు హాజరైతే స్పెషల్​ ఇన్సెంటివ్, వ్యక్తిగత, గ్రూప్​, వందశాతం ఉద్యోగుల పని విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని  ప్రోత్సాహకం అందిస్తుంది.

ఈ ఏడాదిలో పాలన సంబంధిత కారణాలతో స్కీమ్ అమలు లేట్ అయింది. దీంతో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈసారి చివర రెండు నెలలకు మాత్రమే ఇన్సెంటివ్ చెల్లించనుంది. ఇక వార్షిక నిర్దేశిత లక్ష్యంలో జనవరి నాటికి 57.59 మిలియన్​టన్నులకు 53.73 మిలియన్​టన్నులు మాత్రమే సాధించింది. మిగతా 3.86 మిలియన్​టన్నుల లోటును భర్తీ చేయడంతో పాటు ఫిబ్రవరి, మార్చిలో మరో18.27 మిలియన్​టన్నులు ఉత్పత్తి కోసం కొత్త స్కీమ్ ను తెచ్చింది. దీన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు అమలు చేయనుంది.  

కేటగిరీ వారీగా నగదు ప్రోత్సాహకం

నగదు ప్రోత్సాహక స్కీమ్ ను రెండు కేటగిరీలుగా విభజించగా.. తొలి కేటగిరిలో  100 –104 శాతం బొగ్గు తీస్తే.. రూ.1,500.. 105 –109 శాతానికి రూ.2000.  ఇంకా 110 శాతం కంటే ఎక్కువగా ఉంటే  రూ.2,500 నగదు ప్రోత్సాహకం కార్మికులకు అందిస్తుంది.  రెండో కేటగిరిలో కూడా వరుసగా రూ.1,200, రూ.1,700, రూ.2,200 ఏరియా వారీగా చెల్లిస్తుంది.  

కార్మికులు నెలలో 22 మస్టర్లు పూర్తి చేస్తేనే ప్రత్యేక ప్రోత్సాహకం దక్కుతుంది. ఇలా -లక్ష్యాన్ని చేరుకున్న గని లేదా ఏరియా కార్మికులు రెస్క్యూ ఆపరేషన్​ పోటీలకు వెళ్లినా క్యాష్​ అందజేస్తారు. ఇతర ఏ కారణాలతోనైనా విధులకు గైర్హాజరైతే... సంబంధిత గనుల్లో ప్రమాదం సంభవిస్తే కూడా ప్రోత్సాహకాలు అందవు.