హైదరాబాద్, వెలుగు : సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సాధించి దేశంలోనే నంబర్ వన్ పవర్ ప్లాంట్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా 250కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్‌లను అదిగమించి 90.86 శాతం పీఎల్ఎఫ్‌తో రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గత 8 నెలల కాలంలో ఈ ఘనత సాధించింది. 2016, ఆగస్టులో మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 200 మెగావాట్లతో ప్రారంభమైన ఈ థర్మల్ ప్లాంట్.. ఆరేండ్లలో అత్యుత్తమ పీఎల్ఎఫ్ తో దేశంలోని టాప్ 25 ప్లాంట్ల జాబితాలో టాప్‌లో నిలుస్తూ వస్తోంది.
పీఎల్‌ఎఫ్‌లో టాప్
నేషనల్ లెవల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్లలో సింగరేణి ప్లాంట్2021-–22లో 88.97 శాతం పీఎల్ఎఫ్‌తో మొదటి స్థానంలో నిలవగా, అదే విభాగంలో 2020-–21లో రెండో స్థానంలో నిలిచింది. కాగా, ఈ సారి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్లలో సింగరేణి ఫస్ట్ ప్లేస్ నిలవగా.. చత్తీస్‌గఢ్‌లోని ఎన్టీపీసీ కోర్భా సూపర్ పవర్ థర్మల్ స్టేషన్ 90.01 శాతం పీఎల్ఎఫ్‌తో రెండో స్థానంలో నిలిచింది. సింగ్రౌలి ఎన్టీపీసీకి చెందిన థర్మల్ పవర్ ప్లాంట్ 89.94 శాతం పీఎల్ఎఫ్‌తో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. సింగరేణి ఇప్పటి వరకు నాలుగుసార్లు 100 శాతానికి పైగా పీఎల్ఎఫ్ సాధించింది. 2018 సెప్టెంబరు, 2019 ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరి, 2022 మార్చి నెలల్లో నూటికి పైగా పీఎల్ఎఫ్ సాధించడం విశేషం. ఈ ప్లాంట్ లో రెండు యూనిట్లు ఉండగా.. రెండో యూనిట్ ఇప్పటి వరకు 10 సార్లు, ఒకటో యూనిట్ ఏడు సార్లు వంద శాతం పీఎల్ఎఫ్ దాటాయి.
2026 నాటికి 3వేల మెగావాట్ల ప్లాంట్స్ : సీఎండీ ఎన్ శ్రీధర్
సింగరేణి సంస్థ 3 వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ను అందించేందుకు ప్రణాళికలు చేస్తోందని సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. ప్రస్తుత 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌తో పాటు 2026 నాటికి 800 మెగావాట్ల స్టేజ్ -2 ప్లాంట్ పూర్తి కానుందన్నారు. ప్రస్తుత ప్రతిపాదిత 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై ఏర్పాటు చేయనున్న 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌తో కలిపి మొత్తం 3వేల మెగావాట్ల సామర్థ్యం సాధిస్తుందని తెలిపారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, అధికారులకు అభినందనలు తెలుపుతూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.