సింగరేణి టిప్పర్ ​అండ్​ లారీ వెల్ఫేర్​ ఓనర్స్​ ​అసోసియేషన్​లో ఎన్నికల లొల్లి!

సింగరేణి టిప్పర్ ​అండ్​ లారీ వెల్ఫేర్​ ఓనర్స్​ ​అసోసియేషన్​లో ఎన్నికల లొల్లి!
  • కాంగ్రెస్​ వర్సెస్​ సీపీఐ మధ్య హోరాహోరీ పోరు
  • పోలీసులు, సీపీఐ తీరుపై కాంగ్రెస్​ లీడర్లు, లారీ ఓనర్ల ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి టిప్పర్స్​ అండ్​ లారీ వెల్ఫేర్​ ఓనర్స్​ అసోసియేషన్​ ఎన్నికలు ఉద్రిక్తంగా, ఉత్కంఠగా మారాయి. పలు పొలిటికల్​ పార్టీలతో పాటు యూనియన్లకు టిప్పర్​ అండ్​ లారీ వెల్ఫేర్​ ఓనర్స్​ అసోసియేషన్​, కోల్​ ట్రాన్స్​ పోర్టు అసోసియేషన్లు బంగారు బాతుగుడ్డుగా మారాయి. 

టిప్పర్స్​ అండ్​ లారీ ఓనర్స్​ అసోయేషన్​లు, కోల్​ ట్రాన్స్​పోర్టు ఆఫీసులు బొగ్గు లోడింగ్, అన్​ లోడింగ్  టైంలో సీరియల్​ బండ్లుపెట్టడం లాంటి వాటి విషయంలో ఒక్కో లారీ నుంచి రకరకాల పేర్లతో భారీగా వసూళ్లు చేస్తుంటాయి. ఈ క్రమంలో కొత్తగూడెంలోని సింగరేణి టిప్పర్​ అండ్​ లారీ వెల్ఫేర్​ అసోసియేషన్​ ఎన్నికలపై తమ వర్గానికి చెందిన వాళ్లను గెలిపించుకోవాలని పొలిటికల్​పార్టీలు ప్రయత్నించాయి.

ఈనెల 20ననే ఎన్నికలు జరగాల్సింది.. కానీ.. 

కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి టిప్పర్​ అండ్​ లారీ ఓనర్స్​ అసోసియేషన్​ ఎన్నికలను ఈనెల 20నే  నిర్వహించేందుకు ఓనర్లు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి నెల రోజులుగా అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఓనర్లు కసరత్తు చేశారు. నామినేషన్ల స్వీకరణ, విత్​ డ్రా ముగించుకొని  ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.  మరి కాసేపట్లో ఎన్నికలు జరుగుతాయనగా ఎలక్షన్​ జరుగుతున్న సీఈఆర్​ క్లబ్​ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పోలీసులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. 

అసలేం జరుగుతుందో అర్థం అయ్యే లోపే పోటీలో ఉన్న రెండు వర్గాలకు చెందిన వారితో పాటు ఎన్నికల నిర్వహణకు వచ్చిన అడ్వకేట్స్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని చుంచుపల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఎన్నికలను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని, ఎన్నికలను నిలిపివేయాలని ఓ లారీ ఓనర్​ ఇచ్చిన కంప్లైంట్​ మేరకు తాము రెండు వర్గాల వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఎటువంటి గొడవ జరుగనప్పటికీ పోలీసులు తమను అదుపులోకి తీసుకోవడం సరికాదని పలువురు ఓనర్లు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేతో పాటు సీపీఐ నేతలు చెప్పడం వల్లనే పోలీసులు ఎన్నికలను ఆపేశారని వారు ఆరోపిస్తున్నారు. 

సీపీఐపై  కాంగ్రెస్ ​నేతల మండిపాటు.. 

అసోసియేషన్​ ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యే కూనంనేని వద్దకు ఆర్నెళ్లుగా తిరిగామని, కానీ ఎమ్మెల్యేతో పాటు సీపీఐ నేతలు ఒక వర్గానికి కొమ్ము కాశారని పలువురు లారీ ఓనర్లు ఆరోపిస్తున్నారు. ఎన్నికల విషయంలో పోలీస్​లు అత్యుత్సాహం చూపడం దారుణమని, సీపీఐ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు, ఫారెస్ట్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్​ చైర్మన్​ పొదెం వీరయ్య  మండిపడ్డారు.

ఎలక్షన్​ నిలిపివేయడంలో సీపీఐది ఎటువంటి పాత్ర లేదని, ఎమ్మెల్యేను బద్నాం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్​ పాషా ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్నికలు జరుగాల్సిందేనని కాంగ్రెస్​ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై శుక్రవారం పలువురు కాంగ్రెస్​ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు.