సింగరేణిలో మహిళా ఆఫీసర్లు.. పురుష ఆఫీసర్లతో సమానంగా అండర్ గ్రౌండ్ మైన్లలో వర్క్

  • మైనింగ్, ఈ అండ్ ఎంలో 34 మంది సెలెక్ట్ 
  • ఈ విభాగాల్లో సంస్థ చరిత్రలో తొలిసారి రిక్రూట్ 

గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థ చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఈ అండ్ ఎం ( ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్) విభాగాల్లో 34 మంది మహిళా ఆఫీసర్లు సెలెక్ట్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంస్థ ఈసారి ఆఫీసర్ల రిక్రూట్​మెంట్​నిర్వహించింది. వీరికి మంగళవారం నుంచి సింగరేణివ్యాప్తంగా10 ఒకేషనల్​ ట్రైనింగ్ సెంటర్ల(వీటీసీ)లో  ట్రైనింగ్ ప్రారంభించారు. ఏడాది కాలం పాటు కొనసాగనుంది. కాగా వివిధ పోస్టులకు యువ ఆఫీసర్లే ఎక్కువగా రిక్రూట్ అయ్యారు. 

11 విభాగాల్లో 355 మంది రిక్రూట్ 
సింగరేణి  రెండు నోటిఫికేషన్ల ద్వారా11 విభాగాల్లో ఆఫీసర్​ పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించగా, 355 మంది ఎంపికయ్యారు. మైనింగ్, ఎలక్ట్రికల్​ అండ్​ మెకానికల్, పర్సనల్, ఐఈడీ, సివిల్, ఫారెస్ట్, ఫైనాన్స్, సిస్టమ్స్, హైడ్రో జియాలజిస్ట్, ఎస్టేట్, డాక్టర్​ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 4న పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం బహిరంగ సభలో సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు నియామక పత్రాలు అందజేశారు. వీరిలో 190 మంది రిపోర్ట్​చేయగా, అందులో 58 మంది మహిళా ఆఫీసర్లు ఉన్నారు.  ఇందులో 34 మంది మైనింగ్, ఈ అండ్ఎంలోనే ఉన్నారు. వీరు పురుషులతో సమానంగా అండర్​ గ్రౌండ్​లోకి వెళ్లి పనులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే మైన్​మేనేజర్లుగా, జనరల్​మేనేజర్లుగా కూడా ప్రమోషన్లు లభిస్తాయి.

గతంలో అటెండర్లు, కార్మికులు గానే..
రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు మొదలైనప్పుడు అండర్ గ్రౌండ్ గనుల్లో మహిళలు కూడా పని చేసేవారు.  పురుషులతో సమానంగా భూగర్భంలోకి వెళ్లి బొగ్గును వెలికితీసేవారు. మహిళలకు రక్షణ లేకపోవడం, నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం, బొగ్గు మోయడం కష్టంగా ఉండడంతో మహిళలతో పనులు చేయించడం బంద్​ పెట్టారు.  రిక్రూట్​మెంట్ కూడా ఎంపిక నిలిపివేశారు. ఇటీవల కాలంలో కార్మికుడు చనిపోతే డిపెండెంట్​గా ఇంట్లో కుటుంబసభ్యుల్లో పురుషులు లేకపోతే, జనరల్​ మజ్దూర్ ​కార్మికులుగా మహిళలకు చాన్స్ ఇచ్చారు. కేవలం అటెండర్లుగా, వర్క్​షాప్, మైన్, ఓసీపీల్లో సర్ఫేస్​కార్మికులుగా నియమి స్తున్నారు. ఈసారి సంస్థలో తొలిసారిగా మైనింగ్, ఈ అండ్ఎం ట్రైనీ(అండర్​ మేనేజర్)లుగా మహిళలను రిక్రూట్ చేశారు. 

సింగరేణికే ప్రయార్టీ ఇచ్చా.. 
మా ఇంట్లో ఎవరూ సింగరేణిలో పని చేయలేదు. ఎలాగైనా సంస్థలో జాబ్ చేయాలనే లక్ష్యంతో మైనింగ్​ డిప్లొమో చేశాను. ఆ తర్వాత ఈసెట్​ఎగ్జామ్​రాసి స్టేట్​ఫస్ట్​ర్యాంక్​ సాధించాను. కొత్తగూడెంలో మైనింగ్​లో బీటెక్​పూర్తి చేసి సింగరేణిలో మేనేజ్​మెంట్​ట్రైనీగా సెలక్ట్​అయ్యాను. ఇప్పటికే గేట్​లో ఆల్​ఇండియా 37వ ర్యాంకు సాధించాను.  కోల్​ఇండియాలో కూడా జాబ్ వచ్చింది. కానీ.. సింగరేణిలో పని చేయడమే నాకు ఇష్టం.

వి.శరణ్, మేనేజ్​మెంట్ ట్రైనీ, గోదావరిఖని

సంస్థతో మూడు తరాలుగా అనుబంధం
సింగరేణి సంస్థతో మా ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉంది. మా తాత కోల్​ఫిల్లర్​కార్మికుడిగా చేశాడు. 1990లో వారసత్వంగా మా నాన్న ఓసీపీ–3లో క్లర్క్​గా చేస్తున్నాడు. నేను మంథని జేఎన్టీయూలో మైనింగ్​ బీటెక్, ఉస్మానియాలో ఎంటెక్​ పూర్తి చేశాను.  మొన్నటి వరకు జేఎన్టీయూలో పార్ట్​టైమ్ ​లెక్చరర్​గా చేశాను. సింగరేణి ఎగ్జామ్​రాసి మేనేజ్​మెంట్​ ట్రైనీగా సెలక్ట్​ అయ్యాను.

ఎం.బాంధవి, మేనేజ్​మెంట్ ట్రైనీ, గోదావరిఖని