సింగరేణి ఆధ్వర్యంలో మిథనాల్​ తయారీ ప్లాంట్

  • కోల్ ఇండియా, ప్రైవేట్ సంస్థలతో కలిసి ఏర్పాటు
  • రోజుకు 500 కిలోల కార్బన్ డయాక్సైడ్  నుంచి 180 కిలోల మిథనాల్ తయారీ
  • వచ్చే నెల 31 నాటికి పూర్తి: బలరాం

హైదరాబాద్, వెలుగు : సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డయాక్సైడ్  నుంచి మిథనాల్ ను తయారుచేసే ప్రయోగాత్మక ప్లాంటును మంచిర్యాల జిల్లాలోని జైపూర్  సింగరేణి థర్మల్ పవర్​ ప్లాంట్ లో ఏర్పాటు చేస్తోంది. థర్మల్ పవర్​ ప్లాంట్ లో బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కిలోల కార్బన్ డయాక్సైడ్ ను సేకరించి హైడ్రోజన్ వాయువుతో కుదింపు చేసి, చివరగా మిథనాల్  ద్రవాన్ని తయారుచేసే ప్రక్రియను చేపట్టనున్నారు.

బొగ్గు మండించగా వచ్చే కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా నివారించేదుకు ఎలక్ట్రో స్టాటిక్  ప్రెసిపిటేటర్స్ (ఈఎస్​పీ)ను  ఏర్పాటు చేశారు. ఈ విధానంలో చివరిగా వాతావరణంలోకి కలిసే కార్బన్ డయాక్సైడ్ వాయువును  వినియోగించి మిథనాల్​ను తయారు చేస్తారు. మిథనాల్ తయారుచేసే ప్లాంటులో ఇప్పటికే సివిల్  నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో కార్బన్  డయాక్సైడ్​ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్  జనరేషన్  యూనిట్, కంప్రెషన్ యూనిట్, మిథనాల్  డిస్టిలేషన్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ యంత్ర విభాగాలలో కొన్ని ఇప్పటికే నిర్మాణ ప్రాంతానికి చేరుకోగా మరికొన్ని ఈ నెలాఖరుకు చేరుకోనున్నాయి. సింగరేణి నిర్మాణ సారథ్యంలో కోల్ ఇండియా అనుబంధ రీసర్చ్  యూనిట్  సీఎం పీడీఐఎల్  ఆర్థిక సహకారంతో ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణ బాధ్యత, ప్లాంట్  నిర్వహణను బెంగళూరుకు చెందిన జవహర్​లాల్ నెహ్రూ సెంటర్  ఫర్  అడ్వాన్స్ డ్  సైంటిఫిక్ రీసెర్చ్,  బ్రెత్  అప్లైడ్  సైన్సెస్  ప్రైవేట్  లిమిటెడ్ కు అప్పగించారు.

ఈ ప్లాంట్ నిర్మాణానికి దాదాపు రూ.20 కోట్ల  ఖర్చు కానుంది. కాగా.. ఈ పైలట్  ప్రాజెక్టు  ​ ప్లాంట్​ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఈ ఏడాది  డిసెంబర్ 31 నాటికి ప్లాంట్​ పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని ఆయన చెప్పారు.