భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి వీఆర్ఎస్ డిపెండెంట్లకు అండగా ఉంటానని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. డిపెండెంట్లు ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి లాభాల బాటలో పయనిస్తున్నప్పటికీ వీఆర్ఎస్ డిపెండెంట్ల విషయాన్ని యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో సోమవారం నిర్వహించిన సింగరేణి వీఆర్ఎస్ డిపెండెంట్ల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అథితిగా హాజరైన వివేక్‌ను నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీఆర్ఎస్ డిపెండెంట్ల సమస్యలపై గతంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. సమస్యను పరిష్కరించడంలో సీఎం ఫెయిల్ అయ్యారన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులు చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం హామీ ఇచ్చినా సింగరేణి కార్మికులకు సొంతింటి కల నేరవేర లేదన్నారు. సింగరేణి ప్రాంతంలోని దాదాపు 28 వేల పేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన ఘనత తన తండ్రి గడ్డం వెంకటస్వామిదే అన్నారు. బీఎఫ్ ఐఆర్లోకి సింగరేణి వెళ్లకుండా ఆయన కృషి చేశారని గుర్తుచేశారు. సీఎంపీఎఫ్ ఆఫీస్‌ను గోదావరిఖనికి తీసుకొచ్చింది కాకా నే అని చెప్పారు. వీఆర్ఎస్ డిపెండెంట్ల కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు వారి పోరాటానికి అండగా ఉంటానన్నారు. డిపెండెంట్ల సమస్యలను ఇప్పటికే కేంద్ర కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. సింగరేణి కార్మికులకు మంచి క్వార్టర్లు, సౌకర్యాలు కల్పించే విధంగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడుయాదగిరి సత్తయ్య, బీఎంఎస్ సీనియర్ నేత, జేబీసీసీఐ మాజీ మెంబర్ చింతల సూర్యానారాయణ మాట్లాడుతూ, ఏండ్లుగా సింగరేణి సంస్థకు సేవలందించిన కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించడంలో ఏఐటీయూసీతో పాటు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఉద్యమ పార్టీగా వచ్చిన బీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు వీఆర్ఎస్ డిపెండెంట్లకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే వారిని వదిలేసిందన్నారు.
డిపెండెంట్లకు న్యాయం చేసేందుకే వారి సమస్యలను ఆర్ఎల్సీ, సీఎల్సీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. డిపెండెంట్ల సమస్యను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు డిపెండెంట్లు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కోల్ మైన్స్ జనరల్ సెక్రెటరీ పవన్ కుమార్, నాయకులు టీవీ సూరి, సింగరేణిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డిపెండెంట్లు పాల్గొన్నారు.