ముందుచూపు లేని నిర్ణయాలతో అప్పుల్లో ఉన్న సింగరేణికి మరింత నష్టం

ఇప్పటికే అప్పుల్లో ఉన్న సింగరేణి, ముందుచూపు లేని నిర్ణయాలతో మరింత నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించి సింగరేణి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం సమీపంలోని ‘పెనుగడప’, ఒడిశాలోని అంగుల్​జిల్లాలోని ‘పార్థపద’ బొగ్గు బ్లాకులను ఇప్పటికే పొందిన సంస్థ.. వాటి ద్వారా లాభాల కంటే నష్టాలే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని భావించి, వాటిని వాపస్​ఇయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఆయా బ్లాకులపై ఖర్చు చేసిన కోట్ల రూపాయలు వృథా అయినట్లే.  

రెండు బ్లాకుల వాపస్
2016 నవంబర్ లో కేటాయించిన పెనుగడప, పార్థపద బొగ్గు బ్లాకులను వాపసు ఇవ్వాలని సింగరేణి తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28,29 తేదీల్లో జరిగే బోర్డు సమావేశంలో ఇందుకు సంబంధించి ఆమోదం పొంది వాపసు ప్రక్రియ మొదలు పెట్టనుంది. ఈ రెండు బొగ్గు బ్లాకుల వల్ల సంస్థకు లాభం కన్నా నష్టమే ఉంటుందని భావించిన యాజమాన్యం పార్థపద బ్లాకుకు బదులుగా దానికి 9 కిలోమీటర్ల దూరంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ‘నైని’ బ్లాక్ కు అవతల రోడ్డు పక్కనే ఉన్న ‘బైసరని వెస్ట్’ బొగ్గు బ్లాక్ అలాట్మెంట్ కోరాలని భావిస్తున్నది. ఇందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఒడిశాలో సింగరేణి బొగ్గు బ్లాకులకు వెళ్లడానికి కారణం అక్కడ స్ట్రిప్పింగ్ రేషియో(మట్టి తీయడం) మూడు మీటర్స్ కన్నా ఎక్కువ ఉండదు. అదే సింగరేణిలో 10 నుంచి13 మీటర్ల దాకా ఉంటుంది. పెనుగడప బ్లాక్ మీద సింగరేణికి బ్యాంక్ గ్యారంటీ రూ. 37 కోట్లు, పార్థపద మీద రూ. 642 కోట్లు ఉంది. ఈ రెండు బ్లాకులను వాపసు చేస్తే ఈ మొత్తం తిరిగి ఇస్తారు. అయితే ఇప్పటికే ఆయా బ్లాకుల మీద పెట్టిన ఖర్చు మాత్రం తిరిగి రాదు. పెనుగడపకు సంబంధించి సంస్థ సర్వే, ఇతర అనుమతులు, డ్రిల్లింగ్ లకు 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. దీనికి మైన్ ప్లాన్,అప్రూవల్ కూడా వచ్చింది. ఇప్పుడది వర్క్ఔట్ కాదని,  బొగ్గు నాణ్యత లేదని తేల్చారు. మరోవైపు పార్థపద బ్లాకు మీద కూడా రూ.100 కోట్ల దాకా కేటాయించిన సింగరేణి, అందులో రూ. 60 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఈ ప్రాంతంలో అన్నీ భారీ భవనాలు ఉన్నాయి. వాటికి భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే దీన్ని వాపసు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు బ్లాకుల వాపస్​ద్వారా 75 కోట్ల రూపాయలు కంపెనీకి నేరుగా నష్టం జరిగింది.

ప్రత్యామ్నాయ చర్యలు..
పెనుగడప బ్లాకులో105 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. దీని నుంచి వచ్చే బొగ్గు పవర్ ప్లాంట్లకు ఉపయోగ పడేది. ఇల్లందు ఏరియా మరో 7, 8 ఏండ్లలో బొగ్గు ఖాళీ అయితే ఆ ప్రాంతం మూత పడే అవకాశం ఉంది. మణుగూరు ఏరియాలోనూ 9 ఏండ్ల తర్వాత ఏమీ ఉండదు. భవిష్యత్​ఇబ్బంది కరమే. ఇప్పుడు పెనుగడప వాపస్ తో ఇల్లందు, మణుగూరు ఏరియాల్లో ప్రత్యామ్నాయంగా బొగ్గు బ్లాకుల కోసం ప్లాన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. పెనుగడప బ్లాక్ నుంచి వాస్తవానికి 2021 ఫిబ్రవరి నుంచే బొగ్గు ఉత్పత్తి రావాలి. కేంద్రంలోని బొగ్గు, మైనింగ్ శాఖ తాజాగా బ్లాకుల వాపసుకు కొంత సమయం ఇవ్వడంతో సింగరేణి పెనుగడపను వాపసు ఇవ్వాలని భావించినట్లు కనిపిస్తున్నది. నిజానికి కేంద్రం 2015 నుంచే బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కేటాయించడం ప్రారంభించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 204 బ్లాకులతో పాటు ఎంఎండీఆర్ పాత, కొత్త 250 బ్లాకులను ప్రభుత్వం వేలం వేస్తున్నది. ఇందులో ఇప్పటికీ 14 దశల వేలం ప్రక్రియలో 172 బ్లాకులను అలాట్ చేసింది. ఇందులో 75 గనుల్లో ఉత్పత్తి ప్రారంభం కాగా, మిగిలిన బ్లాకుల్లో ఉత్పత్తి ప్రారంభించలేదు. తవ్వకం మొదలు పెట్టని బ్లాకులను సెప్టెంబర్ లోపు వాపసు ఇవ్వొచ్చని కేంద్రం గడువు ఇచ్చింది. రెవెన్యూ బేస్ మీద టన్నుకు ఇంత అని నిర్ణయించి మూడు నుంచి నాలుగు రకాల ఫీజులను కేంద్రం విధిస్తోంది. మొత్తం వేలం ద్వారా 1,65,000 కోట్ల రూపాయల ఆదాయం గడించాలని కేంద్రం భావిస్తున్నది. ఇప్పటికే రూ. 30,000 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా వాపస్ చేసే బ్లాకులను తిరిగి వేలం వేస్తారు. 

కోయగూడెం బ్లాక్​పై సందిగ్ధత..

కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన జరుగుతున్న యుద్ధానికి పరాకాష్టగా కోయగూడెం బ్లాక్ కేటాయింపు కనిపిస్తోంది. వేలం లేకుండానే నాలుగు బ్లాకులను ఇవ్వాలని సింగరేణి కోరుతున్నది. ఇందుకోసం సింగరేణి కార్మికులు సమ్మె కూడా చేశారు. కోయగూడెం ఎవరికి కేటాయించినా కార్మికులు, యూనియన్లు ప్రైవేట్ సంస్థలను తవ్వనిచ్చే పరిస్థితి ఉండేలా లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కార్మికులు, యూనియన్లు ఒక్కటిగానే ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ట, రాజకీయాలకు సంబంధించిందిగా కాకుండా.. సింగరేణి వృద్ధి, కార్మికుల భవిష్యత్తులా చూడాలి. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణికి, కోల్ ఇండియాకు బొగ్గు బ్లాకులను వేలంలో కేటాయించే విధానాన్ని కేంద్రం మరోసారి సమీక్షించాలి. రాష్ట్రం బయట వరకు ఈ పాలసీ ఓకే అయినప్పటికీ ‘మా బొగ్గు.. మా హక్కు’ దీని మీద వేలం అనే ప్రతిబంధకం దారుణమని కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి కేంద్రం పునరాలోచించాలి. 

‌‌ - ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్