నిజాం సంస్థానంలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి1886లో హైదరాబాద్ స్టేట్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు కాగా..1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. హైదరాబాద్ కంపెనీల చట్టం కింద 1920 డిసెంబరు 23న ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా ఆవిర్భవించింది. దేశ స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడగా.. 1974 జూన్10న కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణిలో భాగస్వామ్యం పొందింది. 1977 డిసెంబర్ 13 నుంచి కేంద్ర ప్రభుత్వం 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 51 శాతం భాగస్వామ్యంగా బొగ్గు ఉత్పత్తి కొనసాగుతున్నది. అధికారిక లెక్కల ప్రకారం 2013–-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 వరకు రాయల్టీ ఇతరత్రా పన్నుల పేర కేంద్ర ప్రభుత్వానికి రూ.21,491.78 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.18,587.63 కోట్లు చెల్లించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్(డీఎంఎఫ్ టి), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)నిధుల పేర రూ.3,941.77 కోట్లు, ప్రతి కోల్ బెల్ట్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున చెల్లించారు. గడచిన 2022– 23 ఆర్థిక సంవత్సరంలో 67.14 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగి 66.69 మిలియన్ టన్నుల బొగ్గు అమ్మకాలతో రూ.33,065 కోట్ల టర్నోవర్ జరిగింది. స్థూల లాభాలు రూ.3,074 కోట్లు, నికర లాభాలు రూ.2,222 కోట్లు సాధించింది సింగరేణి. ఇలా కార్మికులు తమ చెమటను రక్తంగా మార్చి కష్టపడి సంస్థను లాభాల్లోకి తీసుకు వెళ్తుండగా.. వారికి మాత్రం అన్యాయం జరుగుతున్నది.
ఓ కార్మికుడి కథ ఇది..
చిరంచెట్టి కనకయ్య, ఎంప్లాయి నంబర్ 865175 గల వ్యక్తి 36 ఏండ్లు ఉద్యోగం చేసి హెడ్ ఓవర్ మాన్ గా శ్రీరాంపూర్ డివిజన్ లోని ఆర్కే 6 మైన్ లో 2017 ఏప్రిల్ 30 న విరమణను పొందాడు. అప్పటికి ‘ఎన్ సీడబ్ల్యూఏ--10 (నేషనల్ కోల్ వేజు అగ్రిమెంట్)’ కాకుండా పెండింగులో ఉన్నందున అమలులో ఉన్న ‘ఎన్ సీడబ్ల్యూఏ 9’ ప్రకారంగా నెలకు రూ.15,798 కోల్ మైన్స్ పెన్షన్ పొందుతున్నాడు. రిటైర్ అయిన 6 నెలల తర్వాత 2017 అక్టోబర్ 10 న ‘ఎన్ సీడబ్ల్యూఏ--10’ ఒప్పందమై బ్యాక్ డేట్ 2016 జులై నుంచి అమలులోకి వచ్చింది. దాని ప్రకారంగా పెరిగిన వేతన భత్యాలకు అనుగుణంగా 75 నెలల పునరుద్ధరణ, రివైజ్డ్ ‘కోల్ మైన్స్ పెన్షన్’ బకాయిలు,10 నెలల పెరిగిన వేతన బకాయిలను కనకయ్యకు చెల్లించాలి. కానీ అధికారుల అలసత్వం కారణంగా రిటైర్ అయి ఆరేండ్లు గడిచినప్పటికీ ఇంకా బకాయిలు రాలేదు. పెన్షన్, వేతన బకాయిల సమాచారం ఇవ్వాలని సమాచార చట్టం ప్రకారం ప్రశ్నిస్తే.. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమిషనర్ స్పందించి సీఎంపీఎఫ్, ప్రీమియంల వీవీ స్టేట్ మెంటును పంపితే పెన్షన్ బకాయిల చెల్లింపు జరుగుతుందని స్పందించారు. కానీ దీనిపై సింగరేణి అధికారులు స్పందించడం లేదు. చివరకు గవర్నర్ కు లేఖ రాస్తే.. గవర్నర్సెక్రటరీ సింగరేణి అధికారులకు లేఖ రాశారు. వేతన బకాయిల సమాచారం, వీవీ స్టేట్మెంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు ఆఫీసర్ల నుంచి కనీస స్పందన రాలేదు. ఇది ఒక కనకయ్య సమస్యనే కాదు.. ఆయన లాంటి ఎందరో కార్మికుల పరిస్థితి ఇదే. రిటైర్డ్ అయిన సాధారణ సింగరేణి కార్మికుడు తనకు పెన్షన్, వేతన బకాయిలను చెల్లించాలని బొగ్గు బాయి, జీఎం ఆఫీస్ ల చుట్టూ ఏండ్ల తరబడి చెప్పులు అరిగేలా తిరగాలా? చిన్న చిన్న సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారమవుతున్నాయి.. కాబట్టే సీఎం కేసీఆర్ ప్రజాదర్బారు పెట్టలేదని ఆ మధ్య ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ సెలవిచ్చారు. మరి కనకయ్య లాంటి కార్మికుడి సమస్యను కింది నుంచి పైస్థాయి వరకు అధికారులెవరూ పట్టించుకోవడం లేదు కదా? మరి ఆయన సమస్యకు పరిష్కారం ఎవరు చూపాలి సారు?
సమస్యల పరిష్కారం ఏది?
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పోరాటం మరువలేనిది. స్వరాష్ట్రంలో తమ బతుకులు బాగుపడుతాయని ఆశించి.. కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమంలో ముందుండి కొట్లాడారు. బొగ్గు పెల్ల కదలకుండా రోజుల తరబడి సమ్మె చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించారు. కానీ స్వరాష్ట్రంలో కార్మికుల కష్టాలు పోలేదు. సింగరేణిలో రెగ్యులర్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గడం మొదలైంది. 2014 మార్చిలో 61,778 మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తే.. 2023 మార్చి 31 నాటికి 42,733 మందికి తగ్గారు. స్వరాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గడంతో పాటు సంస్థాగత విధానాల్లో రాజకీయ జోక్యం ఎక్కువై కార్మికులకు కష్టాలు పెరిగాయి. సాక్షాత్తు సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పని చేస్తున్నందున కార్మికుల సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని అనుకుంటే.. ఆశలన్నీ అడియాసలయ్యాయి. గతంలో ‘వాల్ పోస్టర్’ వేస్తే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఇప్పటి అధికారులు చట్టాలను పక్కనపెట్టి అధికారపార్టీ నాయకులతో గివెన్ అండ్ టేకెన్ పాలసీతో వ్యవహరిస్తున్నారు. దాంతో కార్మికుల సమస్యలు పేరుకపోతున్నాయి. సంస్థ కోసం తన సర్వీసు కాలాన్ని అర్పించిన కార్మికుడు రిటైర్ అయితే.. సంస్థ నుంచి చట్టబద్ధంగా అందాల్సిన అలవెన్సులు అందడం లేదు. పెన్షన్ బకాయిలు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మేరుగు రాజయ్య, కేంద్ర కార్యదర్శి, ఏఐటీయూసీ, సింగరేణి