- ఒక్కొక్కరికి రూ.750 నుంచి వెయ్యి రూపాయలే
- 26 ఏండ్లుగా సింగరేణి కార్మికులకు పెరగని పెన్షన్లు
- కేంద్రాన్ని నిలదీస్తున్న కార్మికులు
- ఆసరా పథకానికి అప్లై చేసుకోలేని పరిస్థితి
- పింఛన్లు పెంచాలని కార్మికుల వేడుకోలు
గోదావరిఖని, వెలుగు: రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తున్న పింఛన్ చాలా దారుణంగా ఉంటున్నదని సింగరేణి కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ల కంటే తక్కువ వస్తున్నదని వాపోతున్నారు. దీంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేండ్లకోసారి రిటైర్డ్ కార్మికులకు పింఛన్ పెంచాల్సి ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం, సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కార్మికులు మండిపడుతున్నారు. పింఛన్ల కోసం కొన్నేండ్లుగా పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తమ సమస్యపై చర్చించాలని ఎంపీలను వేడుకుంటున్నారు.
‘కాకా’ చొరవతోనే స్కీమ్ అమలు
గడ్డం వెంకట స్వామి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బొగ్గు గని కార్మికుల కోసం 1995లో ప్రత్యేకంగా కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ తీసుకొచ్చారు. 1998లో బొగ్గు గనుల చట్టం ప్రకారం అది అమల్లోకి వచ్చింది. కార్మికుడు పనిచేస్తున్న సమయంలో బేసిక్ సాలరీలో 25 శాతం కోత విధించి అతను రిటైర్డ్ అయ్యే సమయానికి ఉన్న బేసిక్ సాలరీలో 25 శాతం పింఛన్ రూపంలో ప్రతి నెలా అందజేసేవారు.
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
సింగరేణితో పాటు కోల్ ఇండియాలో పని చేస్తున్న బొగ్గు గని కార్మికుల కోసం అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను మూడేండ్లకోసారి రివైజ్డ్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బొగ్గు గనుల చట్టంలో ‘ఈఎస్ఆర్ జీవో 154 (ఇ), జీవో 89’లో పొందుపర్చారు. 26 ఏండ్లు గడుస్తున్నా ఒక్కసారి కూడా పింఛన్ పెంపుదలపై సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డు స్పందించలేదు. రిటైర్డ్ కార్మికుల పింఛన్లో ఒక్క రూపాయి కూడా పెంచలేదు. దీంతో చాలా మంది కార్మికులు రిటైర్డ్ అయ్యే సమయంలో ఎంత అయితే పింఛన్ పొందుతున్నారో.. నేటికీ అంతే పింఛన్ తీస్కుంటున్నారు. సింగరేణిలో వెయ్యి మంది రిటైర్డ్ కార్మికులకు నెలకు రూ.350 నుంచి వెయ్యి రూపాయల వరకు, 10వేల మందికి రూ.5వేలలోపే పింఛన్ వస్తున్నది. ఒక వేళ రిటైర్డ్ కార్మికుడు చనిపోతే వచ్చే పింఛన్లో 60% మొత్తాన్ని అతని భార్యకు ఇస్తున్నారు. ఈ వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు కూడా సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, సింగరేణి పింఛన్ వస్తున్నందున వీరికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆసరా స్కీమ్ కూడా వర్తించడం లేదు.
పాలకులు స్పందించాలి
కేంద్రంలో ఉన్న పాలకులు.. కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్‌ను రివైజ్డ్ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నందున కనీస పింఛన్ కూడా పెంచకపోతే ఎలా బతకాలని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో వృద్ధులకు ఇవ్వనున్న రూ.4,016 పింఛన్‌కు కూడా తాము నోచుకోవడం లేదని ఆవేదన యక్తం చేస్తున్నారు.
33 ఏండ్ల సర్వీస్ రూ.750 పింఛన్ ఇస్తున్నరు
సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు గనిలో 1964లో కార్మికుడిగా చేరిన. 1997లో ట్రామర్లకు సూపర్వైజర్ (మున్షీ)గా రిటైర్డ్ అయిన. 33 ఏండ్ల పాటు సింగరేణిలో సర్వీస్ చేసిన. అప్పటి నుంచి నాకు రూ.750 పింఛనే వస్తున్నది. ఇప్పుడు నాకు 82 ఏండ్లు. రూ.750 పింఛన్‌తో ఎట్ల బతకాలి? ఇప్పుడు ఈ పింఛన్ దేనికి సరిపోతయ్? సుస్తి చేస్తే మందులు కూడా అస్తలేవు. పూట గడవడం కష్టంగా ఉన్నది. పింఛన్ పెంచాలని కొన్నేండ్ల సంది పోరాటం చేస్తూనే ఉన్నం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా మా సమస్య పరిష్కరించాలి.
- లక్కరసు ఆగయ్య, రిటైర్డ్ కార్మికుడు, శ్రీరాంపూర్
కనీసం రూ.10 వేల పింఛన్ ఇయ్యాలి
సింగరేణిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేసిన. 2009లో రిటైర్డ్ అయిన. ఆ టైమ్‌లో నాకు రూ.4 వేల పింఛన్ ఇచ్చారు. ఇప్పటికీ గవే డబ్బులు ఇస్తున్నరు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. బొగ్గు గని కార్మికులకు పింఛన్ పెంచాలి. ఎంపీలందరూ కలిసి మా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలి. దేశవ్యాప్తంగా రిటైర్డ్ అయిన గని కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు కనీసం రూ.10 వేల పింఛన్ ఇయ్యాలి.
- నూనె రాజేశం, ప్రధాన కార్యదర్శి, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్
ఎవరూ పట్టించుకోవట్లే
సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయిన. కార్మికులకు పింఛన్ పెంచాలని కొన్నేండ్లుగా పోరాటం చేస్తున్న. కనిపించిన లీడర్లందరినీ వేడుకుంటు న్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దీనిపై కేంద్రం స్పందించాలి. మూడేండ్లకోసారి పింఛన్ సవరించాలని రూల్ ఉన్నది. అయినా.. పెంచి ఇస్తలేరు. 26 ఏండ్ల కింద ఎంత పింఛన్ ఇచ్చేటోళ్లో.. గిప్పుడు గదే ఇస్తున్నరు. ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. పింఛన్ పెంచాలని ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఎంపీలకు కలిసి వేడుకున్నం. కోల్కత్తా, ఢిల్లీలో ధర్నాలు, దీక్షలు చేసినం. ఇప్పటికైనా గనిలో పని చేసి రిటైర్డ్ అయిన కార్మికులకు పింఛన్ పెంచాలి.
- డి.రాంచందర్‌రావు, అధ్యక్షుడు, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్