
కోల్‌బెల్ట్/ఆసిఫాబాద్/బెల్లంపల్లి, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పోలింగ్‌కేంద్రాల వద్ద సాధారణ ఎన్నికలను తలపించేలా ఆయా సంఘాల శ్రేణులు సందడి చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్జిల్లాల పరిధిలో 14,958 మంది కార్మిక ఓటర్లుండగా 13,928 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తంగా 93.11 శాతం పోలింగ్‌నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి కార్మికులు క్యూ కట్టారు. ఉదయం డ్యూటీ ఉన్నవారు మధ్యాహ్నం, మధ్యాహ్నం డ్యూటీ ఉన్నవారు ఉదయం ఓటు వేశారు. బెల్లంపల్లి ఏరియాలో రికార్డు స్థాయిలో 96.3శాతం పోలింగ్ నమోదైంది. మందమర్రి ఏరియాలో 4,835 ఓట్లు గాను 4,478(93.38 శాతం) ఓట్లు పోలయ్యాయి. శ్రీరాంపూర్ ఏరియాలో 9,127 ఓట్లకు గాను 8,491(93శాతం) ఓట్లు పోలయ్యాయి. బెల్లంపల్లి ఏరియాలో 996 మందికి గాను 959 మంది ఓటేశారు. మందమర్రి ఏరియా బొగ్గు గనులపై ఓటింగ్ సరళిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, శ్రీరాంపూర్ ఏరియా గనులపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఏఐటీయూసీ స్టేట్ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ మెంబర్కలవేని శంకర్ పరిశీలించారు.
కార్మిక సంఘాల నేతలతో మాట్లాడారు. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలోని బ్యాలెట్‌బాక్సులను సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. సింగరేణి ఎన్నికల రీజియన్కోఆర్డినేటర్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల జీఎంలు మనోహర్, రవిప్రసాద్ అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.