తెలంగాణ కోసం భగ్గుమన్న బొగ్గు బావులు! : ఎండీ మునీర్

తెలంగాణ కోసం భగ్గుమన్న బొగ్గు బావులు! : ఎండీ మునీర్

ప్రత్యేక తెలంగాణ కోసం బొగ్గు గని కార్మికులు భగ్గుమన్నారు.  తెలంగాణ సాధన కోసం వారు చేసిన పోరాటం చారిత్రాత్మకం. ఉద్యమంలో నల్ల  సూర్యులదే ప్రధాన పాత్ర.  హక్కుల పోరాటాల్లో రాటు దేలి,  ప్రాణ త్యాగాలతో ఎర్ర బారిన తెలంగాణ ఉద్యమంలో  సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరించారు.  వారు లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదు అనేది నేల మీది నిజం.  నల్ల నేల నుంచి ఢిల్లీ  దాకా సింగరేణి  కార్మికులు తెలంగాణ కోసం గర్జించారు. 

తొలి,  మలి దశల్లో  మా  బొగ్గు గని  కార్మికుల పాత్రను ఎవరూ కాదనలేరు.  మడమ తిప్పని పోరు చేశారు.  తెలంగాణ  ఇవ్వడానికి కారణం అయిన కాంగ్రెస్ పార్టీ  రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తోంది.  కాంగ్రెస్​ ప్రభుత్వం ఆధ్వర్యంలో పది ఏండ్ల తెలంగాణ ఏర్పాటు సంబురాలు  జూన్ 2న నిర్వహించనున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి  నేతృత్వంలో ఈ ఉత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -

సోనియమ్మ మేలు తెలంగాణ మర్చిపోదు-

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ  వెనుకడుగు వేయలేదు. ఎంతమంది అడ్డుపడ్డప్పటికి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా తెలంగాణ బిల్లు పాస్ చేయించారు.  సోనియమ్మ మేలు తెలంగాణ ఎన్నటికీ మర్చిపోదు.  

బీజేపీ నేతలు, దివంగత  సుష్మా స్వరాజ్,  ప్రమోద్ మహాజన్ లాంటి వారి మద్దతు మర్చి పోలేనిది.  సెప్టెంబర్ 13,  2011న  దేశంలోనే  ఒక ప్రభుత్వ రంగ సంస్థలో  రాజకీయ డిమాండ్ అయిన ప్రత్యేక రాష్ట్రం కోసం సమ్మె ప్రారంభమైనది.  అప్పటి ఉద్యమ నేత కేసీఆర్,  తెలంగాణ రాష్ట్ర  జేఏసీ చైర్మన్  ప్రొఫెసర్  కోదండరాం తదితరుల మార్గనిర్దేశంలో సకల జనుల సమ్మెకు తెలంగాణ జేఏసీ పిలుపునిస్తే ఆర్టీసీ వాళ్లకన్నా ముందు  సింగరేణి  కార్మికులే  సమ్మె ప్రారంభించారు.  ఈ సమ్మె  35 రోజులపాటు కొనసాగింది. కేసీఆర్ దీక్ష భగ్నం,  అరెస్టు అనంతరం జరిగిన శ్రీకాంతాచారి ఆత్మహత్యతో ఉద్యమం వేడెక్కింది.  తల్లడిల్లిపోయిన నల్ల నేలలో  బొగ్గు గని కార్మికులు స్వచ్ఛందంగా ఒక రోజు  సమ్మెకు దిగారు.  శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా రెండు రోజులు సమ్మె చేశారు.  సకల జనుల సమ్మెకు మార్గ దర్శకులు సింగరేణి కార్మికులే.--

దశాబ్దాలుగా  పోరాటం

ఏది ఏమైనా బొగ్గుగని కార్మికుల తెలంగాణ సాధన పోరాటం దశాబ్దాలుగా నిజాయితీగా, చిత్తశుద్ధితో  ఎంతో  పట్టుదలతో కొనసాగింది.  బొగ్గుగని  కార్మికుడికి సైతం అన్యాయానికి వ్యతిరేకంగా మండే గుణం ఉంది. ఇది అన్యాయం ఉన్నంతవరకు వారి జీవితాల్లో  మార్పు వచ్చేంతవరకు కొనసాగుతూనే ఉంటుంది. అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురుతూనే ఉంటుంది.  

దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, విప్లవ పార్టీలు, జాతీయ, ప్రాంతీయ,  వృత్తి కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు అన్నింటి సంఘీభావం అందరి భాగస్వామ్యం చేయూతతో  సకల జనుల సమ్మె సింగరేణిలో విజయవంతమైంది.  మొత్తానికి చారిత్రాత్మకమైన సకల జనుల సమ్మెకు నల్ల సూర్యులు తెలంగాణ సాధన ఉద్యమంలో ఎప్పటికీ  మార్గదర్శకులే అనడంలో  ఏమాత్రం  అతిశయోక్తి కాదు.  ఇదే సందర్భంగా  తెలంగాణ కోసం  తమ  ప్రాణాలను అర్పించిన  ఎందరో  కార్మిక బిడ్డలను, ఈ ప్రాంత యువకులను  నల్ల సూర్యులు స్మరించుకుంటూనే ఉంటారు.  

తెలంగాణ కొంగు బంగారం సింగరేణి

సింగరేణికి  మరో 150 ఏండ్ల భవిష్యత్తు ఉంది.  గోలేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని  చింతలపూడి  దాకా 10 వేల  మిలియన్  టన్నుల  బొగ్గు  నిక్షేపాలు గుర్తించి ఉన్నాయి.  కొత్త బొగ్గు  బ్లాకులు వస్తే  సింగరేణిలో ఉపాధి మెరుగవుతుంది.  నిరుద్యోగ యువత,  కార్మిక   కుటుంబాల ఆశలు  నెరవేరుతాయి.  సింగరేణికి  ఎన్. బలరాం లాంటి ఐఆర్ఎస్ అధికారిని సీఎండీగా నియమించి  మేలు చేశారు. ఆయన నేతృత్వంలో  2023-– 24 ఆర్థిక సంవత్సరంలో  గతంలో ఎన్నడూ  లేనివిధంగా సంస్థ లాభాలు గడించింది.  లాభాల బాటలో నడుస్తున్నది.  

నల్ల నేల ఆశలు అడియాశలు కాకుండా ప్రణాళికలు రూపొందించి, సింగరేణి జీవిత కాలంను భవిష్యత్తు తరాల కోసం పెంచుతారని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం.  సింగరేణిని  విస్తరించడం  ద్వారానే  తెలంగాణకు  ప్రయోజనం ఉంటుంది.  వాటాను బట్టి  కేంద్ర,  రాష్ట్రాలకు  ప్రతి  ఏడు 6 వేల కోట్లకు పైగా పన్నులు, డివిడెండ్లు లభిస్తున్నాయి. విస్తరణ,  లాభాలు  పెరగడం వల్ల రెవెన్యూ  కూడా పెరుగుతుంది. అందుకే  
తెలంగాణకు  కొంగు బంగారం అయిన సింగరేణిని మనమంతా కాపాడుకోవాలి. 

ఉద్యమకారులపై కేసీఆర్​ నిర్లక్ష్యం

--సకల జనుల సమ్మె ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్,  తెలంగాణ ఉద్యమ నేత  కేసీఆర్,  సింగరేణి జేఏసీ నాయకులను అప్పటి తెలంగాణ జేఏసీ చైర్మన్,  ప్రస్తుత టీజేఎస్ అధ్యక్షుడు  ప్రొఫెసర్ కోదండరాం,  సింగరేణి  జేఏసీ చైర్మన్ గా నన్ను,  కెంగర్ల మల్లయ్యను  సైతం  పిలిపించి సమ్మెను  విరమించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. 

మొత్తం దక్షిణ భారతదేశంలో  సమ్మె  ప్రభావం తీవ్రంగా పడిందని పరిశ్రమలు మూత పడుతున్నాయని,  విద్యుత్​కు  ఇబ్బందులు  అవుతున్నాయని,  ఢిల్లీ,  నోయిడా వరకు సమ్మె సెగలు వ్యాపించాయని పేర్కొనడం జరిగింది.  అంటే  బొగ్గు గని  కార్మికుల  సమ్మె  ప్రభావం ఏ విధంగా పడిందో  స్పష్టమైపోతుంది.  అప్పటి ఉద్యమ నేత,   కేసీఆర్  తెలంగాణ కోసం నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడు ఆయన అరెస్టును నిరసిస్తూ కూడా మొట్టమొదటిసారి సమ్మెకు దిగింది కూడా బొగ్గు గని కార్మికులే. ఈ ఉద్యమంలో  సింగరేణి  ప్రాంతంలో  తీవ్ర నిర్బంధానికి, అరెస్టులకు గురైన వారెవ్వరికి  కూడా  గత బీఆర్ఎస్ పాలనలో భాగస్వామ్యం ఇవ్వలేదు.  ఉద్యమకారులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. 

ఎంపీగా వివేక్ పాత్ర కీలకం

సకల జనుల సమ్మె సింగరేణి  జేఏసీ నాయకత్వంలో జరిగింది.  టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, టీఎన్టీయూసీ, ఐఎఎఫ్ టీయూ, ఎస్సీ, ఎస్టీ కార్మిక సంఘం, ఉద్యోగుల సంఘం ఇలా ఎన్నో కార్మిక సంఘాలు కలిసి వచ్చాయి. అప్పటి ఎంపీ,  ప్రస్తుత  చెన్నూర్  ఎమ్మెల్యే  గడ్డం వివేక్ వెంకటస్వామి  తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.  అప్పటి కాంగ్రెస్  ఎంపీలు  పొన్నం ప్రభాకర్,  మధుయాష్కి,  రాజగోపాల్ రెడ్డి, మంద జగన్నాథం లాంటి వారితో  కలిసి  రాజీనామా  చేశారు. అరెస్ట్ అయ్యారు. 

మాజీ  కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి సీడబ్ల్యూసీ  సమావేశాన్ని తెలంగాణ  కోసం  బహిష్కరించారు.  జయశంకర్ సార్, కోదండరాం సార్,  కాకా వెంకటస్వామి తదితరులు వివేక్ ఇంటిలోనే పలుమార్లు సమావేశం అయి ఉద్యమంపై చర్చలు చేసేవారు.  యూనియన్ల నాయకులు,  కార్యకర్తలపైన  ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. నిరంతరం అరెస్టులు జరిగేవి. సింగరేణి కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్​ వద్ద కూడా ధర్నా నిర్వహించారు. 

కోల్ బెల్ట్ లోని  జర్నలిస్ట్ ల  ఆధ్వర్యంలో  ఢిల్లీలో ధర్నా నిర్వహించాం.  సింగరేణి కార్మికుల పోరాటం తెలంగాణ సాధనలో ఉద్యమం పెరగడానికి స్ఫూర్తినిచ్చిందని, చారిత్రాత్మకమని, అప్పటి మాజీ ఎంపీ, దివంగత సుష్మాస్వరాజ్ మాతో పేర్కొన్న విషయాలు ఎన్నటికీ మర్చిపోలేనివి.  సోనియాగాంధీ సైతం అప్పట్లో బొగ్గుగని కార్మికులను కలిసి సంఘీ భావం, మద్దతు తెలిపిన దాఖలాలున్నాయి. 

- ఎండీ మునీర్, 
సీనియర్ జర్నలిస్ట్