-
సంస్థ లాభాల దిశలో పయనిస్తుందన్న మేనేజ్మెంట్
- ఇన్విటేషన్ కార్డులకే పరిమితమైన సీఎండీ రాక
- వేడుకల్లో కానరాని కార్మికులు, కార్మికుల కుటుంబాలు
భద్రాద్రికొత్తగూడెం/ మణుగూరు, వెలుగు : సింగరేణి 135వ అవతరణ వేడుకలు శుక్రవారం కొత్తగూడెంలోని హెడ్ఆఫీస్సమీపంలోని ప్రకాశం స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. డైరెక్టర్లు ఎస్. చంద్రశేఖర్, ఎన్. బలరామ్, డి. సత్యనారాయణ హాజరై ప్రారంభించి, సింగరేణి జెండాను ఎగురవేశారు. అనంతరం స్టేడియంలో సింగరేణిలోని వివిధ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసిన ప్రగతి స్టాల్స్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్(పా) చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘సింగరేణి కాలరీస్’ఈ ఏడాది రూ. 32వేల కోట్ల టర్నోవర్, రూ. 2వేల కోట్ల లాభాల దిశగా పురోగమిస్తోందని తెలిపారు.
సింగరేణి సంస్థలకు మరో వందేండ్ల వరకు ఢోకా లేదన్నారు. ఈ ఏడాది 700లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా సాగుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు అదనంగా మరో 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేస్తున్నామన్నారు. అనంతరం స్టేడియంలో నిర్మించిన క్రీడా ప్రాంగణ వేదికను ప్రారంభించారు. రాత్రి జరిగిన వేడుకల్లో భాగంగా ఉత్తమ ఉద్యోగులు, అధికారులతో పాటు బెస్ట్ స్వచ్ఛ పక్వాడా ఏరియాల అధికారులను సన్మానించారు. జీఎంలు కె. బసవయ్య, ఎ. ఆనందరావు, టీబీజీకేఎస్ప్రెసిడెంట్బి. వెంకట్రావ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్సెక్రటరీ సీతారామయ్యతో పాటు వివిధ శాఖల ఆఫీసర్లు, యూనియన్ లీడర్లు పాల్గొన్నారు.
హాజరు కాని సీఎండీ
సింగరేణి కాలరీస్ సీఎండీ ఎన్. శ్రీధర్ వేడుకలకు హాజరవుతున్నారని ఆహ్వాన పత్రికల్లో ముద్రించారు. కానీ ఆయన హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌కే పరిమితమయ్యారు. గత రెండేండ్లకు పైగా ఇండిపెండెన్స్, రిపబ్లిక్, తెలంగాణ ఫార్మేషన్, సింగరేణి డే సెంట్రల్ ఫంక్షన్‌కు వస్తున్నారంటూ ఆహ్వాన పత్రికల్లో ముద్రించడం ఆయన రాకపోవడం కామన్‌గా మారిందని పలువురు కార్మికులు పేర్కొనడం గమనార్హం. సీఎండీ వస్తే కార్మిక సంఘాల లీడర్లతో పాటు కార్మికులు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని ఎదురు చూస్తుండడం సర్వసాధారణంగా మారింది.
కానరాని కార్మికులు, కార్మిక కుటుంబాలు
‘సింగరేణి డే’ సందర్భంగా కార్మికులకు సెలవు లేకపోవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన సెంట్రల్ ఫంక్షన్ వేడుకలు వెలవెలబోయాయి. సింగరేణి ఉమెన్స్, నర్సింగ్ కాలేజ్స్టూడెంట్స్, సెక్యూరిటీ, వివిధ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు సంబంధించి ఆఫీసర్లు మాత్రమే కనిపించారు. కార్మిక కుటుంబాలు కూడా పెద్దగా కానరాలేదు.
ఉత్పత్తి సాధనకు సమష్ఠిగా కృషి చేద్దాం
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో యాజమాన్యం నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు సమష్ఠిగా కృషి చేయాలని జీఎం జక్కం రమేశ్పిలుపునిచ్చారు. సింగరేణి డే వేడుకలను జీఎం ఆఫీస్‌తో పాటు రుద్రంపూర్‌లోని ప్రగతి వనంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఈ ఫైనాన్షియల్ఇయర్లో ఇప్పటి వరకు 82.81లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశామని, మార్చి చివరి నాటికి నిర్ధేశించిన 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఇల్లందులో..
సింగరేణి ఇల్లందు ఏరియాలో వివిధ గనులు, విభాగాల్లో పతాకావిష్కరణ చేశారు. జీఎం ఆఫీస్‌లో సింగరేణి వ్యవస్థాపకుడు డా.విలియం కింగ్ విగ్రహానికి జీఎం ఎం.షాలెంరాజు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఏరియాలోని మొదటిగని అయిన కొత్తపూసపల్లి గ్రామంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ లో సాయంత్రం ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను ఎమ్మెల్యే హరిప్రియ, జీఎం ఎం.షాలెంరాజు, సేవ అద్యక్షురాలు జి.మధురవాణి ప్రారంభించారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
‘సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు కార్మిక సంక్షేమం తమకు రెండు కళ్లు’ అని మణుగూరు ఏరియా జీఎం జి. వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో సింగరేణి పతాకాన్ని ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి చీకటి గనుల్లో పనిచేస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న కార్మికుల కృషిఅభినందనీయమన్నారు. ఎస్ఓటు జీఎం డి.లలిత్ కుమార్, ఏజీఎంలు పాల్గొన్నారు.