చెరువుకు ఒక్క మత్తడి మాత్రమే ఉండటం కామన్. కానీ సముద్రలింగాపూర్ లోని సింగసముద్రం చెరువుకు ఐదు మత్తళ్లుంటాయి. ఐదు వైపుల నుంచి చెరువులోని నీరు ఈ మత్తళ్ల ద్వారా దూకటం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
గ్రామానికి సమీపంలోని గోరంటాల వాగు నుంచి వచ్చే నీరు ఈ చెరువులో చేరి.. మత్తడి దూకి.. గొలుసుకట్టులో నిర్మించిన ఇతర చెరువుల్లోకి వెళుతుంది. 0.37 టీఎంసీల సామర్థ్యం గల ఈ చెరువును కాకతీయుల కాలంలో తవ్వించారు. మిషన్ కాకతీయలో భాగంగా దీన్ని మరమ్మతు చేశారు. ఇటీవల భారీగా వర్షం కురవడంతో ఎగువన ఉన్న గోరంటాల వాగు నుంచి అధికమొత్తంలో నీరు సింగసముద్రంలోకి వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా ఒకే రోజులో 26 ఫీట్లకు నీటి మట్టం చేరుకుంది. పూర్తిగా నిండింది.
ప్రస్తుతం ఐదు మత్తడుల జలసందడి చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్ధిపేట, హైదరాబాద్ ప్రాంతాల నుంచి.. పర్యాటకులు వచ్చి వెళ్తున్నారు. సందర్శకుల తాకిడి పెరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో.. సింగసముద్రం దగ్గర సెల్ఫీలు, ఫొటోలు దిగటం నిషేదించారు పోలీసులు.
సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువును టూరిజం స్పాట్ గా మార్చాలని చాలా రోజులుగా స్థానికులు కోరుతున్నారు. అప్పర్ మానేరు కూడా ఇక్కడికి దగ్గరగా ఉండటంతో.. ఆ ప్రాజెక్టుతో పాటు.. సింగసముద్రంను కూడా చూసేందుకు భవిష్యత్తులో పెద్దఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పర్యాటకుల కోసం రెస్ట్ రూంలతోపాటు, బోటింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో చెరువును చూసేందుకు వచ్చామంటున్నారు టూరిస్టులు.
అరుదైన ఐదు మత్తళ్ల చెరువు అందాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశమున్నప్పటికీ.. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంత సెక్యూరిటీ పెంచి, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచి పర్యాటకులను అనుమతించాలని కోరుతున్నారు ప్రజలు. ప్రతి వర్షాకాలంలోనూ కనువిందు చేసే ఈ చెరువు పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుని, టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
రైతన్నలకు అండగా నిలుస్తున్న సింగసముద్రం.. ఎల్లారెడ్డిపేట మండలంలోని అనేక చెరువుల్లోకి ఈ చెరువు నుంచే నీరు వెళ్తుంటుంది. దాదాపు 11వందల ఎకరాల ఆయకట్టు ఈ చెరువు పరిధిలో సాగవుతోంది.