RRR అవార్డ్ పై సీఎం జగన్ ట్వీట్...అడ్నాన్ సమీ ఫైర్

RRR అవార్డ్  పై సీఎం జగన్ ట్వీట్...అడ్నాన్ సమీ ఫైర్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్  చేసిన ట్వీట్ పై   సింగర్ అడ్నాన్ సమీ మండిపడ్డాడు. “తెలుగు జెండా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోంది. యావత్‌ రాష్ట్రం తరపున, కీరవాణి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ సహా ‘RRR’ టీమ్ కు అభినందనలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాము” అంటూ సీఎం జగన్ ట్వీట్‌ చేశారు. అయితే జగన్ ట్వీట్ పై అడ్నాన్ సమీ  స్పందించాడు. 

ముందుగా మనం భారతీయులమని, వేర్పాటువాద వైఖరి  మంచిది కాదంటూ జగన్ ట్వీట్ కు అడ్నాన్ సమీ రిప్లై ఇచ్చాడు. " తెలుగు జెండానా...భారత జెండా కదా? ముందుగా మనం భారతీయులం. దేశం నుండి మిమ్మల్ని మీరు వేరుచేయడం ఆపండి. అంతర్జాతీయంగా మనది ఒకే దేశం. వేర్పాటువాద వైఖరి మంచిది కాదు.1947లో మనం చూశాం కదా!!ధన్యవాదాలు...జై హింద్"అంటూ అడ్నాన్ సమీ ట్వీట్ చేశాడు.  

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం గతేడాది మార్చిలో రిలీజై భాషతో సంబంధం లేకుండా అన్ని బాషల్లో కోట్లు కొల్లగొట్టింది. రీసెంట్‭గా జపాన్‭లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‭ను సొంతం చేసుకుంది. హాలీవుడ్‭కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తరువాత సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. రీసెంట్‭గా రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించింది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.