Singer Chinmayi: అధికారం, రాజకీయ బలం, డబ్బు..సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై చిన్మయి కామెంట్స్

Singer Chinmayi: అధికారం, రాజకీయ బలం, డబ్బు..సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై చిన్మయి కామెంట్స్

తెలుగు, తమిళ భాషల్లో తన గొంతుతో..తన పాటలతో దగ్గరైన సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada). సమాజంలో ఆడవాళ్లకు ఏ సమస్య వచ్చిన..బయట మానవ మృగాల చేతిలో ఎవరైనా అఘాయిత్యానికి గురైన..సోషల్ మీడియాలో చిన్మయి స్పందిస్తుంది.

కొన్నిసార్లు ఆమె స్పందించడం వల్ల జరిగిన ఇస్స్యూ ఏదైతే ఉందో..క్షణాల్లో వైరల్ అయిపోయి..అందరూ రియాక్ట్ అయ్యేలా చేస్తోంది.ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే తనదైన రీతిలో స్పందించే చిన్మయి..తాజాగా హేమ కమిటీ (Hema Committee) రిపోర్ట్‌పై స్పందించారు. ఈ సందర్భంగా కమిటీ పనితీరును ఆమె ప్రశంసించారు.

ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిన్మయి మాట్లాడుతూ..‘వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ (డబ్లూసీసీ) వల్లే ఇది సాధ్యమైంది. ముందుగా డబ్లూసీసీకి హ్యాట్సాఫ్. ఇప్పటి వరకూ ఇలాంటిది ఏ చిత్ర పరిశ్రమలోనూ జరగలేదు. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉంటానేది బహిరంగ రహస్యం. సినిమా పరిశ్రమకు ఏదో ఒక విధంగా చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇక్కడ లైంగిక వేధింపులు సర్వసాధారణమని అందరూ నమ్ముతారు. ఇలాంటి ఘటన జరిగిందని చెప్పినా నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడం లేదు. సమస్య గురించి ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కేసు సంవత్సరాలపాటు సాగుతూనే ఉంటుంది. అందుకు కారణం అధికారం, రాజకీయ బలం, డబ్బు. వాటి వల్లే నేరస్తులను శిక్షించడం కష్టంగా మారుతోంది’ అని చిన్మయి తెలిపారు.

ALSO READ | Hema Committee Report: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు..జస్టిస్ హేమ కమిటీ ఏం చెబుతోంది?

ఇక ఇదే ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని కూడా చిన్మయి గుర్తు చేసుకున్నారు. ‘నేను తమిళ పాటల రచయిత వైరముత్తు నుంచి స్వయంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. అతడి గురించి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడాను. అందుకు ఆ పరిశ్రమలో నేను పనిచేయకుండా చేశాడు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా చిన్మయి..ఐదేళ్ల క్రితం మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే.

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ (Hema Committee) ఇటీవల విడుదల చేసిన నివేదిక..రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపింది. రిటైర్డ్ హైకోర్టు జ‌డ్జి కే హేమా..ఆ క‌మీష‌న్‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. న‌టి శార‌దతో పాటు మాజీ సివిల్ స‌ర్వీస్ అఫిషియ‌ల్ కేబీ వాత్సల కుమారి ఆ క‌మీష‌న్‌లో స‌భ్యులుగా ఉన్నారు. ఆ క‌మీష‌న్ ఇటీవలే త‌న నివేదిక‌ను సీఎం విజ‌యన్‌కు స‌మ‌ర్పించింది.

ఈ నివేదిక అనంతరం.."మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను" పరిశీలించేందుకు ప్రత్యేక సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమై ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సిఎంఓ తెలిపింది.