సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కన్నుమూత

సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కన్నుమూత

కేకే గా పేరొందిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (53)  గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. కోల్ కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో మంగళవారం రాత్రి జరిగిన లైవ్ కన్సర్ట్ లో పాల్గొని హోటల్ కు చేరుకున్న కాసేపటికే ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే  సమీపంలోని సీఎంఆర్ఐ ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే కేకే మృతిచెందినట్లు వైద్యులు రాత్రి 10.30 గంటలకు వెల్లడించారు. అయితే తాను పాల్గొన్న లైవ్ కన్సర్ట్ ఫొటోలను కేకే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ (కేకే లైవ్ నౌ) లో షేర్ చేశారు. లైవ్ కన్సర్ట్ లో ఆయన చివరి సారిగా ‘హమ్ రహే యా నా రహే యాడ్ ఆయెంగే యే పల్’ అనే పాటను పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KK (@kk_live_now)

ప్రధాని సంతాపం..

వాస్తవానికి కన్సర్ట్ ముగిశాక తాను బస చేసిన హోటల్ కు బయలుదేరే సమయంలోనే.. కృష్ణకుమార్ కున్నత్ అస్వస్థతకు లోనై ఉండొచ్చని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలను బట్టి తెలుస్తోంది. హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లో ఆయన 200కుపైగా పాటలు పాడారు. కృష్ణకుమార్ కున్నత్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివిధ భావోద్వేగాలను రాగం పలికించేలా ఆయన వైవిధ్య భరిత పాటలను పాడారని గుర్తు చేసుకున్నారు. కేకే కుటుంబ సభ్యులు, అభిమానులకు తన సంతాపాన్ని ప్రకటించారు. క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, నటుడు అక్షయ్ కుమార్, సింగర్స్ శ్రేయ ఘోషల్, సోనూ నిగమ్ సహా పలువురు ప్రముఖులు కేకే మృతిపట్ల సంతాపం తెలిపారు. 

 

తెలుగు పాటల తోటలో కేకే..

కృష్ణకుమార్ కున్నత్ 1968 ఆగస్టు 23న ఢిల్లీలో జన్మించారు. 1999లో  బాలీవుడ్ సినిమా ‘పాల్’తో గాయకుడి కెరీర్ ను ప్రారంభించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, అస్సామీస్ తదితర భాషల్లో ఆయన పాటలు పాడారు. 1994లో ‘ప్రేమదేశం’ సినిమాలోని ‘కాలేజీ స్టైలే’, ‘హలో డాక్టర్ హార్టు మిస్సాయే’ సాంగ్స్ ఎవర్ గ్రీన్. వాటిని పాడింది మరెవరో కాదు.. కృష్ణకుమార్ కున్నత్. ఖుషీ మూవీలో యూత్ ను ఫిదా చేసిన ‘ఏ మేరా జహా ’ పాట కూడా ఆయనే  పాడారు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘వాసు’ మూవీలో  ‘పాటకు ప్రాణం పల్లవి అయితే..’ సాంగ్ ను పాడింది కృష్ణకుమారే. ఘర్షణ సినిమాలో ‘చెలియ చెలియ’, అపరిచితుడు మూవీలో ‘కొండకాకి కొండెదాన’, మున్నా సినిమాలో రెండు పాటలను కూడా ఆలపించారు. ఆర్య మూవీలో ‘ఫీల్ మై లవ్’, ఆర్య2 లో ‘ఉప్పెనంత’ సాంగ్స్ ను కేకే పాడారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో ‘చైల చైల చైలా చైలా’, నా ఆటో గ్రాఫ్ సినిమాలో ‘గుర్తుకొస్తున్నాయి’ పాటలతో కేకే అదరగొట్టారు. గుడుంబా శంకర్ సినిమాలో ‘లే లే లెలే’, జల్సాలో ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’, ఓయ్ మూవీలో ‘వెయిటింగ్ ఫర్ యు’, ప్రేమ కావాలిలో ‘మనసంతా ముక్కలు చేసి’, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో టైటిల్ సాంగ్స్ను కూడా కృష్ణకుమార్ కున్నత్ ఆలపించారు. 2014 లో ఎవడు సినిమాలో ‘చెలియ చెలియ’ పాటను ఆయనే పాడారు. అదే ఏడాది హిందీ సినిమా ‘ఆషికి 2’కి  రీమేక్ గా తెరకెక్కిన ‘నీ జతగా నేనుండాలి’ మూవీలో ‘కనబడునా’ అనేది కేకే చివరి తెలుగు పాట.  

మరిన్నివార్తలు.. 

జూన్ 2న విరాటపర్వంలోని నగదారిలో సాంగ్ రిలీజ్

తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం