- నాకు తెలుగు వచ్చు. అప్పుడప్పుడు మా వాళ్లతో మాట్లాడతా. వైజాగ్‌లో బంధువులు ఉంటారు.
- బిస్మిల్లా ఖాన్, అంజాద్ అలీ ఖాన్, సితారా దేవీ, పర్వీన్ సుల్తానా వంటి వాళ్లందరి పాటలు లైవ్‌లో చూశా.
- రోజులో మూడు గంటలు ప్రాక్టీస్ చేస్తా. ఈ ప్రాక్టీస్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు.
- మా నాన్నతో నాకు స్పెషల్ బాండ్ ఉంది. మా నాన్న ముఖంలో కనిపించే ఎక్స్‌ప్రెషనే నాకు పెద్ద కాంప్లిమెంట్. నేను ఎంత బాగా పాడగలను అనేది ఆయనకు తెలుసు. అలాగే మా అమ్మ, నా బ్రదర్ నా పాటలకు బెస్ట్ క్రిటిక్స్.
రజినీ కాంత్ ‘జైలర్’, షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. కానీ, ఆ సినిమాల్లోని ‘‘వా.. నువ్వు కావాలయ్యా...’’, ‘‘చలేయా.. తేరి ఓర్...” అనే ఈ రెండు పాటలు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ పాటల ఒరిజినల్ వెర్షన్స్ పాడింది శిల్పారావ్. ‘‘చిన్నప్పుడే నేను సంగీతం నేర్చుకున్నా.. కానీ గాయని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా సంగీతంపై దృష్టి పెట్టా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా సంగీత ప్రయాణం చాలా బాగుంది. నా హార్డ్ వర్క్ సక్సెస్ తెచ్చిపెట్టింది’’ అంటున్న శిల్ప సింగింగ్ జర్నీ ఆమె మాటల్లోనే..
‘‘నేను పుట్టింది జంషెడ్ పూర్లో. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాం. జంషెడ్ పూర్లో స్కూల్లో చదివా. ఆ టైంలో స్కూల్లో కోయర్ గ్రూప్‌లో చేరా. తర్వాత 1997లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ముంబై వెళ్లా. ముంబై యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్‌లో డిప్లొమా చేశా. నా సంగీతం గురించి చెప్పాలంటే ముందు మా నాన్న గురించి చెప్పాలి. ఆయన పేరు ఎస్. వెంకట్రావ్. మ్యూజిక్‌లో ఎం.ఎ. చేశారు ఆయన. నా మూడేండ్ల వయసులోనే మ్యూజిక్ నేర్పించడం మొదలుపెట్టాడు. తనతో పాటు నన్ను కచేరీకి తీసుకెళ్లాడు. అలా నాన్నతో కలిసి జంషెడ్‌పూర్‌లో చాలా స్టేజీ షోలకు వెళ్లా. అలా సంగీతం మీద నాకు ఇష్టం పెరిగింది. ఆ తర్వాత ఒకసారి హరిహరన్‌ని కలిశా. అప్పుడు నాకు పదమూడేండ్లు ఉంటాయి. ఉస్తాద్ గులామ్ ఖాన్ దగ్గర మ్యూజిక్ నేర్చుకోమని సలహా ఇచ్చారు ఆయన. అలా నా పాటల ప్రయాణానికి మొదటి అడుగుపడింది.
కెరీర్ షురూ
సంగీతం అయితే నేర్చుకున్నా కానీ అవకాశాల కోసం మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. ఉండుంటే అంత స్ట్రగుల్స్ పడేదాన్ని కాదేమో! ఆ టైంలో జంషెడ్ పూర్ నుంచి ముంబై వెళ్లా. అక్కడుంటేనే అవకాశాలు వస్తాయని డిసైడ్ అయ్యా. చాలా ఓపికగా అవకాశాల కోసం ఎదురు చూశా. ఆ తర్వాత 2001లో హరిహరన్‌తో కలిసి లైవ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చా. ఒకసారి స్టేజీ షో కోసం వెళ్లినప్పుడు శంకర్ మహదేవన్‌ని కలిశా. అప్పుడు ఆయన జింగిల్స్ నేర్చుకోమని నాకు కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చారు. మూడేండ్లు జింగిల్ సింగర్‌గా చేశా. క్యాడ్బరీ మంచ్, సన్‌సిల్క్, యాంకర్ జెల్, నో మార్క్స్ వంటి ప్రొడక్ట్స్‌కి అడ్వర్టైజ్మెంట్ జింగిల్స్ పాడా. కాలేజీలో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మిథున్ని కలిశా. ఆయన 2007లో అన్వర్ సినిమాలో ‘టోస్ నైనా’ అనే పాట పాడే అవకాశం ఇచ్చారు. అలా సినిమా సింగింగ్ కెరీర్ షురూ అయింది.
ఖుదా జానే..
2008లో ‘బచ్నా ఏ హసీనో’ సినిమాలో ‘ఖుదా జానె’ అనే పాట సింగర్ కేకేతో కలిసి పాడా. ఆ పాట తర్వాత నా లైఫే మారిపోయింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అయితే, సక్సెస్ రావడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టమైన పని. ఎవరూ వడ్డించిన విస్తరి మన ముందు పెట్టరు. కానీ, టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో ఎవరూ ఆపలేరు అనేది నమ్ముతా నేను.
క్లాసికల్ ఒక్కటే కాదు..
నాకు అన్నిరకాల మ్యూజిక్ ఇష్టమే. నేను నాన్న దగ్గర క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నా. హరిహరన్ దగ్గర గజల్స్, పర్ల్ జామ్స్ ఎడ్డీ వెడ్డర్, బ్రిటిష్ సింగర్స్ స్టింగ్, సేడ్ వంటి వాళ్లని ఇన్స్పిరేషన్గా తీసుకుని అన్ని రకాల పాటలు పాడటానికి ట్రై చేసేదాన్ని. బాలీవుడ్లో నాకిష్టమైన సింగర్స్ సునిధి చౌహన్, శంకర్ మహదేవన్. వాళ్ల పాటలు బాగా వినేదాన్ని.
క్లాసికల్ సింగింగ్తోపాటు గజల్స్ కూడా నేర్చుకున్నా. చెప్పాలంటే.. గజల్స్ నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఒక రెండేండ్లు ఇండియాలోని రకరకాల ప్రాంతాల్లో చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చా. నేను ప్రతి పాటలో గజల్, సూఫీ టెక్నిక్స్ వాడతా. అది ‘ధూమ్ 3’లో మలంగ్, ‘ఏ దిల్ హై ముష్కిల్’లో బుల్లెయ్యా, ‘కళంక్’లో ‘బేషరమ్ రంగ్’ వంటి సాంగ్స్‌లో అలా ట్రై చేశా. వాటిలో కొన్ని పాటలు హిట్ అవుతాయి. కొన్ని అంతగా జనాల్లోకి వెళ్లవు. అలాగని నేనెప్పుడూ డిజప్పాయింట్ అవ్వలేదు. ప్రతి పాట కొత్తగా పాడాలని ట్రై చేస్తా. ఆడియెన్స్‌కి నచ్చినట్టు పాడాలనేదే నా ప్రయత్నం.
వాయిస్ కోసం..
వాయిస్ ఎప్పుడు పాడినా ఫ్రెష్‌గా ఉండాలంటే వోకల్ హెల్త్ బాగుండాలి. దానికి రెస్ట్ అవసరం. కంటినిండా నిద్ర ఉంటే వోకల్స్‌తో అద్భుతాలు చేయొచ్చు. అలాగే వాయిస్ కోసం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటా. ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రాక్టీస్ రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటా. అది వాయిస్‌కి మంచి షేప్ ఇస్తుంది.
భాష నేర్చుకోనక్కర్లేదు!
పాడిన ప్రతి పాటతో తప్పకుండా కనెక్షన్ ఉంటుంది. కంపోజర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్.. అందరూ కలిసి ఓపెన్ మైండెడ్‌గా పనిచేస్తారు. వాళ్లంతా ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతోనే ఉంటారు.
కొత్త భాషలో పాడడానికి భాష నేర్చుకోవాల్సిన అవసరంలేదు. సంగీతంలో ఉండే మ్యాజిక్ అదే. ఏ పాట విన్నా, అది అర్థం కాకున్నా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. అందుకు కారణం సంగీతమే. కానీ, ఒక పాట పాడేటప్పుడు పదాలు పలికేటప్పుడు ఉచ్ఛారణ సరిగా ఉండాలి. దానికోసం మాత్రమే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది.’’
చలేయా ఛాన్స్
షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా డడ్లానీ నాకు ఫోన్ చేసి.. ‘జవాన్ సినిమాలో ‘చలేయా’ పాట పాడాలి. షారుఖ్ నిన్ను అడగమన్నారు’ అని చెప్పింది. అది నాకు పెద్ద కాంప్లిమెంట్. ఆ తర్వాత నేను అనిరుధ్‌ని చెన్నైలో కలిసి ‘షారుఖ్ చెప్పింది నా గురించే’ అని పరిచయం చేసుకున్నా. ఇద్దరం కంపోజింగ్ రూంలో కూర్చుని ఇరవై నిమిషాల్లో సాంగ్ రికార్డింగ్ కంప్లీట్ చేశాం. తర్వాత ఆ పాటని షారుఖ్‌కి పంపించాం. పాట విని ‘చాలా బాగా వచ్చింద’ని చెప్పారు.
కావాలయ్యా... కలగనలేదు
రజినీకాంత్ సినిమాలో నేను పాడతానని ఊహించలేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను డైరెక్ట్‌గా తమిళ పాటలు పాడ లేదు. భాష కూడా రాదు. కానీ, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలోని ఒక సాంగ్ తమిళ వెర్షన్ నేను పాడా. అంతే! కాబట్టి తమిళంలో నేను పాడిన మొదటి పాట ‘కావాలయ్యా..’ అని చెప్పొచ్చు. కోలీవుడ్‌లో నా ఫస్ట్ సాంగ్ రజినీకాంత్ సినిమాలో పాడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాట లిరిక్స్ తమిళం, తెలుగు మిక్స్ అయి ఉంటుంది. నేను తెలుగమ్మాయినే కాబట్టి తెలుగు పదాలు నాకు తెలుసు. తమిళ పదాలు మాత్రం రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేశాక పాడగలిగా. పాడేటప్పుడు లిరిక్స్ తప్పుగా పలికితే అనిరుధ్ కరెక్ట్ చేసేవాడు. ఒక టీచర్లా ప్రతి విషయంలో కేర్ తీసుకుని పాడించాడు అతను. పాట పూర్తి చేయడానికి దాదాపు ఒక గంట టైం పట్టింది. పాడినంతసేపూ ఎంజాయ్ చేశా. ఆ పాట ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అనిరుధ్‌కి థ్యాంక్స్ చెప్పాలి.