ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్(Usha Uthup) సంగీత ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇండియన్ పాప్ సంగీత సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేశారు ఉష.
తాజా విషయానికి వస్తే..గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ (78) (Jani Chacko Uthup) గుండెపోటుతో మరణించారు. కోల్‌కతాలోని తన ఇంట్లో సోమవారం రాత్రి టీవీ చూస్తున్న సమయంలో చాకోకి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. చాకో కుటుంబ సభ్యులు ఈరోజు (మంగళవారం) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చాకో,ఉషా దంపతులకు కుమారుడు సన్నీ మరియు కుమార్తె అంజలి ఉన్నారు. చాకో మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు
కుమార్తె అంజలి తన తండ్రికి సోషల్ మీడియాలో నివాళులర్పించారు. తన తండ్రిపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.."అప్పా..వెంటనే వెళ్ళిపోయావు..కానీ నువ్వు జీవించినంత స్టైలిష్‌గా..ప్రపంచంలో మరెవ్వరు జీవించి ఉండలేరు.అత్యంత అందమైన మనిషివి..మేము నిన్ను ఎప్పటికి ప్రేమిస్తుంటాం" అంటూ పోస్ట్ చేసింది.
ఉషా ఉతుప్ సినిమా కెరీర్ 1971 లో మొదలవ్వగా తనదైన పాటలతో అలరించింది.ఎలాంటి పాటనైనా తన స్టైల్‌లో పాడి సంగీత ప్రపంచంలో ఉషా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.ఇప్పటివరకు 15 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు.ఆమె సంగీత రంగానికి చేసిన సేవలకు గాను ఉషా ఉతుప్‌ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఇకపోతే,ఉషా ఉతుప్ తెలుగులోనూ మంచి ఉర్రుతగిలించే ఎన్నో పాటలు పాడి మెప్పించింది.అల్లు అర్జున్ రేసుగుర్రం టైటిల్ సాంగ్‌ను ఉషా ఉతుప్ పాడారు.ఇక హిందీలో ఆమె ప్రసిద్ధ పాటల్లో కొన్ని "హరి ఓం హరి," "దోస్టన్ సే ప్యార్ కియా," "వన్ టూ చా చా చా," మరియు మరికొన్ని ఉన్నాయి.