- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సీసీఐ కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని, గుజరాత్ లో క్వింటాలు పత్తికి చెల్లిస్తున్న మద్దతు ధరను తెలంగాణ రైతులకు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లోనిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుజరాత్ లో ఉన్న పత్తి ధర తెలంగాణ రైతుల పత్తికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్రమంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. వానల మూలంగా పత్తిని స్టాక్ పెట్టుకోలేక రైతులు సతమతం అవుతున్నారని, దళారుల చేతుల్లోకి రైతులను నెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. దిక్కులేని పరిస్థితులలో రైతులు మద్దతు ధర క్వింటాలు పత్తికి రూ.7521కి బదులు రూ.5500కు అమ్ముకుంటున్నారని తెలిపారు.