వనపర్తి, వెలుగు: రెవెన్యూ శాఖలోని లోపాలను సవరించి, ఉద్యోగుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి ఆయా ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీఆర్వో వ్యవస్థలో వీఆర్ఏల పూర్వీకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కావలికార్లుగా పిలిచే వారిని వీఆర్వోలుగా మార్చి ప్రస్తుతం వివిధ శాఖల్లో నియమించిందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 400 మందితో పాటు సంగారెడ్డి నుంచి వచ్చిన 23 మందికి, నాగర్ కర్నూల్ నుంచి వచ్చిన 14 మందికి శాఖలు కేటాయించినట్లు తెలిపారు.
456 మందిలో గురువారం 444 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. మిగిలిన 12 మందికి వివిధ కారణాలతో నియామకం వాయిదా వేశామన్నారు. డిగ్రీ పూర్తి చేసిన 93 మందికి జూనియర్ అసిస్టెంట్ హోదాలో నియామకం చేయగా, 48 మందికి రికార్డు అసిస్టెంట్, మిగిలిన వారికి నాల్గో తరగతి ఉద్యోగులుగా నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. 115 మందిని రెవెన్యూ శాఖకు, మిగిలిన వారిని ఇరిగేషన్, మున్సిపల్ శాఖల్లో నియమించినట్లు చెప్పారు. ఆర్డీవో పద్మావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: జిల్లాలోని వీఆర్ఏలనుప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులను మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ పి ఉదయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలతో కలిసి నియామక ఉత్తర్వులను అందజేశారు. అడిషనల్ కలెక్టర్లు కుమార్ దీపక్, సీతారామారావు పాల్గొన్నారు.