- సింగరేణిపై సింగిరెడ్డిపల్లి గ్రామస్తుల పోరు
- 14 ఏండ్లుగా పరిహారం కోసం ఎదురుచూపులు
- గని విస్తరణకు గ్రామంలో స్థలం సేకరించిన సింగరేణి
- మొత్తం 919 మందికి పీడీఎఫ్స్కీం కింద పరిహారం
- నాడు స్టూడెంట్స్‌గా ఉన్న 158 మంది, సింగరేణి కార్మికులు 72 మందికి అందని పరిహారం
గోదావరిఖని, వెలుగు : రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ 1 డివిజన్‌లోని జీడీకే 11 గని విస్తరణకు 2008లో రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామంలో సింగరేణి స్థల సేకరణ చేసింది. ఇందుకోసం 608 ఇండ్లకు సంబంధించిన జాగ తీసుకుంది. అయితే తమకు సరైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని 14 ఏండ్లుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఆనాడు విద్యార్థులుగా ఉన్న 158 మంది, 72 మంది సింగరేణి కార్మికులకు తగిన పరిహారం ఇవ్వకపోవడంతో వారు డబ్బు తీసుకోలేదు. పక్కనున్న గ్రామాలకు ఇచ్చిన విధంగా, 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు.
బొగ్గు గని విస్తరణ కోసం....
ఆర్జీ 1 డివిజన్ పరిధిలోని జీడీకే11వ గని ప్రారంభానికి జల్లారం పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములను సింగరేణి మేనేజ్‌మెంట్ సేకరించింది. అయితే ఈ గనిని మరింత విస్తరించడానికి వీలుగా ఇదే పంచాయతీకి ఆమ్లెట్ విలేజ్‌గా ఉన్న సింగిరెడ్డి పల్లి గ్రామంలోని 608 ఇండ్లను తీసుకున్నది. మొత్తం 919 మంది ప్రాజెక్ట్ డిస్‌ప్లేస్డ్ ఫ్యామిలీ (పీడీఎఫ్) గా గుర్తించి వీరికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని వర్తింపచేశారు. 2008లో కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పటికీ 2010లో నిర్వాసితులకు డబ్బులు చెల్లించారు. గెజిట్‌లో పొందుపర్చిన విధంగా 2008 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి నిర్వాసితుడికి రూ.6,98,417, సింగరేణి సంస్థలో పనిచేస్తున్న నిర్వాసితులకు, స్టూడెంట్స్ కు రూ.4,13,000 ఇవ్వడానికి సింగరేణి, ప్రభుత్వం ముందుకు వచ్చింది.
పరిహారం తీసుకోవడానికి నిరాకరణ
గెజిట్‌లో పొందుపర్చిన మేరకు గ్రామంలో 158 మంది స్టూడెంట్లు, 72 మంది సింగరేణి కార్మికులు ఈ పరిహారం తీసుకోవడానికి నిరాకరించారు. సింగరేణిలో పనిచేస్తూ తాము సొంత భూమిలో ఇండ్లు నిర్మించుకున్నామని, అందరిలాగానే తమకు ప్యాకేజీ వర్తింపచేయాలని, కొర్రీలు పెట్టుడెందుకని గని కార్మికులు వాపోతున్నారు. అలాగే ఆనాడు మైనర్లు ఉన్న స్టూడెంట్స్ఇప్పుడు మేజర్లయ్యారు. వీరు కూడా తమకు పూర్తి ప్యాకేజీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 14 ఏండ్లుగా వీరు పూర్తి స్థాయి నష్టపరిహారం కోసం ఎదురుచూస్తూ కూలిపోయే ఇండ్లలోనే నివాసముంటున్నారు. మరోవైపు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, విస్తరణకు అడ్రియాల, రచ్చపెల్లి గ్రామాలకు చెందిన భూములు, ఇండ్లను సేకరించింది. ఈ గ్రామాల్లో 2013 భూసేకరణ చట్టం ద్వారా ఒక పీడీఎఫ్‌కు రూ.7,61,000 ఇచ్చారు. దీంతోపాటు గెజిట్‌లో పేర్లు నమోదైన స్టూడెంట్‌కు, సింగరేణి కార్మికుడికి కూడా ఎలాంటి షరతులు లేకుండా రూ.7,61,000 ఇచ్చారు. దీనికి తోడు 2022 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి స్టూడెంట్‌కు అదనంగా రూ.3,75,000 చెల్లించింది. ఆ విధంగా తమకూ ఇవ్వాలని సింగిరెడ్డిపల్లి నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
తగిన పరిహారం చెల్లించాలి
సింగిరెడ్డిపల్లి గ్రామంలో స్టూడెంట్లుగా పేర్లు నమోదైన వారికి ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా నష్టపరిహారం చెల్లించడం సరైంది కాదు. సర్వం కోల్పోయిన తమకు గ్రామంలో ఎలాంటి ఉపాధి దొరకడం లేదని, తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని కలెక్టర్, ఆర్డీవో, సింగరేణి ఆఫీసర్లను కలిసినా స్పందించడం లేదు.
- రేణికుంట్ల నరేశ్, గ్రామస్తుడు
2013 చట్టం అమలు చేయాలి
సింగిరెడ్డి పల్లి గ్రామంలో నిరుద్యోగ యువత ఎలాంటి పనులు లేక ఖాళీగానే ఉంటున్నరు. 2010లో ఇచ్చిన స్టూడెంట్ ప్యాకేజీకి బదులుగా 2013లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ద్వారా ఒక్కొక్కరికి రూ.7,61,000 చెల్లించేలా ప్రభుత్వం, సింగరేణి చర్యలు చేపట్టాలి. భూనిర్వాసితులుగా ఓపెన్‌కాస్ట్‌లు, మైన్లలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేసే అవకాశం కల్పించాలి.
- తోడేటి సాయికుమార్, స్టూడెంట్