
- లక్కీడ్రా తీసి వదిలేసిన్రుఅర్హుల ఎంపికకు రీసర్వే మరిచిన్రు
- కేటాయించకుండా తప్పించుకున్న నాటి ప్రజాప్రతినిధులు
- మంచిర్యాల జిల్లాలో డబుల్ ఇండ్ల కోసం ఎదురుచూపులు
- కొత్త ప్రభుత్వం చొరవచూపాలంటూ వేడుకోలు
కోల్‌బెల్ట్, వెలుగు: బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో మంచిర్యాల జిల్లాలో ఒక్క డబుల్ బెడ్రూంఇల్లు కూడా ఇయ్యలేదు. జిల్లాలో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యి మూడేండ్లు దాటగా, లక్కీ డ్రా తీసి 10 నెలలు ముగిసినప్పటికీ ఇంకా వాటిని లబ్ధిదారులకు కేటాయించలేదు. మరోవైపు మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో ఇండ్లు పూర్తయిలబ్ధిదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో అవకతవకలు చోటు చేసుకోవడంతో రీసర్వేకు ఆదేశాలిచ్చి నెలలు గడుస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు. ఇక బెల్లంపల్లి, చెన్నూరులో ఏండ్లు గడుస్తున్నా ఇండ్ల నిర్మాణం పూర్తికాలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ అలసత్వం కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరలేదు. కాంగ్రెస్ సర్కార్ చొరవచూపి తమకు డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
10 నెలల కిందట లక్కీడ్రా
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ గతంలో రెండు విడతల్లో 650 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో మూడేండ్ల కిందట 330 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. 2,958 మంది ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోగా 1,616 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. గతేడాది మార్చి 17న కలెక్టర్బదావత్ సంతోష్ సమక్షంలో లక్కీ డ్రా తీశారు. అయితే అనర్హులకు ఇండ్లు కేటాయించారని కొందరు ఆందోళనకు దిగారు. సొంత ఇండ్లు ఉన్నవారికే ఇచ్చారని ఆరోపణలు రావడంతో ఆఫీసర్లు రీసర్వే చేయించి 49 మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఈ తతంగం ముగిసి 10 నెలలు గడిచినా అర్హులైన మిగితా లబ్ధిదారులకు మాత్రం ఇండ్లు మంజూరు చేయలేదు. దీంతో ఆ ఇండ్లు ఆకతాయిలు, మందుబాబులకు అడ్డాగా మారాయి. కిటికీల అద్దాలు ధ్వంసం చేస్తున్నారు. పలుచోట్ల ఎలక్ట్రికల్పరికరాలు చోరీకి గురయ్యాయి.
అర్హులను తేల్చకముందే ప్రారంభించిన కేటీఆర్
మందమర్రి మున్సిపాలిటీలో రెండు విడతల్లో 560 డబుల్ఇండ్ల నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్సర్కార్రూ.20.68 కోట్లు కేటాయించగా 400 ఇండ్లను మూడేండ్ల కింద పూర్తిచేశారు. మిగిలిన 160 ఇండ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ సాగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో దరఖాస్తులు స్వీకరించిన ఆఫీసర్లు.. 521 మంది అర్హుల లిస్టు ప్రకటించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన 286 ఇండ్ల కేటాయింపు కోసం 302 మంది అర్హులని, 1579 మంది అనర్హులంటూ పేర్కొన్నారు.
ఈ రెండు చోట్ల ప్రకటించిన లిస్టుల్లో అర్హులకు చోటుదక్కలేదని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. స్పందించిన కలెక్టర్.. మున్సిపాలిటీల్లో ప్రదర్శించిన ఇండ్ల జాబితా ఫైనల్లిస్టు కాదని, వచ్చిన దరఖాస్తులపై జిల్లా ఆఫీసర్లతో రీ ఎంక్వయిరీ జరిపిస్తామన్నారు. హామీ ఇచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రీ సర్వే చేయలేదు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్మందమర్రి, క్యాతనపల్లిలో పర్యటించిన ప్రతిసారీ డబుల్బెడ్రూంఇండ్లను ఆఫీసర్లతో పరిశీలిస్తూ.. పండుగ, పబ్బం, కేసీఆర్ బర్త్‌డే పేరుతో కేటాయించకుండా కాలం గడిపారు.
ఇండ్లకు కనీస వసతులు కల్పించకుండానే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న హడావుడిలో అప్పటి మంద్రి కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభింపజేశారు. నేటికీ మందమర్రి, క్యాతనపల్లిలోని ఇండ్ల వద్ద రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. క్యాతనపల్లిలో డ్రైయినేజీ పంపులైన్ల కోసం నెలల కిందట మెటీరియల్తీసుకొచ్చి పక్కన పడేశారు.
బెల్లంపల్లి, చెన్నూరులో ఏండ్లుగా సాగుతున్న పనులు
బెల్లంపల్లిలో కన్నాల శివారు జాతీయ రహదారిని ఆనుకొని 2017 జూన్10న డబుల్ ఇండ్ల నిర్మాణానికి నాటి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. రూ.9.68 కోట్ల అంచనాతో 160 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించినా నేటికీ 100 ఇండ్లు కూడా పూర్తికాలేదు. కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లించకపోవడంతో ఆలస్యమైంది. చెన్నూరు పట్టణ శివారులో ఎన్‌హెచ్ 63 పక్కనున్న ఇరిగేషన్ కుంటలో 2020లో 300 ఇండ్ల నిర్మాణం చేపడితే పనులు పునాదులకే పరిమితమయ్యాయి. జన్నారం మండంలో 400 ఇండ్లు మంజూరైనా ఎక్కడా పునాదులు కూడా తీయలేదు.