
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నంబర్ 194లోని భూములకు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పలువురు ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. నాగారం గ్రామంలో సర్వే నెం.181, 182, 194, 195లో భూదాన్ భూములకు సంబంధించి పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఉన్నతాధికారుల పాత్రపై ఆరోపణల నేపథ్యంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐపీఎస్‌లు వేర్వేరుగా 4 అప్పీళ్లు దాఖలు చేశారు.
అప్పీలు దాఖలు చేసినవారిలో ఐపీఎస్‌లు రవిగుప్తా, తరుణ్‌జోషి, బి.కె. రాహుల్ హెగ్డే, జితేందర్ కుమార్ గోయల్ భార్య రేణు గోయల్, ఐఏఎస్ జనార్దన్‌రెడ్డి కుమారుడు రాహుల్ బుసిరెడ్డి, ఐపీఎస్‌లు మహేశ్ మురళీధర్ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, ఉమేశ్ షరాఫ్ భార్య రేఖ షరాఫ్‌తోపాటు ప్రైవేటు వ్యక్తి వీరన్నగారి గౌతంరెడ్డి ఉన్నారు.
కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఫిబ్రవరి, మార్చిలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన సింగిల్ జడ్జి ఇందులో ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్‌లు, వారి కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అంతేగాకుండా ఉన్నతాధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందన్న కారణంగా సర్వే నెం.181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.