- ప్లాస్టిక్ ఫ్రీ మేడారం’ పై ప్రచారానికే పరిమితం అవుతున్న ఆఫీసర్లు
- గుట్టుగా సప్లై చేస్తున్న వ్యాపారులు
- వరంగల్ ఏనుమాముల, టైలర్స్ స్ట్రీట్, పిన్నవారి స్ట్రీట్ నుంచి రవాణా
హనుమకొండ, వెలుగు : మేడారం మహా జాతరను ప్లాస్టిక్ ఫ్రీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మేడారం గ్రామంలోని వ్యాపారులతో పాటు అక్కడ షాపులు నిర్వహించే వారికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. కానీ చాలా చోట్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం జరుగుతూనే ఉంది. మేడారంలో కొబ్బరికాయలు, బెల్లం ఇతర సామాగ్రి అమ్మే వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు.
అయితే మేడారంలో వాడుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వరంగల్ నగరం నుంచే తరలుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మేడారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించిన ఆఫీసర్లు అక్రమ రవాణాపై ఫోకస్ చేయకపోవడం వల్లే వరంగల్ నగరం నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పెద్ద మొత్తంలో మేడారం చేరుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పట్టించుకోని ఆఫీసర్లు
గ్రేటర్ వరంగల్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉంది. కానీ వరంగల్ ట్రై సిటీలో అమ్మకాలు విచ్చలవిడిగా జరుపుతున్నా మున్సిపల్ ఆఫీసర్లు లైట్‌గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రేటర్ ఆఫీసర్లు లైట్ తీసుకుంటుండడంతో కొంతకాలం కిందట టాస్క్‌ఫోర్స్ పోలీసులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేసే ఇండస్ట్రీలు, గోదాములపై స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. ఏనుమాములతో పాటు వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న ప్లాస్టిక్ ఇండస్ట్రీలను సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లను స్వాధీనం చేసుకుని మున్సిపల్ ఆఫీసర్లకు అప్పగించారు.
కాగా గ్రేటర్ ఆఫీసర్లు సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం వల్లే టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో పెద్దమొత్తంలో ప్లాస్టిక్ పట్టుబడిందన్న ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న వ్యాపారులు మళ్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బిజినెస్ మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇప్పటికీ ఏనుమాములతో పాటు పిన్నవారి స్ట్రీట్, టైలర్ స్ట్రీట్‌లలోని గోదాముల్లో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు వాటిని తిని మూగజీవాలు కూడా మృత్యువాతపడుతున్నాయి.
దీంతో మేడారం మహాజాతరను ‘ప్లాస్టిక్ రహితం’గా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు మేడారంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్లాస్టిక్‌ను వినియోగించొద్దని వ్యాపారులకు నోటీసులు కూడా ఇస్తున్నారు. అయినా అక్కడి వ్యాపారుల వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యక్షం అవుతోంది. మేడారంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కంట్రోల్ కావాలంటే ముందుగా అక్కడికి సప్లై జరుగుతున్న వరంగల్‌లోనే దానికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది.
కానీ గ్రేటర్ ఆఫీసర్లు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. దీంతోనే ప్లాస్టిక్ బిజినెస్ చేసే వ్యాపారులు గుట్టుగా ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు, ప్లేట్లు వ్యాపారులకు సప్లై చేస్తుండగా.. అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా మేడారానికి తరలిపోతున్నాయి. దీంతోనే ముందుగా వరంగల్‌లోని ప్లాస్టిక్ అడ్డాలకు కళ్లెం వేస్తేనే ప్లాస్టిక్ ఫ్రీ మేడారం సాకారమవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు అడ్డాగా వరంగల్
వరంగల్ నగరంలో చాలా చోట్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గోదాములు ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్‌లోని పిన్నవారి స్ట్రీట్, ఏనుమాముల, టైలర్ స్ట్రీట్ తదితర చోట్ల పెద్దఎత్తున హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. ఆయా ఏరియాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేసే ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి. దీంతోనే ఇక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా ప్రాంతాలకు ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, క్యారీ బ్యాగ్స్ సరఫరా అవుతున్నాయి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేరున ప్రతి నెల రూ.కోట్లలో బిజినెస్నడుస్తోంది. వరంగల్ సిటీలోనే సుమారు 30 వేల వరకు దుకాణాలు ఉండగా, ఇందులో సుమారు 20 వేల దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు జరుపుతుంటాయి. అక్కడి నుంచి నగరంలోని వివిధ షాపులకు సఫరా అవుతున్నాయి. సిటీలో ఉత్పత్తవుతున్న మొత్తం చెత్తలో 25 టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యార్థాలే ఉండడం గమనార్హం.