సింగిల్​ విండో చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం

అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన 9 మంది డైరెక్టర్లు
ఓటింగ్ పై హైడ్రామా.. నెగ్గినట్టు ప్రకటించిన డీసీవో

 
మోత్కూరు, వెలుగు : మోత్కూరు సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డిపై వైస్ చైర్మన్ తోపాటు 9 మంది డైరెక్టర్లు ప్రకటించిన అవిశ్వాసం నెగ్గింది. ఈ అవిశ్వాసంపై నిర్వహించిన ఓటింగ్ ఉత్కంఠగా సాగింది. చైర్మన్ అశోక్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, తమ సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు డ్రా చేస్తున్నారని 9 మంది డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించి మే 21న యాదాద్రి డీసీవో ప్రవీణ్ కుమార్ ను కలిసి నోటీసు ఇచ్చారు. దీంతో జూన్ 11న ఉదయం 11 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తామని డీసీవో ఉత్తర్వులు జారీ చేసి చైర్మన్, వైస్ చైర్మన్ తోపాటు డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారు.

అవిశ్వాసంపై ఓటింగ్ సందర్భంగా క్యాంప్ లో ఉన్న వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, ఆకుల వెంకటేశ్వర్లు, బయ్యని చంద్రశేఖర్, జిట్ట లక్ష్మయ్య, కారుపోతుల ముత్తయ్య, బండ పద్మ, తాళ్లపల్లి స్వామి, బుశిపాక సుజాత మంగళవారం ఉదయం 10.30లోపు నేరుగా సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. 11 దాటినా ఓటింగ్ నిర్వహించాల్సిన డీసీవో ప్రవీణ్ కుమార్ రాకపోవడంతో డైరెక్టర్లు ఆయనకు ఫోన్ చేయగా చైర్మన్ అశోక్ రెడ్డి సహకార ట్రిబ్యునల్ కు వెళ్లి స్టే తెచ్చారని, ఆర్డర్స్ కాపీ అందాల్సి ఉందని తెలిపారు.

ఓటింగ్ ను ఈనెల18కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. దీంతో ఆగ్రహించిన డైరెక్టర్లు, కాంగ్రెస్ లీడర్లు ట్రిబ్యునల్ అధికారికంగా ఉత్తర్వులేవి ఇవ్వలేదని, చైర్మన్ తో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ కార్యాలయ ఎదుట ధర్నాకు దిగారు. స్టే ఆర్డర్స్ రాకున్నా ఓటింగ్ ఎలా ఆపుతారని, మీపై క్రిమినల్ కేసు పెడతామని డీసీవోను హెచ్చరించారు. 11.30 తర్వాత డీసీవో ప్రవీణ్ కుమార్, చైర్మన్ అశోక్ రెడ్డి ఒకేసారి కార్యాలయానికి రావడంతో చైర్మన్ తో కలిసి ఎలా వస్తారని కాంగ్రెస్ లీడర్లు, డైరెక్టర్లు ఆయనను నిలదీశారు.

ఎట్టకేలకు సమావేశం జరిపి ఓటింగ్ నిర్వహించగా చైర్మన్, డైరెక్టర్ల మధ్య వాగ్వాదం జరిగింది. 9 మంది డైరెక్టర్లు చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్టు డీసీవో ప్రకటించారు. సస్పెండైన ఇద్దరు డైరెక్టర్లకు ఓటింగ్ లో పాల్గొనేందుకు అనుమతిచ్చారని, అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఓటింగ్ ఎలా నిర్వహిస్తారని చైర్మన్ అశోక్ రెడ్డి డీసీవోను ప్రశ్నించారు. అవిశ్వాసం నెగ్గినట్టు డీసీవో డైరెక్టర్లతో సంతకాలు తీసుకోగా, చైర్మన్ అశోక్ రెడ్డి సంతకం చేయకుండా వెళ్లిపోయారు.

చైర్మన్ అశోక్ రెడ్డికి మద్దతు తెలిపిన ముగ్గురు డైరెక్టర్లు సామ పద్మా రెడ్డి, దేవసరి రాములు, పురుగుల మల్లయ్య గైర్హాజరయ్యారు. రెండు రోజుల్లో నూతన చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇస్తామని డీసీవో విలేకరులకు తెలిపారు. చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ లీడర్లు అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.