- సిరిసిల్ల జిల్లా శివంగలపల్లె వడ్ల కొనుగోలు సెంటర్ లో ఘటన
కోనరావుపేట,వెలుగు: వడ్ల కొనుగోలు సెంటర్ లో గుండెపోటుతో సింగిల్ విండో డైరెక్టర్ చనిపోయాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లెకు చెందిన ఉప్పల బాల్ రెడ్డి(60) కోనారావుపేట ప్యాక్స్ డైరెక్టర్. అదే సొసైటీకి తన సొంత వడ్లను అమ్మేందుకు తీసుకొచ్చాడు. మంగళవారం కొనుగోలు సెంటర్లో వడ్ల కుప్పులపై టార్ఫాలిన్లు తరలిస్తుండగా గుండెలో నొప్పిగా ఉందని కుప్పకూలాడు.
స్థానిక రైతులు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వెళ్లి సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య భూమవ్వ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సింగిల్ విండో చైర్మన్ బండ నరసయ్య యాదవ్ కోరారు. బాల్ రెడ్డి మృతిపై సింగిల్ విండో పాలకవర్గం సంతాపం తెలిపింది.