సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 24,365 క్యూసెక్కులు వస్తుండగా.. 22,886 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.5 టీఎంసీల నిల్వ ఉంది.
మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. తాజా వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తుతోంది. అలల తాకిడితో గత ఏడాది కట్ట లోపలి భాగంలోని రివిట్‌మెంట్ దెబ్బతిని బుంగపడింది. వరద ప్రవాహం కొనసాగితే నాటి బుంగ మళ్లీ బయటపడే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే కట్టకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక ప్రాజెక్టుకు 17 గేట్లు ఉండగా ఒక గేటు నుంచి నీరు లీకేజీ అవుతున్నా గుర్తించలేకపోయారు. రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో ప్రస్తుతం లీకేజీకి మరమ్మతులు చేసే పరిస్థితి లేకుండాపోయింది.
ALSO READ | నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల మూసివేత
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో భారీగా వరద చేరుతుండగా.. 3 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,404 అడుగులకు (17.079 టీఎంసీలు) చేరుకుంది. మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో తాలిపేరు మధ్యంతర ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాలకు భారీగ ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 46 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. తాలిపేరుతో పాటు చింతవాగు, రోటెంత వాగులు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.