- నాగర్‌కర్నూల్ జిల్లా సింగోటంలో గ్రామస్తులను ఆహ్వానించిన టీచర్లు
సింగోటం (నాగర్‌కర్నూల్) వెలుగు : ‘మీ పిల్లల భవిష్యత్ కోసం మేం మరింత కష్టపడి పనిచేస్తాం... గ్రామంలోని స్కూల్ మంచిగా అయింది.. ఈ నెల 6న నిర్వహించే పేరెంట్స్ మీటింగ్‌కు తప్పకుండా రావాలి’ అంటూ నాగర్‌కర్నూల్ జిల్లా సింగోటం హైస్కూల్ టీచర్లు గ్రామస్తులకు బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. కొల్లాపూర్ మండలం సింగోటంలోని జడ్పీ హైస్కూల్, ప్రైమరీ స్కూల్ అభివృద్ధికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎస్‌డీఎఫ్ నుంచి రూ. రూ.70 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో స్కూళ్లకు రిపేర్లు చేయడంతోపాటు ఆవరణలో పిల్లల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో ఈ నెల 6న మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా స్కూళ్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీఈవో ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. స్కూళ్ల ప్రారంభం అనంతరం పేరెంట్స్‌తో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. దీంతో శనివారం టీచర్లు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి స్కూళ్ల ప్రారంభ కార్యక్రమంతో పాటు పేరెంట్స్ మీటింగ్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు. మంత్రి, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఎదుట సమస్యలను చెబితే, అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పారు.