మెదక్ జిల్లాలో సింగూరు కాల్వల పనులు షురూ

మెదక్ జిల్లాలో సింగూరు కాల్వల పనులు షురూ
  • మొదటి దఫాగా కాల్వలలో పిచ్చి మొక్కలు తొలగింపు
  • ఆ తర్వాత కాల్వలకు  సిమెంట్ లైనింగ్
  • రూ.168.30 కోట్లు మంజూరు

సంగారెడ్డి/పుల్కల్, వెలుగు: సింగూరు కాల్వల రిపేర్ పనులు ఎట్టకేలకు స్టార్ట్ అయ్యాయి. వ్యవసాయానికి నీరు అందించే క్రమంలో కాల్వల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 50 వేల ఎకరాలకు నీరందిస్తూ వచ్చారు. గత బీఆర్ఎస్ హయంలో దాదాపు 12 ఏళ్లుగా కాల్వలకు రిపేర్ పనులు లేక సాగునీటి వినియోగానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. 

 ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ కృషి మేరకు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ సింగూరు కాల్వలకు రిపేర్ పనులు జరుగుతున్నాయి. అధికారుల ప్రతిపాదనలు, మంత్రి సిఫార్సు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.168.30 కోట్లు రిలీజ్ చేసింది. 

మంత్రి దామోదర ఎప్పటికప్పుడు పనుల నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కాల్వలలో పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా మరో 10 రోజుల్లో సిమెంట్ లైనింగ్ పనులు మొదలుపెడుతారు. కాల్వలకు రిపేర్ పనులు చేయలేకపోవడంతో ఈ యాసంగిలో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. రానున్న ఖరీఫ్ సీజన్ లోగా పనులు పూర్తి చేయకపోతే అప్పటికీ కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో పనుల వేగంపై రైతులు స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ పనులు త్వరగా పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

మూడు పంటలకు చుక్కెదురు

సింగూరు ప్రాజెక్టు ద్వారా 50 వేల ఎకరాలకు నిరంధించాల్సి ఉండగా మూడు పంటలకు సాగు నీటిని ఇవ్వలేకపోయారు. అంతకుముందు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తక్కువగా ఉండడంతో సాగునీరు విడుదల చేయలేదు. ఇప్పుడు ప్రాజెక్టు నిండుగా ఉన్నప్పటికీ కాల్వల రిపేర్ పనుల కారణంగా వ్యవసాయానికి నీరు అందకుండా పోయింది. కొందరు బోర్ల ద్వారా వ్యవసాయాన్ని నెట్టుకు వస్తుండగా, మరికొందరు చేసేదేమీ లేక తాత్కాలికంగా వ్యవసాయం మానేసి తోచిన పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మ్యాగ్జిమం రైతులు కాల్వల  ద్వారా వచ్చే నీటిపై ఆధారపడి ఉండడంతో రానున్న ఖరీఫ్ సీజన్ కైనా సాగునీరు అందాలని ఆశిస్తున్నారు.

నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

సింగూరు కుడి, ఎడమ కాల్వల రిపేర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.168.30 కోట్లు మంజూరు  చేసింది. కాల్వల రిపేరు, డిస్ట్రిబ్యూటరీల సిమెంట్ లైనింగ్ పనులకు ఆయా ఫండ్స్ వినియోగిస్తారు. సింగూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన నాటి నుంచి కాల్వల రిపేర్ పనులు చేయలేదు. దీంతో ఇంతకాలం ఆయకట్టుకు సాగునీటి సరఫరాలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. కాల్వల నిర్మాణం జరిగిన మొదట్లో నీటి సరఫరా సాఫీగా జరిగినప్పటికీ కొంత కాలానికి రిపేర్లు లేక కాల్వలు పిచ్చి మొక్కలతో నిండిపోయి సాగునీటి సరఫరాకు ఆటంకాలు ఎదురయ్యాయి. 

సింగూరు నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా 40వేల ఎకరాలు, మరో 10 వేల ఎకరాలు చెరువుల లింక్ ద్వారా సాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాల్వలకు రిపేర్లు తప్పనిసరని గ్రహించిన ప్రభుత్వం వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసి మరమ్మతు పనులు చేయిస్తుంది.