సంగారెడ్డి/ పుల్కల్, వెలుగు: సింగూరు ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లున్నా సగం ఆయకట్టుకు కూడా నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. మెయిన్, డిస్ట్రిబ్యుటరీ కెనాల్స్ లో పూడిక నిండి ముళ్లపొదలు, మట్టిదిమ్మెలు అస్తవ్యస్తంగా మారడంతో చివరిదాకా నీళ్లు వెళ్లడం లేదు. వీటి రిపేర్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేయడంతో రైతుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. టెక్నికల్ సమస్యతో రీటెండర్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో వచ్చే వానకాలం సీజన్ నాటికి కూడా పనులు పూర్తయ్యేలా లేవు.
40 వేల ఎకరాల ఆయకట్టు..
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ వద్ద 29.917 టీఎంసీల కెపాసిటీతో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు 2015లో మొదటిసారి కాల్వల ద్వారా సాగుకు నీళ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. 2016 తర్వాత మూడు సీజన్లకు వరుసగా నీళ్లిచ్చి.. ఆ తర్వాత వివిధ కారణాలతో ఇవ్వలేకపోయారు. మళ్లీ 2021లో కాల్వల ద్వారా సాగునీరు అందిస్తూ వస్తున్నారు.
20 శాతం పనులు చేయలే..
అందోల్, పుల్కల్, చౌటకూర్ మండలాల్లోని రైతులకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2016లో కాల్వల నిర్మాణం చేపట్టింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 80 శాతం పనులు పూర్తి చేసి ఆ మొత్తానికి బిల్లులు తీసుకుని వెళ్లిపోయాడు. మిగతా 20 శాతం పనులు చేయకుండా వదిలేయడంతో చివరి ఆయకట్టుపై ప్రభావం పడింది. బ్యాలెన్స్ పనులకు కొత్తగా ప్రపోజల్స్ పెట్టాలన్నా.. టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో అధికారులు రీ టెండర్ చేయలేదు. దీంతో పెండింగ్ కాల్వలే కాదు పనులు చేసినవి కూడా పూడిక నిండి ముళ్ల పొదలు పెరిగి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. చాలావరకు లైనింగ్ పోయి డ్యామేజ్ అయ్యాయి.
రైతుల్లో ఆందోళన
ఆయకట్టు రైతులు నిరుడు యాసంగిలో 40 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలివ్వడంతో చాలామంది రైతులు అలాగే చేశారు. పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఈ యాసంగిలో మళ్లీ వరి సాగు చేశారు. అయితే కెనాల్స్ అస్తవ్యస్తంగా ఉండడడంతో నీళ్లు వదులుతున్నా చివరి వరకు వెళ్లడం లేదు. కాల్వలు బాగుచేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, బోర్లు, చెరువులపైనే ఆధారపడాల్సి వస్తోందని రైతులు మండిపడుతున్నారు. వానకాలం సీజన్ వరకైనా సమస్య తీర్చాలని కోరుతున్నారు.
కాల్వల ద్వారా నీళ్లివ్వాలి
వరి పంటకు అనుకూలమైన ఈ నేలల్లో సింగూరు నీటి కోసం ఆశపడి ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నం. కాల్వల ద్వారా సింగూరు ఆయకట్టుకు నీళ్లిస్తే బాగుంటది. మొన్నటి యాసంగిలో కాల్వలకు పైపులు బిగించి మోటార్ పెట్టి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం రానున్న వానకాలం సీజన్ లోనైనా సాగునీరు ఇవ్వాలి. అంజయ్య, (రైతు, పెద్దరెడ్డిపేట)
పైఅధికారులకు నివేదిస్తం
ఇదివరకు ఓ ఏజెన్సీకి పనులు అప్పగించడంతో కాల్వల పనులు ఆలస్యమయ్యాయి. ఇంకా 20 శాతం పనులు జరగాల్సి ఉంది. టెక్నికల్ సమస్య వల్ల రీ టెండర్ పిలవలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సింగూరు కాల్వల పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తాం. వారి ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటాం. - విక్రమ్ (డిప్యూటీ ఈఈ)