
- గతంలో నీళ్లు లేవంటూ.. ఇప్పుడు రిపేర్లంటూ నీరివ్వని ఆఫీసర్లు
- ఏడు నెలల కింద మొదలై ఇంకా పూర్తి కాని కాల్వ లైనింగ్ పనులు
- వచ్చే సీజన్‌కు కూడా నీళ్లివ్వడం అనుమానమే...
- ఆందోళనలో ఆయకట్టు రైతులు
సంగారెడ్డి, వెలుగు : పక్కనే ప్రాజెక్ట్.. దాని నిండా నీళ్లు.. అయినా చుక్క నీరు కూడా పొలాలను తడపడం లేదు. ఓ వైపు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రాకపోవడం, మరో వైపు భూగర్భజలాలు అడుగంటి బోర్లు పోయకపోవడంతో రైతులు తమ పంటపొలాలను మూడు సీజన్లుగా పడావు పెడుతున్నారు. ఇదీ సింగూరు ఆయకట్టు పరిధిలోని రైతుల పరిస్థితి. ప్రాజెక్ట్‌లో నీళ్లు లేవంటూ గతంలో రెండు సీజన్లకు నీటిని విడుదల చేయని ఆఫీసర్లు.. తర్వాత కాల్వలకు రిపేర్లు చేస్తున్నామంటూ నీటి విడుదల ఆపేశారు. పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే సీజన్‌కైనా నీళ్లు అందుతాయో.. లేదోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మూడు పంటలకు నీళ్లియ్యలే...
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు వద్ద 29.917 టీఎంసీల సామర్థ్యంతో సింగూరు ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ప్రతి సీజన్‌లో ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వల ద్వారా 40 వేల ఎకరాలు, ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా ఉన్న చెరువుల ద్వారా మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 22.291 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందడం లేదు. గతంలో రెండు సీజన్ల టైంలో ప్రాజెక్ట్‌లో నీరు తక్కువగా ఉండడంతో తాగునీటి అవసరాల కోసమంటూ సాగునీటిని విడుదల చేయలేదు.
ఈ సీజన్‌లో ప్రాజెక్ట్ నిండుగా ఉన్నప్పటికీ రిపేర్ల కారణంగా క్రాప్ హాలీడే ప్రకటించడంతో వ్యవసాయానికి నీరు అందకుండా పోయింది. మొత్తం మూడు సీజన్లుగా ప్రాజెక్ట్ నుంచి నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు బోర్ల ద్వారా అష్టకష్టాల మధ్య సాగు చేస్తుంటే.. మరికొందరు వ్యవసాయాన్ని వదిలి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
పూర్తికాని రిపేర్లు
సింగూరు కాల్వలకు సీసీ లైనింగ్ చేయాలని ప్రభుత్వం ఏడు నెలల కింద శాంక్షన్ ఇచ్చింది. ఈ పనులు చేపట్టేందుకు రూ.168.30 కోట్ల నిధులను సైతం రిలీజ్ చేయింది. ఈ పాటికి సీసీ లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ఇంకా మట్టి పనులే జరుగుతున్నాయి. లైనింగ్ పనిని ఇంకా మొదలే పెట్టలేదు. పనులు ఇలాగే స్లోగా జరిగితే వచ్చే వర్షాకాలం సీజన్ వరకు కూడా పనులు పూర్తి కావని రైతులు అభిప్రాయపడుతున్నారు. మెజార్టీ రైతులు సింగూరు కాల్వ నీటిపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, ఖరీఫ్ సీజన్‌లోగా సీసీ లైనింగ్ పూర్తి చేసి నీటిని అందించాలని కోరుతున్నారు.
మొదటి నుంచీ సమస్యే...
సుమారు రెండు దశాబ్దాల నుంచి సింగూరు కాల్వల ద్వారా సాగునీరు అందించడం సమస్యగానే మారింది. ప్రాజెక్ట్ నిర్మించిన నాటి నుంచి కాల్వల రిపేర్లను పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో పాటు సీసీ సైడ్ వాల్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో సాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
కాల్వల రిపేర్లు, డిస్ట్రిబ్యూటరీల సిమెంట్ లైనింగ్ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.168.30 కోట్లు మంజూరు చేయడంతో సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులంతా భావించారు. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి రిపేర్లు త్వరగా పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
రెండు ఎకరాలు ఎండిపోయింది
సింగూరు కాల్వలను నమ్ముకుని నాకున్న రెండు ఎకరాల్లో వరి సాగు చేసిన. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయని ముందుగానే పంట వేసిన. అయితే కాల్వలకు రిపేర్ చేస్తున్నామని ఆఫీసర్లు చెప్పిన్రు. సింగూరు నీళ్లు రాకపోవడంతో పాటు బోర్లలో కూడా నీరు లేకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. మూడు సీజన్ల నుంచి ఇట్లాగే జరుగుతోంది. ఇప్పటికైనా కాల్వ పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తే బాగుంటది. – నిరుడి పర్వతాలు, రైతు, తడ్దాన్‌పల్లి, చౌటకూర్
మోటర్లు కాలిపోతున్నయి
మూడు పంటలకు సింగూరు నీరు ఇవ్వలేదు. అందుకే అప్పు చేసి బోర్ వేస్తే నీళ్లు పడలే. ఉన్న నీళ్లతో సరిపెట్టుకుందామని రెండు ఎకరాల్లో వరి సాగు చేసి మోటర్లు బిగిస్తే కరెంట్ సమస్య కారణంగా ఇప్పటికే మూడు మోటార్లు కాలిపోయాయి. కాల్వల ద్వారా నీళ్లు ఇస్తే ఏ సమస్య ఉండదు. ఎండాకాలం వచ్చిందంటే భూగర్భజలాలు అడుగంటిపోతాయి. అప్పులు చేసి బిగించిన మోటార్లు కాలిపోతున్నాయి. నాలాగా చాలా మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.– రవికుమార్ రైతు, ఇసోజిపేట, పుల్కల్