పాపాల పుట్టలు పగులుతున్నయ్​ : చిల్ల మల్లేశం

పాపాల పుట్టలు పగులుతున్నయ్​ : చిల్ల మల్లేశం

బంగారు తెలంగాణ పూతతో గత బీఆర్ఎస్ సర్కారు పెట్టిన​ పాపాల పుట్టలు ఒక్కొక్కటే పగులుతున్నయ్​. కాళేశ్వరంలో కొట్టుకపోయిన పంప్​హౌస్​ ల నుంచి.., కుంగి, కూలేందుకు సిద్ధంగా ఉన్న బ్యారేజీల నుంచి.., మిషన్​ భగీరథ కింది పాతిన పాత పైపుల్లోంచి.., ధరణిని ముందు పెట్టి దోచుకున్న వేల కోట్ల విలువైన భూముల్లోంచి.. ఫార్ములా–ఈ రేసుల్లోంచి.. హైదరాబాద్​ ఫ్లై ఓవర్లు, స్కైవాక్​లు, చివరికి రోడ్లు, డ్రైనేజీల్లోంచి.. అవినీతి అనకొండలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నయ్​.

శివబాలకృష్ణలు నోరు విప్పుతున్న కొద్దీ మరిన్ని కాలనాగులు వీటికి జతకూడవచ్చు. పదేండ్లుగా దొరికిందల్లా తిని, నిలువెల్లా కాలకూటంతో కోరలు చాస్తున్న ఈ మిన్నాగులను జాగ్రత్తగా పట్టుకోవడం రేవంత్​ సర్కారు ముందున్న పెద్ద సవాల్.  ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పాములు జారిపోవడమే కాదు, ఉల్టా కాటు వేయగలవు కూడా! 

కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగడం సాధారణ  విషయం ఎంతమాత్రం కాదు. డ్యామ్​ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ నివేదికలను బట్టి సమస్య 6,7,8 బ్లాక్​లకు మాత్రమే పరిమితం కాలేదు. ఒకే డిజైన్​ ప్రకారం కట్టిన మిగిలిన బ్లాకులు, అదే డిజైన్​ ప్రకారం కట్టిన  సుందిళ్ల, అన్నారం బ్యారేజీలూ డేంజర్​ జోన్​లో ఉన్నట్టే!  కానీ ‘రెండు పిల్లర్లు కుంగితే ఏమైంది?’ అంటూ ఇష్యూను చిన్నది చేసి చూపేందుకు కేసీఆర్​ ఫ్యామిలీ విశ్వప్రయత్నాలు చేస్తున్నది.

ఇటీవల సర్కారు చేతికందిన విజిలెన్స్ ప్రిలిమినరీ​ రిపోర్ట్​ను చూస్తే కేసీఆర్​ ఫ్యామిలీ భుజాలు తడుముకోవడం వెనుక అసలు కారణాలు మనకు స్పష్టమవుతాయి. డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని విజిలెన్స్​ నివేదిక తేటతెల్లం చేసింది. డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఎక్స్​ఫర్ట్స్​  కూడా దాదాపు ఇవే విషయాలు చెప్పారు.  

మరి డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు కారణమైనవాళ్లందరినీ చట్టం ముందుకు ఈడ్చి, కోర్టు బోనులో నిలబెట్టే బాధ్యత​ రేవంత్​ సర్కారుపై ఉన్నట్టే కదా! తన మేధస్సును మొత్తం రంగరించి కాళేశ్వరం డిజైన్​ గీశానని చెప్పుకున్న కేసీఆర్​ ముమ్మాటికీ వీరిలో ముందువరుసలో ఉండక తప్పదు! ఈ  విషయం కేసీఆర్​ టీమ్​కు స్పష్టంగా తెలుసు కాబట్టే ఇష్యూను పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీ సాక్షిగా అందమైన అబద్ధాలు ఆడుతున్నారు. రేవంత్​ సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గినా ఈ టీమ్​ చెప్పే అబద్ధాలే నిజాలవుతాయి కూడా!

ఈఎన్సీల నిర్ణయాల వెనుక ఎవరున్నారు?

బ్యారేజీ వైఫల్యానికి కారణాలు అన్వేషించడానికి డ్యామ్​సేఫ్టీ అథారిటీ ​ 20 రకాల రిపోర్టులు అడిగితే  ఇరిగేషన్ ఆఫీసర్లు కీలకమైన డ్రాయింగ్స్​, రివర్​ ఇన్​స్పెక్షన్ , క్వాలిటీ కంట్రోల్​లాంటి డాక్యుమెంట్లు కూడా ఇవ్వలేకపోయారు. బ్యారేజీ రాఫ్ట్​ ఫౌండేషన్, దానికి దిగువన కటాఫ్ ​వాల్స్ ​నిర్మాణం డ్రాయింగ్స్​ప్రకారం కనెక్ట్ చేయలేదని,​ రాఫ్ట్​ ఫౌండేషన్​కు ఎగువ వేసిన సికంట్​ఫైల్స్​ ​దెబ్బతిని ​కింది  నుంచి ఇసుక కొట్టుకుపోయిందని డ్యామ్​ సేఫ్టీ అథారిటీ లోని ఆరుగురు నిపుణులు ప్రాథమికంగా తేల్చారు.

దీని అర్థం డిజైన్​ ప్రకారం రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదనే కదా! బ్యారేజీ నిర్మాణానికి ముందు వరదకు అడ్డంగా కట్టిన కాఫర్​ డ్యామ్​ను తొలగించకపోవడం, 2019 జూన్​19న  కేసీఆర్​ మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించాక ఇప్పటివరకు కాంట్రాక్ట్​ సంస్థగానీ, ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​గానీ ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్ చేపట్టకపోవడం, నిర్మాణం తర్వాత కొద్దిరోజులకే సీసీ బ్లాకులు కొట్టుకుపోయినా రిపేర్లు చేయకపోవడం, బ్యారేజీలో లోపాలు ఒక్కొక్కటే బయటపడ్తున్నా  కాంట్రాక్ట్​సంస్థ కు చెల్లింపులు చేయడం, 2020 ఫిబ్రవరి 29 నుంచే డిఫెక్ట్​  లయబులిటీ పీరియడ్ ​ప్రారంభమైందని సర్టిఫికెట్​ఇష్యూ చేయడం, కాంట్రాక్టర్​ బ్యాంక్​ గ్యారంటీలను రిలీజ్​ చేయాలని లేఖ రాయడం వెనుక కేవలం ఈఎన్సీలు మాత్రమే ఉన్నారంటే నమ్మగలమా? ఇరిగేషన్​ శాఖను తన మెడకు టైగా కట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్​కు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? 

2016లో  రూ.1,853 కోట్లతో  టెండర్లు పిలిచిన

మేడిగడ్డ బ్యారేజీ ఇన్​టైంలోనే పూర్తయినప్పటికీ అంచనా వ్యయాన్ని రూ.4,321 కోట్లకు ఎందుకు, ఎవరి కోసం పెంచారో తేల్చాల్సిన బాధ్యత కూడా రేవంత్​ సర్కారు పైనే ఉంది. ఒక్క మేడిగడ్డే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి రిజర్వాయర్ ను​, ప్రతి పంప్​హౌస్​నూ  లోతుగా శోధించి, ప్రజాధనాన్ని మేసిన ప్రతి అనకొండను పట్టుకోవాలని తెలంగాణ సమాజం ఇవాళ కోరుకుంటున్నది!

పాత పైపుల తుప్పు వదలాలే..

గత ప్రభుత్వం రూ.30వేల కోట్లకు పైగా ఖర్చు చేసి తెచ్చిన మిషన్​భగీరథ స్కీంలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. పాత పైపులకే కొత్త కనెక్షన్లు ఇచ్చి, పాత ట్యాంకులకే కొత్తగా రంగులు వేసి,  ఆ మాటున కోట్లు పక్కదారి పట్టించారనే అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేసినప్పటికీ తరుచూ పైపులైన్లు పగిలిపోవడంపై కొత్త సర్కారు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఫీల్డ్​విజిట్​ చేయించగా, లోగుట్టు రట్టయింది. సెకండరీ, ఇంట్రా పైప్​లైన్ల పేరుతో రూ.6 నుంచి 7 వేల కోట్లు పక్కదారి పట్టించారనే అనుమానాలతో విజిలెన్స్​ ఎంక్వైరీకి ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. 

మున్సిపాలిటీల్లోనూ భారీగా అవినీతి కంపు..

మాజీ మంత్రి కేటీఆర్​ ప్రాతినిధ్యం వహించిన మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్  శాఖలో గడిచిన నాలుగేండ్లలో దాదాపు రూ.35 వేల కోట్ల  పనులు జరిగితే ఇందులో కమీషన్ల రూపంలోనే దాదాపు రూ.5 వేల కోట్లు దండుకున్నారని ప్రభుత్వానికి ఉప్పందింది. జీహెచ్​ఎంసీతో పాటు  వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో తమకు కావాల్సిన వాళ్లకే కాంట్రాక్టులు దక్కేలా చూసి నాసిరకం పనుల ద్వారా, చేయని పనులకు దొంగ బిల్లులు పెట్టడం ద్వారా వేల కోట్ల రూపాయలు దండుకున్నట్లు భావిస్తున్నారు.

గతంలో ఈ శాఖను చూసిన మినిస్టర్​కు  సన్నిహితులైన ఒకరిద్దరు ఈ తతంగం నడిపించారని తెలుస్తోంది. హైదరాబాద్​ లో రోడ్లు, డ్రైనేజీలు, ఎలివేటెడ్​ కారిడార్లు, స్కైవాక్​లు, అండర్​ పాస్​లు, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో  ఇంటర్నల్​ రోడ్లు, నాలాలు, బ్యూటిఫికేషన్​ వర్క్స్​ షాడో కాంట్రాక్టర్లతో 
చేయించారని తెలియడంతో సర్కారు విజిలెన్స్​​ ఎంక్వైరీ ప్రారంభించింది. 

భూదందాల్లో బీఆర్​ఎస్​ పెద్దలు, బ్యూరోక్రాట్లు

ఇక ధరణి పోర్టల్​ను అడ్డుపెట్టుకొని గత బీఆర్ఎస్​ సర్కారు పెద్దలు, అస్మదీయులు బినామీల పేర్లతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాహా చేశారనే ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. కానీ ఈ భూదందాల్లో లీడర్లతోపాటు నాటి ​ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పని చేసిన బ్యూరోక్రాట్ల  పేర్లూ ఇప్పుడు బయటకొస్తున్నాయి.

వీరిలో పలువురు రిటైర్డ్ ఐఏఎస్​లతో పాటు సర్వీస్​లో ఉన్న ఐఏఎస్ ​అధికారులు ఉండడం సంచలనం సృష్టిస్తోంది. మాజీ సీఎస్​ సోమేశ్​ కుమార్​ భార్య  పేరిట- రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 25 ఎకరాల భూమి ఉండడం కలకలం రేపింది. ఎకరా రూ.3 కోట్ల పైన ఉన్న ఆ ఏరియాలో ఏకంగా 25 ఎకరాలు ఎలా కొన్నారనేది  అంతుచిక్కని  ప్రశ్న. ఇరిగేషన్ ​స్పెషల్ ​సీఎస్​గా పని చేసి రిటైర్డ్​  అయిన రజత్​కుమార్ కు​ సైతం మహబూబ్​నగర్ ​జిల్లా బాలానగర్​  మండలం హేమాజీపూర్​లో  15.15 ఎకరాల భూమి, ఆయన భార్య, కుటుంబ సభ్యుల పేరుతో  52 ఎకరాల భూమి ఉన్నట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది.

ధరణిలో సర్కారు భూముల వివరాలు మార్చడం ద్వారా గత సర్కారులో కీలకంగా ఉన్న  మంత్రులు, వారి బినామీల పేరుతో వందల ఎకరాలు ఆక్రమించారని, బహిరంగ మార్కెట్​లో లక్షల కోట్ల విలువైన ఈ భూములను వెనక్కి తెప్పించడం ఎలాగనే దానిపై రేవంత్​ సర్కారు సీరియస్​ ఎఫర్ట్​ పెట్టినట్లు తెలుస్తున్నా ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.

రిటర్న్​ గిఫ్ట్​ తప్పొద్దు

చివరగా బీఆర్ఎస్​ అంటున్నట్లు కాంగ్రెస్​ కు వచ్చిన 64 సీట్లు బొటాబొటీ మెజారిటీయే కావచ్చు. కానీ వందకు పైగా సీట్లున్న బీఆర్​ఎస్​ను 39 సీట్లకు తగ్గించడం అంటే కర్రు కాల్చి వాతపెట్టడమే! అందువల్ల కాంగ్రెస్​ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకంటే కూడా,  బీఆర్ఎస్​లోని అక్రమార్కులతో జైలు ఊచలు లెక్కపెట్టించడమే  రేవంత్​ సర్కారు తమ ఓటర్లకు ఇచ్చే రిటర్న్​ గిఫ్ట్​ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పంప్​హౌస్​ల మునక పాపం ఎవ్వరిది?

ఎఫ్​ఆర్​ఎల్​ దిగువన  కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు నీటమునిగాయని బీఆర్​ఎస్​ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి ఇటీవల బాంబు పేల్చారు. అన్నారం పంప్​హౌస్​ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్​హౌస్​ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే  120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీని వల్ల ఈ రెండు పంప్​హౌస్​లు ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నాయని, గోదావరికి మళ్లీ భారీ వరదలు వస్తే మళ్లీ నీటమునిగి వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.

 జులై 14, 2022న వచ్చిన గోదావరి వరదల్లో మునిగిన కన్నెపల్లి పంప్​హౌస్​లో సేఫ్టీ వాల్​ కూలి 17 మోటర్లు దెబ్బతిన్నయ్. రిపేర్ల కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుండగా, ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్​ సంస్థ భరించిందా? లేదంటే సర్కారే పెట్టుకుందా? అనే ప్రశ్నలకు ఇప్పటికీ జవాబు లేదు. 

ఓఆర్​ఆర్​టోల్ ​టెండర్​లో గోల్​మాల్​

ప్రైమ్​ ఏరియాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి  జీవో 58, 59 కింద బినామీలకు రెగ్యులరైజ్​ చేయించి, తర్వాత డెవలప్​ చేసుకున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. ఓఆర్ఆర్  టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏకంగా 30 ఏండ్ల కాలానికి ముంబై కంపెనీ ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి గత రాష్ట్ర ప్రభుత్వం  రూ.7,380 కోట్లకే కట్టబెట్టిన సంగతి తెలిసిందే.

అగ్రిమెంట్​ జరిగిన తీరును, రద్దు చేసే అవకాశాలను  పరిశీలిస్తున్నట్లు  అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్​లో ఫార్ములా–ఈ రేస్​ నిర్వహణకు ప్రభుత్వం రూ.55 కోట్ల అడ్వాన్స్​ను అప్పనంగా చెల్లించడం వెనుక  కేటీఆర్ పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి మున్సిపల్​ మంత్రి ఫోన్​లో ఇచ్చిన ఆదేశాల మేరకే తాను ఆ మొత్తం చెల్లించినట్లు  స్పెషల్​ సీఎస్ ​అర్వింద్​కుమార్ ఇటీవల పేర్కొనడంతో మబ్బు తెర తొలగిపోయింది.  ఈ ఘటనలో కేటీఆర్​కు చిక్కులు తప్పకపోవచ్చు! 

శివబాలకృష్ణ అవినీతే ఓ సాక్ష్యం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌‌‌‌ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్‌‌‌‌ ‌‌‌‌శివబాలకృష్ణ ఉదంతం కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. ఈయనగారి  అక్రమ ఆస్తులు తక్కువలో తక్కువ రూ.650 కోట్లు ఉన్నట్లు తేలడంతో గత సర్కారు హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారుల భూదందాలు ఏ రేంజ్​లో జరిగాయో అర్థం చేసుకోవచ్చు.  తన అక్రమాల గైడ్​ హెచ్‌‌‌‌ఎండీఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్‌‌‌‌ అరవింద్‌‌‌‌కుమార్‌‌‌‌ ​అని శివబాలకృష్ణ ఆధారాలతో బయటపెట్టడంతో ఈ అంశం కీలక మలుపు తిరిగింది.

పర్మిషన్లు, వివాదాల పరిష్కారం పేరుతో రియల్​ ఎస్టేట్​ డెవలపర్స్​ నుంచి, మల్టీ స్టోర్​ బిల్డర్స్​ నుంచి అరవింద్​కుమార్​ ఎలా ముడుపులు తీసుకునేవారో, డ్రైవర్స్, గన్‌‌‌‌మెన్​ పేర్లతో పెద్దసంఖ్యలో ప్లాట్లు,  ఫ్లాట్లు ఎలా రిజిస్ట్రేషన్​ చేయించుకునేవాడో శివబాలకృష్ణ పూసగుచ్చినట్లు చెప్పాడు కూడా! నార్సింగిలోని ఓ 12 ఎకరాల భూవివాదం సెటిల్‌‌‌‌మెంట్​ చేసినందుకు  రూ.10 కోట్లు తీసుకున్నాడన్నది అరవింద్​కుమార్​పై ప్రధాన ఆరోపణ. మరి ఈ అరవిందుడితో, ఆయన వెనుక ఉన్న నాటి అమాత్యుడితో రేవంత్​ జైలు ఊచలు లెక్కపెట్టిస్తారా? అన్నది  ప్రధాన ప్రశ్న. 

‘కాళేశ్వరం అక్రమార్కుల్లో ఒకడైన ఈఎన్సీని తట్ట, బుట్ట సర్ది పంపించినం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో చెప్పడాన్ని సోషల్​మీడియాలో కొందరు ట్రోల్ ​చేశారు. ‘మిమ్మల్ని ఎన్నుకున్నది అవినీతిపరులకు బొకే ఇచ్చి  సాగదోలడానికి కాదు, చంచల్​గూడ జైలుకు పంపడానికి! ఆ పని చేయకపోతే మిమ్మల్ని సైతం శంకరగిరి మాన్యాలకు పంపుడు ఖాయం’ ఇది కాంగ్రెస్​ సర్కారుకు  ఓ నెటిజెన్​ హెచ్చరిక! తెలంగాణ సమాజం ఏమి ఆశించి బీఆర్ఎస్​ను గద్దె దింపిందో రేవంత్​ సర్కారు అర్థం చేసుకోకపోతే దానికి మూల్యం చెల్లించాల్సి రావచ్చు. అందుకే కొత్త సర్కారు  వేస్తున్న ప్రతి అడుగును తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తున్నది. 

పంప్​హౌస్​ల మునక పాపం ఎవ్వరిది?

ఎఫ్​ఆర్​ఎల్​ దిగువన  కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు నీటమునిగాయని బీఆర్​ఎస్​ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి ఇటీవల బాంబు పేల్చారు. అన్నారం పంప్​హౌస్​ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్​హౌస్​ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే  120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీని వల్ల ఈ రెండు పంప్​హౌస్​లు ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నాయని, గోదావరికి మళ్లీ భారీ వరదలు వస్తే మళ్లీ నీటమునిగి వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.  

జులై 14, 2022న వచ్చిన గోదావరి వరదల్లో మునిగిన కన్నెపల్లి పంప్​హౌస్​లో సేఫ్టీ వాల్​ కూలి 17 మోటర్లు దెబ్బతిన్నయ్. రిపేర్ల కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుండగా, ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్​ సంస్థ భరించిందా? లేదంటే సర్కారే పెట్టుకుందా? అనే ప్రశ్నలకు ఇప్పటికీ జవాబు లేదు. 

- చిల్ల మల్లేశం,
 సీనియర్​ జర్నలిస్ట్​