
Mutual Funds: దేశంలో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారితో పాటు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి 2022 నుంచి భారీగా మ్యూచువల్ ఫండ్స్ లోకి డబ్బు వచ్చి చేరుతోంది. దీంతో అనేక ఏఎంసీలు కొత్త ఫండ్స్ లాంచ్ చేయటంతో పాటు తక్కువ మెుత్తంతో ఎస్ఐపీలను ప్రారంభించటానికి అవకాశాలు కూడా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
అయితే 2022 తర్వాత తొలిసారిగా భారీగా ఎస్ఐపీల మూసివేత గణనీయంగా పెరగటం మారిన ఇన్వెస్టర్ల ప్రవర్తన, వారి విశ్వాసాన్ని సూచిస్తోందని ఎలారా క్యాపిటల్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ల అస్థిరతల సమయంలో కూడా స్థిరమైన పనితీరును కనబరచి ఎస్ఐపీలు ప్రసిద్ధి చెందాయి. ప్రధానంగా 2022-23 రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన సమయంలో మనం దీనిని గమనించవచ్చు. అప్పటి నుంచి ఎస్ఐపీ ఖాతాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడుల వ్యూహంతో మార్కెట్లోకి వస్తున్న వారిని సూచించింది.
కట్ చేస్తే 2025లో కథ పూర్తిగా మారిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఎస్ఐపీ పెట్టుబడి ఖాతాలను ఇన్వెస్టర్లు భారీ సంఖ్యల్లో క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడైంది. మార్కెట్లలో పెరిగిన ప్రమాదాలు, అంతర్జాతీయ పరిస్థితులతో మార్కెట్లలో వచ్చిన మార్పులే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఇక్కడి ఆగిపోలేదు. ఏకకాలంలో పెద్ద మెుత్తాల్లో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారుల సంఖ్య కూడా భారీగా నెమ్మదించింది. ఇదే క్రమంలో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ పెట్టుబడులు కూడా భారీగా తగ్గుదలను నమోదు చేశాయి.
Also Read:-యూపీఐ యూజర్లకు షాక్.. త్వరలో చెల్లింపులపై జీఎస్టీ, ఎంత దాటితే..?
ఇదే తరహా బిహేవియర్ ఇన్వెస్టర్ల నుంచి కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్ సమయంలో కనిపించింది. జనవరి 2025 తర్వాతి నుంచి థీమాటిక్ ఫండ్స్ కొత్త ఫోలియోల పెరుగుదల 75% క్షీణించింది. అలాగే స్మాల్ క్యాప్ ఫండ్స్ 67%, మిడ్ క్యాప్ ఫండ్స్ 63% తగ్గుదలను చూశాయి. అయితే ఫ్లెక్సీక్యాప్స్, వాల్యూ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ తక్కువ ప్రభావాన్ని చూశాయని వెల్లడైంది. జూన్ 2024 తర్వాత ఇన్వెస్టర్లు ఎక్కువగా మిడ్ క్యాప్స్, థీమ్యాటిక్ ఫండ్స్, సెక్టోరల్ ఫండ్స్ కొనుగోలు చేయగా ప్రస్తుతం వాటిని చాలా మంది వీడుతున్నారు.