
శివ్వంపేట, వెలుగు: సారూ.. మా భూములు కాపాడండి అంటూ భూ బాధితులు మంత్రి దామోదర్ రాజనర్సింహకు మొరపెట్టుకున్నారు. శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్ ఆసీఫ్, ఇంతియాజ్, బురాన్ గురువారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఇనాం భూములను వంశపారపర్యంగా సాగు చేసుకుంటున్నామన్నారు.
సర్వే నంబర్ 47 నుంచి 66, 70, 74, 77, 80, 81, 83, 84, 86, 87లలో ఉన్న 429 ఎకరాల 31 గుంటల ఇనాం భూమి పై కోర్టులో స్టే ఉన్నప్పటికీ లెక్కచేయకుండా బీఆర్ఎస్ బడా నాయకులు రెవెన్యూ ఆఫీసర్లు కుమ్మక్కై బినామీల పేర్ల మీద ఓఆర్సీ సర్టిఫికెట్ ఇష్యూ చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాము వంశపారపర్యంగా కబ్జాలో ఉన్నా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు. దీనికి స్పందించిన మంత్రి దామోదర్ నర్సాపూర్ఆర్డీఓ, శివ్వంపేట తహసీల్దార్‌తో వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని బాధితులు తెలిపారు.
మంత్రి దామెదరకు నాయకుల విషెస్
మునిపల్లి: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దామోదర రాజనర్సింహాకు గురువారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి విషెస్ చెప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆందోల్‌లో తన గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానన్నారు. సన్మానించిన వారిలో ఎంపీటీసీ బుర్కల పాండు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.