సర్​ తేజ్​ బహదూర్​ సప్రూ.. చివరి వరకూ రెబల్​గానే...

సర్​ తేజ్​ బహదూర్​ సప్రూ..  చివరి వరకూ రెబల్​గానే...

సర్ తేజ్ బహదూర్ సప్రూ 1875 డిసెంబర్ 6న పుట్టాడు. అంబికా ప్రసాద్ సప్రూ, గౌరా సప్రూ అనే జమీందారు దంపతుల ఏకైక కుమారుడు.  స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, చక్కటి ఆలోచనాపరుడు, నిజాయితీ కలవాడు. సప్రూ ప్రసంగాలు పూర్తిగా విలక్షణంగా ఉండేవి. తీవ్రంగా, ముక్కు సూటిగా, పదాడంబరం లేకుండా మాట్లాడేవాడు. కోర్టులో ఎలా వాదిస్తారో అలా ఉండేవి. ప్రతి విషయంపై చాలా విశ్లేషించి మాట్లాడేవాడు. ఆయన విమర్శనా విధానం ఎన్నో విధాలుగా ఆయనను పైకి రాకుండా అడ్డుపడింది. 

సప్రూ మొదటినుంచీ కాంగ్రెస్‌‌తో కలిసి పనిచేశాడు. కానీ.. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం కాగానే జాతీయ కాంగ్రెస్​ను విడిచివెళ్లాడు. 1907-16లో కాంగ్రెస్ విడిపోయినప్పుడు కూడా ఆయన దాని పట్ల ఏమంత సానుభూతి చూపలేదు. సాంఘిక, కుల విషయాల్లో సప్రూ ఎప్పుడూ తిరుగుబాటు స్వభావం కలవాడే. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల విషయంలోనైనా సనాతన భావాలు లేకుండా మాట్లాడేవాడు. ముఖ్యంగా బాల్యవివాహాలు లాంటి విషయాల్లో చివరిదాకా ఆయన రెబల్​గానే ఉన్నాడు.

 హింసతో కూడిన లేక చట్టబద్ధం కాని ఏ విషయం మీదైనా నిర్భయంగా, స్వేచ్ఛగా మాట్లాడేవాడు. తన దగ్గరి మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధువుల పట్ల హృదయ పూర్వకమైన ప్రేమ చూపేవాడు. ఆయన ఎంతగా ప్రయాణాలు చేసేవాడంటే ఆయనకు ఇండియా ఎంత కొట్టిన పిండో యూరోపు కూడా అంతే. ఆయనకు మాతృదేశమన్నా, ఉర్దూ భాష అన్నా ఎంతో ఇష్టం. అందుకే ఎంత బిజీగా ఉన్నా వీలు చేసుకుని ఉర్దూ భాషా సాహిత్య పోటీల్లో పాల్గొనేవాడు. 

సప్రూ మనసు రాజకీయాల కన్నా ‘లా’కే ఎక్కువగా అంకితమై ఉండేది. ఆయన హృదయం ఎప్పుడూ ‘రాజ్యాంగ చట్టం’ గురించే ఆలోచించేది. చట్టం మీద బాగా పట్టున్న వ్యక్తి. ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఏ సలహాదారుడూ చేయనంత సాయం సప్రూ చేశాడు. 

సప్రూ దయా స్వభావాన్ని, స్వతంత్రాలను తెలిపే ఒక సంఘటన... అప్పట్లో  ‘ఇండెంచర్డ్‌‌ ఇండియన్ లేబర్’ అనే ఒక దుష్ట పద్ధతి ఉండేది. దాని ప్రకారం.. సంయుక్త సంస్థానాలైన బిహార్, మద్రాస్​ నుంచి బ్రిటిష్​ కాలనీలకు శ్రామికులను తరలించడానికి అమతించేవారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలను అర్థం చేసుకున్న గవర్నమెంట్ ఇండియా ఇండెంచర్డ్‌‌ సిస్టమ్​ని రద్దు చేయాలి అనుకుంది. కానీ.. కొన్ని ఒత్తిళ్లకు లొంగిపోయి ఆ విధానాన్ని మరో 5 సంవత్సరాలపాటు కొనసాగించడానికి ఒప్పుకుంది. 

ఆ నిర్ణయాన్ని సప్రూ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ తర్వాత అలహాబాద్​లో ఒక బహిరంగ సభ ఏర్పాటయ్యింది. ఆ సభలో సప్రూ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. అప్పుడు అలహాబాద్​లో వచ్చిన ఆ ప్రజావ్యతిరేకత, మరికొన్ని కారణాల వల్ల ఆ విధానానికి గవర్నమెంట్ స్వస్తి పలికింది​. 

దక్షిణాఫ్రికాలో నివసించే భారతీయులకు పౌరసత్వాన్ని ఇవ్వడానికి జనరల్ స్మట్స్ తిరస్కరించడంతో సప్రూ ఆయనను ఎదిరించాడు. ‘మీతోపాటే మేము కూడా ఈ సామ్రాజ్యాల్లో సమాన పౌరసత్వాన్ని కోరుకుంటున్నామ”ని కోర్టులో వాదించాడు సప్రూ. ఇంతకన్నా బలంగా ఎప్పుడూ కూడా సమాన పౌరసత్వం కేసు మీద వాదన జరిగి ఉండకపోవచ్చు.  సమస్య గురించి సప్రూ చాలా ఉద్వేగంతో మాట్లాడి, భారతీయుల ఇజ్జత్​ నిలబెట్టాడు. 

1923 సంవత్సరం చివరికల్లా సప్రూ పూనాలో జరిగిన ‘ఆల్ - ఇండియా లిబరల్ కాన్ఫరెన్స్​’కు అధ్యక్షత వహించాడు. అప్పుడు కూడా ఆయన విదేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న జాతి వివక్షత, నీచంగా చూడడం గురించి తీవ్రంగా మాట్లాడాడు. ఆయన కాంగ్రెస్​కు దూరమైనా భారతీయుల దుస్థితి విషయంలో మహాత్మాగాంధీ వెంటే నిలిచాడు. ఆ తర్వాత ‘సంస్కరణల కమిటీ’కి ఎంతో సేవ చేశాడు. 1929 నుంచి 1934 మధ్య కొత్త రాజ్యాంగం గురించిన వివిధ కమిటీల్లో, కాన్ఫరెన్స్​లలో పాల్గొన్నాడు. తర్వాత సర్​ తేజ్ బహదూర్ సప్రూ లాయర్​గా తన పాత వృత్తిలోకి తిరిగి వెళ్లాడు.

- మేకల మదన్​మోహన్​ రావురిటైర్డ్​ హెడ్​ మాస్టర్

కవి, రచయిత