వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ శనివారం (జనవరి 18) ప్రకటించారు. సీటీ జట్టులో ఒక్క తెలుగు ప్లేయర్‌కు కూడా చోటు దక్కలేదు. తెలుగు ప్లేయర్స్ నితీష్ రెడ్డి, తిలక్ వర్మతో పాటు హైదరాబాదీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ ముగ్గురు ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు.
పాపం నితీష్..
భారత్, ఆస్ట్రేలియా మధ్యన ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుపై టెస్ట్ అరంగ్రేటం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఎలాంటి బెరుకు లేకుండా తొలి సిరీస్‌లోనే రాణించాడు. ఈ టోర్నీలో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ తన అద్భుత ప్రదర్శనతో నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి జట్టు ఆపదలో ఉన్న సమయాల్లో ఆదుకున్నాడు.
మరీ ముఖ్యంగా మెల్బోర్న్ వేదికగా ప్రతిష్టాత్మ ఎంసీజీ స్టేడియంలో జరిగిన టెస్ట్‌లో నితీష్ రెడ్డి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలమై జట్టు పీకల్లోతూ కష్టాల్లో ఉండగా.. నేనున్నాంటూ నితీష్ టీమిండియాను ఆదుకున్నాడు. నిప్పులు చెరిగే ఆసీస్ బౌలర్ల బంతులను ఎంతో అనుభవం గల ఆటగాడిలా ఎదుర్కొంటూ జీవితాంతం గుర్తుండిపోయేలా సెంచరీ చేసి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు.
Also Read : మనోళ్లు ఒళ్లు వంచక తప్పదు
ఈ టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికీ.. నితీష్ రెడ్డి పేరు మాత్రం మారుమోగిపోయింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసాంతం రాణించిన నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ కోటాలో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కావడం పక్కా అని ప్రచారం జరిగింది. కానీ, బీసీసీఐ తెలుగు కుర్రాడి షాక్ ఇచ్చింది. ప్రతిష్టాత్మకమైన మెగా ఛాంపియన్స్ ట్రోఫీకి నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయకుండా పక్కకి పెట్టింది. దీంతో ఐసీసీ టోర్నీలో ఆడాలన్న నితీష్ కుమార్ రెడ్డి కల సాకారం కావాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.
సిరాజ్ ఔట్.. లెక్కలోనే లేని తిలక్ వర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మరో ఇద్దరు తెలుగు ప్లేయర్స్ మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మకు కూడా నిరాశే ఎదురయ్యింది. ఈ ఇద్దరూ హైదరాబాదీ ప్లేయర్లను మెగా టోర్నీకి బీసీసీఐ ఎంపిక చేయలేదు. గత కొంతకాలంగా టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతోన్న మహ్మద్ సిరాజ్.. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆశించిన మేర రాణించలేదు.
దీంతో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ సిరాజ్‌ను పక్కకు పెట్టింది. సిరాజ్ స్థానంలో టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని ఎంపిక చేసింది. గాయం కారణంగా 14 నెలలుగా ఆటకు దూరమున్న షమీని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడం గమనార్హం. ఇక, మరో తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు కూడా బీసీసీఐ మొండి చేయి చూపించింది.
గత కొంత కాలంగా టీ20ల్లో నిలకడగా రాణిస్తోన్న తిలక్ వర్మ.. వన్డే ఫార్మాట్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కుతుందని ఆశ పెట్టుకున్నాడు. కానీ బీసీసీఐ అసలు తిలక్ వర్మను సెలక్షన్ పరిగణలోకే తీసుకోలేదని తెలిసింది. దీంతో జాతీయ జట్టు తరుఫున మెగా ఐసీసీ టోర్నీ ఆడాలన్న తిలక్ వర్మ మరి కొంత సమయం ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ముగ్గురు తెలుగు ప్లేయర్లు సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ ముగ్గురికి ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కకపోవడంతో.. ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేకుండా ఈ మెగా టోర్నీ జరగనుంది.