- వస్త్ర పరిశ్రమలో కొత్తగా 2 వేల మంది మహిళలకు ఉపాధి
- మరో వారం రోజుల్లో మహిళల ఎంపిక ప్రక్రియ మొదలు
- వస్త్ర ఉత్పత్తులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న బెంగళూరు టెక్స్ పోర్ట్ కంపెనీ
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సిరిసిల్లలో 2022లో చేపట్టిన అపెరల్ పార్క్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. బెంగళూరుకు చెందిన ‘టెక్స్ పోర్ట్’కంపెనీతో వస్త్ర ఉత్పత్తులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం అపెరల్ పార్క్‌లో జూకీ కుట్టు మిషన్లను అమర్చనున్నారు. ఆ తర్వాత వారం రోజుల్లో మహిళలను ఉద్యోగం ఎంపిక చేయనున్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మహిళలకు ఉపాధి దొరకడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ గ్రామ శివారులో 7.5 ఎకరాల స్థలంలో అపెరల్ పార్క్ నిర్మాణ పనులు 2022 జులైలో ప్రారంభించారు. మొత్తం రూ.44 కోట్ల వ్యయంతో టీఎస్‌ఐఐసీ నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం అపెరల్ పార్క్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
బెంగళూరుకు చెందిన టెక్స్ పోర్ట్ కంపెనీతో డీల్..
సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో క్లాత్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరుకు చెందిన టెక్స్ పోర్ట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. గార్మెంట్ రంగంలో టెక్స్ పోర్ట్ కంపెనీ ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. తాజాగా సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో క్లాత్ ఉత్పత్తి కోసం చేనేత జౌళి శాఖ అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పటికే గోకులదాస్ యాజమాన్యం గ్రీ నిడీల్ కంపెనీ పేరుతో అపెరల్ పార్క్‌లో రెండేండ్ల కిందట నుంచే 500 మంది మహిళలతో వస్త్రాల ఉత్పత్తిని ప్రారంభించింది. తాజాగా టెక్స్ పోర్ట్స్ తన ఉత్పత్తులను ప్రారంభించనుండటంతో ఈ కంపెనీలో
మరో 2 వేల మంది మహిళలకు ఉపాధి లభించనుంది. మరో వారం రోజుల్లో మహిళల ఎంపిక ప్రక్రియను ప్రారంభించనుంది. వస్త్ర ఉత్పత్తులపై ప్రాథమిక అవగాహన ఉన్న మహిళలను ఎంపిక చేసి టెక్స్ పోర్ట్ కంపెనీ ఉచిత ట్రైనింగ్ ఇవ్వనుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి అపెరల్ పార్క్ వస్త్ర ఉత్పత్తులకు అనుగుణంగా మరో శిక్షణ కూడా ఇస్తారు.
జీన్స్, టీ షర్ట్స్‌ఉత్పత్తి..
సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో టెక్స్ పోర్ట్ కంపెనీ జీన్స్, టీషర్ట్స్, ఉడ్డీస్ లాంటి డ్రెస్స్‌లను ఉత్పత్తి చేస్తోంది. వీటికి సంబంధించిన యారన్ బెంగళూరు నుంచే దిగుమతి అవుతోంది. మార్కెట్‌లో ఆదరణ ఉన్న దుస్తులను ఎంపిక చేసుకోకపోవడంతో కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే గ్రీన్ నిడీల్ సంస్థ సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో ఇన్నర్ వేర్, స్పోర్ట్స్‌కు ఉపయోగించే క్లాత్‌లను ఉత్పత్తి చేస్తుంది.
జీన్స్, టీషర్ట్స్ లాంటి ఉత్పత్తులు ప్రారంభిస్తే మోడ్రన్ దుస్తుల ఉత్పత్తికి సిరిసిల్ల అపెరల్ పార్క్ వేదిక కానుంది. తమిళనాడులోని కోయంబత్తూర్, సేలం లాంటి ప్రాంతాలకు తీసిపోకుండా సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వస్త్రాలకు సైతం మార్కెట్ పెరగనుంది.
వారం రోజుల్లో ఎంపిక ప్రక్రియ..
సిరిసిల్ల అపెరల్ పార్క్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వస్త్రాల ఉత్పత్తికి బెంగళూరు ఎక్స్ పోర్ట్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. వారం రోజుల్లో గార్మెంట్ రంగంలో ఆసక్తి ఉన్న మహిళలను ఎంపిక చేస్తారు. టెక్స్ పోర్ట్ కంపెనీతో తయారు చేసే దుస్తులకు అనుగుణంగా మహిళలకు శిక్షణ ఇస్తారు. అపెరల్ పార్క్‌లో 2 వేల మంది మహిళలకు ఉపాధి లభించనుంది. సిరిసిల్ల నేతన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉపాధి లభిస్తుండటంతో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
- అశోక్ రావు, చేనేత డిప్యూటీ డైరెక్టర్, రాజన్న సిరిసిల్ల జిల్లా